Begin typing your search above and press return to search.

ఈ గణాంకాలు చూస్తే కరోనా కేసుల అసలు లెక్క తేలుతుంది

By:  Tupaki Desk   |   18 July 2020 3:00 AM GMT
ఈ గణాంకాలు చూస్తే కరోనా కేసుల అసలు లెక్క తేలుతుంది
X
భారత్ లో కరోనా వైరస్ కలకలం రేపుతోన్న సంగతి తెలిసిందే. కరోనాపై నానాటికీ పెరిగిపోతోన్న కేసుల సంఖ్య ప్రజల గుండెల్లో గుబులు రేపుతోంది. తాజాగా గురువారం బులిటెన్ విడుదలయ్యే నాటికి భారత్ లో కరోనా కేసుల సంఖ్య 10 లక్షలు దాటడంతో...ఆ భయం మరింత ఎక్కువైంది. గడచిన 59 రోజుల్లోనే దాదాపు 9 లక్షలకు పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయంటూ గణాంకాలతో సోషల్ మీడియాలో పోస్టులు హల్చల్ చేస్తున్నాయి. ఇక, వాట్సాప్ యూనివర్సిటీలో, ఫేస్ బుక్ కాలేజీల్లో అయితే సెప్టెంబరు నాటికి భారత్ లో కరోనా విలయ తాండవం చేయబోతోందని జోరుగా ప్రచారం జరుగుతోంది. దీనికి తోడు సెప్టెంబరు 1 నాటికి భారత్ లో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 35 లక్షలకు చేరుకునే అవకాశముందంటూ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌(ఐఐఎస్సీ) బృందం అంచనా వేసిన గణాంకాలు ప్రజలను మరింత భయపెట్టాయి.

ఈ నేపథ్యంలో తాజాగా కేంద్ర వైద్యఆరోగ్య శాఖ ఆసక్తికర గణాంకాలను వెల్లడించింది. భారత్‌‌లో ప్రస్తుతం ఉన్న 10 లక్షల కరోనా పాజిటివ్ కేసుల్లో కేవలం 3,42,756 కేసులు మాత్రమే యాక్టివ్ గా ఉన్నాయని వెల్లడించింది. మన దేశంలో రికవరీ రేటు ఆశాజనకంగా దాదాపు 63.33 శాతం ఉందని ప్రకటించింది. ప్రస్తుతం కరోనా పాజిటివ్ కేసుల్లో భారత్ ప్రపంచంలో మూడో స్థానంలో ఉంది. ఇప్పుడు నమోదవుతున్న కేసుల సంఖ్యను బట్టి రాబోయే నెలన్నర రోజుల్లో పరిస్థితి ఎలా ఉంటుందనే విషయాన్ని ఐఐఎస్సీ బృందం అంచనా వేసింది. సెప్టెంబరు 1కి పాజిటివ్‌ కేసుల సంఖ్య 35 లక్షలకు చేరుకుంటుందని అంచనా వేసింది. దీంతో, కేంద్ర ఆరోగ్య శాఖ ఆశాజనకంగా ఉండే గణాంకాలు వెల్లడించింది.

దేశంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 3,42,756 మాత్రమేనని ప్రకటించింది. 63.33 శాతం రికవరీ రేటుతో 6.35 లక్షల మంది కరోనా బారినుంచి కోలుకున్నారని తెలిపింది. ప్రపంచ జనాభాలో 135 కోట్ల మంది భారత్ లో ఉన్నారని, జనాభా విషయంలో ప్రపంచంలోనే రెండో స్థానంలో భారత్ ఉందని తెలిపింది. ఇంత జనాభా ఉన్న భారత్ వంటి అతి పెద్ద దేశంలో 10 లక్షల మంది జనాభాకు 727.4(728మంది) కరోనా కేసులు నమోదయ్యాయని వెల్లడించింది. భారత్‌లో ఇప్పటివరకూ 25,062 మంది కరోనా వల్ల మరణించారని తెలిపింది. భారత్ లో కరోనా కట్టడికి అన్ని చర్యలు తీసుకుంటున్నామని, ప్రజలు ఆందోళన చెందవద్దని తెలిపింది.