Begin typing your search above and press return to search.

వణికించేస్తున్న కొత్త సమస్య

By:  Tupaki Desk   |   19 May 2021 10:30 AM GMT
వణికించేస్తున్న కొత్త సమస్య
X
కరోనా వైరస్ సమస్య నుండి బయటపడిన రోగులను కొత్త సమస్య వణికించేస్తోంది. అదే బ్లాక్ ఫంగస్ అనే కొత్తరకం సమస్య. కరోనా వైరస్ తగ్గిన రోగుల్లో ప్రధానంగా షుగర్ వ్యాధి ఉన్న వారిలో ఈ బ్లాక్ ఫంగస్ సమస్య బాగా ఎక్కువగా కనబడుతోందని వైద్య నిపుణులు ఆందోళన వ్యక్తంచేస్తున్నారు. మొదట్లో ఈ సమస్య ఎక్కడో మహారాష్ట్రలో ఉందని వైద్యులు గుర్తించారు. అయితే అదే సమస్య ఇపుడు ఏపిలోని చాలా జిల్లాలను పట్టి పీడిస్తోంది.

తాజాగా బయటడిన కేసులను ప్రకారం 13 జిల్లాల్లో సుమారు 300 బ్లాక్ ఫంగస్ కేసులు రికార్డయ్యాయి. ఒక్క గుంటూరు జిల్లాలోనే 200 కేసులు బయటపడటం రోగుల కుటుంబాలతో పాటు డాక్టర్లను కూడా టెన్షన్ పెట్టేస్తోంది. బ్లాక్ ఫంగస్ సోకిన రోగుల్లో కళ్ళు, దవడ ప్రాంతాలపైన తీవ్ర ప్రభావం చూపుతున్నట్లు తెలుస్తోంది. ముందుగానే గుర్తిస్తే బ్లాక్ ఫంగస్ సమస్యను కూడా నయంచేవచ్చని డాక్టర్లు చెప్పారు. అయితే ముందుగా గుర్తించటమే పెద్ద సమస్యగా తయారైంది.

నెల్లూరు జిల్లాలో ఇప్పటికి 10 కేసులను గుర్తిస్తే అందులో ఇద్దరు ఇప్పటికే మరణించారు. కృష్ణాజిల్లాలో కూడా ఒక కేసు వెలుగు చూసింది. అయితే చికిత్సలో ఉండగానే రోగి మరణించారు. పశ్చిమగోదావరి జిల్లాలో ఇద్దరు కరోనా రోగులు వైద్యం తర్వాత కోలుకుని ఇళ్ళకు వెళ్ళిపోయారు. అయితే ఇద్దరు బ్లాక్ ఫంగస్ సమస్యతో వెంటనే మరణించారు. అనంతపురం, కర్నూలు జిల్లాల్లో పదిమంది రోగులకు బ్లాక్ ఫంగస్ సోకిందని వైద్యులు నిర్ధారించి చికిత్స చేయిస్తున్నారు. వీరిలో ముగ్గురికి ఇప్పటికే సమస్య సోకిన కంటిని తొలగించేశారు.

ఒకవైపు కరోనా వైరస్ సమస్యతోనే అల్లాడిపోతున్న రోగులు, డాక్టర్లకు బ్లాక్ ఫంగస్ సమస్య గురుచుట్టు మీద రోకటిపోటు లాగ తయారైందనే చెప్పాలి. కరోనా సోకిన రోగుల్లోనే పూర్తిస్ధాయి రోగనిరోధక శక్తి తగ్గిపోతోంది. ఇలాంటి వారిపై బ్లాక్ ఫంగస్ దాడి చేయటంతో రోగులు తట్టుకోలేకపోతున్నారు. కొత్త సమస్య ప్రధానంగా షుగర్ వ్యాధిగ్రస్తుల్లోనే ఉంటుందని అనుకుంటున్నా షుగర్ లేని వాళ్ళలో కూడా డాక్టర్లు గుర్తించారు. మొత్తంమీద కరోనా వైరస్ సైడ్ ఎఫెక్టులో అనేక రూపాల్లో బయటపడుతో జనాలను వణికించేస్తోంది.