Begin typing your search above and press return to search.

ఢిల్లీ ప్రజలు మరీ ఇంత తెలివితక్కువ వారా?

By:  Tupaki Desk   |   3 April 2021 4:30 AM GMT
ఢిల్లీ ప్రజలు మరీ ఇంత తెలివితక్కువ వారా?
X
మిగిలిన వారితో పోలిస్తే.. మహానగరాల్లో బతికేటోళ్లకు కాస్త తెలివి.. వివేచన.. ముందుజాగ్రత్త చర్యలు ఎక్కువన్న భావన చాలామంది వ్యక్తం చేస్తుంటారు. కరోనా పుణ్యమా అని.. నగరాల కంటే కూడా చిన్న చిన్న ఊళ్లలోని వారే ఈ విషయంలో బెటరన్న విషయం స్పష్టమైంది. కరోనా వ్యాప్తిని అడ్డుకునేందుకు తీసుకోవాల్సిన జాగ్రత్తల విషయంలో మహానగర జీవి కంటే కూడా.. మారుమూల పల్లెటూరు వారే అప్రమత్తంగా ఉన్నారని చెప్పాలి.

ఆ మాటకు వస్తే.. నగరాల్ని వైరస్ కేంద్రాలుగా మార్చేసిన చాలామంది.. తమ దరిద్రాన్ని పల్లెల్లకు తీసుకెళ్లిన మహానుభావులు ఉన్నారు. తొలిదశలో అంతా గందరగోళం.. అనుమానాలు.. అంతకు మించిన అపోహలు.. ప్రిపేర్ కాపోవటం లాంటివి ఉండటంతో కేసుల సంఖ్య పెరిగిందనుకోవచ్చు. తొలిదశకు రెండో దశకు మధ్య గ్యాప్ బాగానే ఉండి.. కరోనా తీవ్రతను కళ్లారా చూసిన తర్వాత.. రెండోసారి విరుచుకుపడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి కదా?

కానీ.. ఈ విషయంలో దేశవ్యాప్తంగా నగరాల్లోని ప్రజలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని చెప్పాలి. ఎక్కడి దాకానో ఎందుకు? దేశ రాజధాని ఢిల్లీ సంగతే చూస్తే.. కేసుల సంఖ్య అంతకంతకూ పెరుగుతున్నప్పటికి.. జాగ్రత్తల విషయంలో ఇప్పటికి నిర్లక్ష్యంనే వ్యవహరిస్తున్నారు. 24 గంటల వ్యవధిలో ఢిల్లీలో మూడున్నర వేల కేసులు నమోదువుతున్నాయి. ఇంత భారీగా కేసులు వెలుగు చూస్తున్నా.. వైరస్ వ్యాప్తికి బ్రేకులు వేసేలా మాత్రం జనాలు వ్యవహరించటం లేదు.

మిగిలిన చోట్లను వదిలేద్దాం. మెట్రో లాంటి ప్రజారవాణాను ఉపయోగించే వారంతా.. కాస్తో కూస్తో చదువుకున్న వారు... వైరస్ మీద అవగాహన ఉన్న వారే కదా? కానీ.. తాజాగా ఢిల్లీ మెట్రోలో కరోనా నిబంధనల్ని పాటించని వారి విషయంలో జరిపిన తనిఖీల్లో ఒక రోజులో 529 కేసులు నమోదు చేయటం చూస్తే.. ఢిల్లీలో కేసులు ఎందుకు పెరుగుతున్నాయో ఇట్టే అర్థమవుతుంది. ఇంత దారుణ నిర్లక్ష్యాన్ని ప్రదర్శిస్తే.. తగిన మూల్యం చెల్లించక తప్పదు.