Begin typing your search above and press return to search.

బిగ్ రిలీఫ్: దేశం సామూహిక వ్యాప్తి దశకు చేరుకోలేదట

By:  Tupaki Desk   |   21 July 2020 4:00 AM GMT
బిగ్ రిలీఫ్: దేశం సామూహిక వ్యాప్తి దశకు చేరుకోలేదట
X
దేశంలో అంతకంతకూ పెరుగుతున్న కరోనా కేసులు విపరీతమైన భయాందోళనకు గురి చేస్తున్న సంగతి తెలిసిందే. రోజు గడిస్తే చాలు నలభై వేల వరకూ కేసులు నమోదువుతన్నాయి. ఇదే పరిస్థితి కొనసాగితే.. ఈ నెలాఖరు నాటికి రోజుకు యాభై నుంచి అరవై వేల వరకూ కేసులు నమోదైనా ఆశ్చర్యపోవాల్సిన అవసరం లేదంటున్నారు. భారీ ఎత్తున పెరుగుతున్న కేసుల నేపథ్యంలో కొందరు చేస్తున్న వ్యాఖ్యలు.. వినిపిస్తున్న వాదనలు దేశ ప్రజల్లో కొత్త భయాన్ని.. ఆందోళనకు గురి చేస్తున్నారు.

దేశంలో పెరుగుతున్నకేసుల్ని చూస్తే.. కరోనా వైరస్ సామాజిక వ్యాప్తి జరిగినట్లుగా విశ్లేషణలు తెర మీదకు వస్తున్నాయి. అయితే.. ఈ వాదనల్ని తీవ్రంగా ఖండించారు ఎయిమ్స్ డైరెక్టర్ రణ్ దీప్ గులేరియా. ఈ తరహా వ్యాఖ్యలకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. దేశ రాజధాని ఢిల్లీ లాంటి మహానగరాల్లో వైరస్ తీవ్ర దశకు చేరుకున్నట్లు పేర్కొన్నారు. దేశంలో వైరస్ వ్యాప్తి సామూహిక వ్యాప్తి దశకు చేరలేదని.. అందుకు తగ్గ ఆధారాలు ఏమీ లేవన్నారు.

కేవలం కొన్ని ప్రాంతాల్లో స్థానికంగా వ్యాప్తి బాగా జరిగినట్లుగా చెప్పారు. వైరస్ కు కేంద్రాలుగా దేశంలోని చాలా నగరాలు ఉన్నాయని.. ఇక్కడే కేసులు ఎక్కువగా ఉన్నట్లు వెల్లించారు. ఢిల్లీ లాంటి నగరంలో కరోనా కేసుల నమోదు తీవ్ర దశకు చేరుకున్నట్లు చెప్పిన ఆయన.. మిగిలిన నగరాల్లో ఆ దశకు ఇంకా చేరుకోలేదన్నారు.

కరోనా వ్యాక్సిన్ ప్రయోగాలు జరుగుతున్న విషయాన్ని చెప్పిన ఆయన.. తొలిదశలో 18 నుంచి 55 ఏళ్ల వయసు వారిపైనే వ్యాక్సిన్ ప్రయోగాలు చేస్తామని.. రెండో దశలో 12 ఏళ్ల నుంచి 65 ఏళ్ల లోపు వారిపైనా చేపట్టనున్నట్లు చెప్పారు. ఎయిమ్స్ డైరెక్టర్ మాటలు తాజాగా భరోసాను ఇవ్వటం ఖాయమని చెప్పకతప్పదు.