Begin typing your search above and press return to search.

జనాభాకు తగ్గ వైద్యులు లేరు: భారత్ లో ఆందోళన రేపుతున్న నివేదిక

By:  Tupaki Desk   |   15 July 2020 7:15 AM GMT
జనాభాకు తగ్గ వైద్యులు లేరు: భారత్ లో ఆందోళన రేపుతున్న నివేదిక
X
దేశంలో ఉన్న లోపాలన్నింటినీ.. సమస్యలను మహమ్మారి వైరస్ వ్యాప్తితో బయటపడుతున్నాయి. ఏ రంగానికి అధిక ప్రాధాన్యమివ్వాలో వైరస్ వ్యాప్తితో ప్రభుత్వాలకు తెలిసి వచ్చింది. ఈ సందర్భంగా ఇటీవల ఓ నివేదిక విడుదల అయ్యింది. ఆ నివేదిక భారతీయులను ఆందోళన కలిగించే రీతిలో ఉంది. అదేమిటంటే.. భారత్ లో ప్రతీ 10 వేల మందికి ఎనిమిది మంది కంటే కొంచెం తక్కువగానే వైద్యులు ఉన్నారని తేలింది. ఈ విషయాన్ని ప్రముఖ అంతర్జాతీయ మెడికల్‌ జర్నల్‌ లాన్సెట్‌ తెలిపింది.

వైరస్ వ్యాప్తి నేపథ్యంలో అంతర్జాతీయంగా వివిధ దేశాల పరిస్థితిని విశ్లేషిస్తూ భారత్‌లో ఉనషన పరిస్థితిపైన కూడా నివేదిక విడుదల చేసింది. ఆ నివేదికలో అనేక అంశాలను ప్రస్తావించింది. భారతదేశంలో మూడు నెలల లాక్‌డౌన్‌ సడలింపుల తరువాత కేసులు మరింతగా పెరుగుతున్నాయని పేర్కొంది. మహారాష్ట్ర, ఢిల్లీ, గుజరాత్‌ రాష్ట్రాలు అత్యధికంగా ప్రభావితమయ్యాయని గుర్తు చేసింది. ఆయా రాష్ట్రాల్లో ప్రభావిత ప్రాంతాల్లో సైన్యాన్ని మోహరించాల్సిన పరిస్థితి ఏర్పడిందని తెలిపింది. మున్ముందు వైరస్‌ మరింత వేగంగా వ్యాప్తి చెందడానికి అవకాశాలున్నాయని తేల్చిచెప్పింది. అయితే దీనికి ప్రధాన కారణాన్ని వివరించింది.

లాక్‌డౌన్‌ సమయంలో ఆరోగ్య వ్యవస్థను బలోపేతం చేయడంలో దేశవ్యాప్తంగా వైఫల్యం జరిగిందని స్పష్టం చేసింది. ఆరోగ్య సంరక్షణ వ్యవస్థలను సమర్థవంతంగా ఉపయోగించలేదని ల్యాన్సెట్‌ ఆరోపించింది. వైద్య ఆరోగ్యరంగంలో మౌలిక సదుపాయాల కల్పన, పునర్నిర్మాణం జరగలేదని వివరించింది. వైద్య, ఆరోగ్య సిబ్బంది నియామకం జరగలేదని ఇప్పటికైనా దృష్టిసారించాలని నివేదికలో కోరింది. రాబోయే నెలల్లో వైరస్‌ను అంతం చేయడానికి ఇది కీలకమని ల్యాన్సెట్‌ గుర్తు చేసింది. అమెరికా, బ్రెజిల్‌తోపాటు భారతదేశంలోనూ జూన్‌ 26 నుంచి జూలై 3వ తేదీ వరకు లక్ష కన్నా ఎక్కువ కొత్త కేసులు నమోదు కావడాన్ని ల్యాన్సెట్‌ ప్రస్తావించింది.

ఈ మహమ్మారి వ్యాప్తితో తీవ్రంగా ప్రభావితమైన వారెవరో వివరించింది. ఈ వైరస్ పేదలను ఎక్కువగా కాటేస్తోందని ఆందోళన వ్యక్తం చేసింది. ప్రపంచ జనాభాలో 66 శాతం మంది పేదలు ఉండగా ఆ వర్గాలను మరింత పేదలుగా మార్చే దుస్థితి వైరస్ వలన ఏర్పడిందని ల్యాన్సెట్‌ పేర్కొంది. ఈ సందర్భంగా లాన్సెట్ ఆరోగ్య రంగం విషయంలో సౌదీ అరేబియా అద్భుతంగా పని చేస్తోందని తెలిపింది. ఆరోగ్య రంగానికి సౌదీ అరేబియా మరింత బడ్జెట్‌ను కేటాయించిందని గుర్తు చేసింది. ప్రపంచవ్యాప్తంగా ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ప్రకటించిన ఐదు నెలల తరువాత కూడా వైరస్‌ సంక్లిష్టత కొనసాగుతూనే ఉందని లాన్సెట్ ఆందోళన వ్యక్తం చేసింది.