Begin typing your search above and press return to search.

వైసీపీ నేత‌ల మౌనం ఎందుకు... ఏం జ‌రిగింది..?

By:  Tupaki Desk   |   15 May 2021 1:31 PM GMT
వైసీపీ నేత‌ల మౌనం ఎందుకు... ఏం జ‌రిగింది..?
X
ప్ర‌స్తుతం రాష్ట్రంలో క‌రోనా జోరు ఎక్కువ‌గా ఉంది. రోజులు ప‌దుల సంఖ్య‌లో మ‌ర‌ణాలు సంభ‌విస్తున్నాయి. కేంద్రం నుంచి స‌హాయ స‌హ‌కారాలు అంతంత మాత్రంగానే ఉంటున్నాయి. ఆక్సిజ‌న్ లేక‌పోవ‌డం.. మౌలిక స‌దుపాయాల కొర‌త వంటివి వైసీపీ ప్ర‌భుత్వాన్ని తీవ్ర ఇర‌కాటంలోకి నెడుతున్నాయి. అయిన‌ప్ప‌టికీ.. ప్ర‌జ‌ల‌కు.. వైద్య పరంగా చేయాల్సిన అన్ని ప‌నుల‌ను ఉన్నంత‌లో బాగానే చేస్తున్నారు. సీఎం జ‌గ‌న్ నిత్యం క‌రోనా ప‌రిస్థితిపై చ‌ర్చించ‌డం.. అధికారుల‌కు సూచ‌న‌లు చేయ‌డం, మౌలిక స‌దుపాయాలు, ఆక్సిజ‌న్ కొర‌త‌ను త‌గ్గించ‌డం వంటి చ‌ర్య‌ల‌ను ఆగ‌మేఘాల‌పై చేప‌ట్టారు. చేప‌డుతున్నారు కూడా..!

అయితే.. ఒక‌వైపు ప్ర‌భుత్వం ఎన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నా.. వైద్యులు నిరంత‌రాయంగా సేవ‌లు అందిస్తున్నా.. క్షేత్ర‌స్థాయిలో మాత్రం క‌రోనా.. అన్ని రాష్ట్రాల్లో ఉన్న‌ట్టుగానే ఏపీలోనూ విస్త‌రిస్తోంది. కేసులు 25 వేల మార్క్ చేరుకుంటున్నాయి. మృతులు అధికారిక లెక్క‌ల ప్ర‌కార‌మే విప‌రీతంగా పెరుగుతున్నారు. ఇక‌, దీనిని రాజ‌కీయంగా త‌మ‌కు అనుకూలంగా మార్చుకున్న టీడీపీ నేత‌లు.. జ‌గ‌న్ స‌ర్కారు విఫ‌ల‌మైంద‌ని.. జ‌గ‌న్ రోమ్ చ‌క్ర‌వ‌ర్తిని త‌ల‌పిస్తున్నార‌ని.. ఆయ‌న ప‌బ్జీగేమ్ ఆడుకుంటున్నార‌ని.. వ్యాక్సి న్ల‌ను అడ‌గ‌లేక పోతున్నార‌ని.. ఇలా అనేక రూపాల్లో చంద్ర‌బాబు నుంచి చోటా నాయ‌కుడు వ‌ర‌కు అంద‌రూ జ‌గ‌న్‌ను విమ‌ర్శిస్తున్నారు.

వాస్త‌వానికి తిరుప‌తి ఉప పోరు త‌ర్వాత‌.. టీడీపీ పుంజుకోవ‌డం క‌ష్ట‌మ‌ని అనుకున్నారు. కానీ.. క‌రోనా నేప‌థ్యంలో ఇప్పుడు తిరుప‌తి పార్ల‌మెంటు ఉప పోరులో జ‌రిగిన ప‌రాభ‌వాన్ని టీడీపీ ప‌క్క‌న పెట్టి.. ప్ర‌భుత్వంపై తీవ్ర‌స్థాయిలో విమ‌ర్శ‌లు గుప్పిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా వ్యాక్సిన్ ఉద్య‌మం పేరిట నాయ‌కులు స‌ర్కారుపై ఉద్య‌మం ప్ర‌క‌టించారు. మ‌రి ఇంత జ‌రుగుతుంటే.. వైసీపీ నాయ‌కులు ఏమ‌య్యారు? ఏ ఒక్క మంత్రికానీ, ఏ ఫైర్ బ్రాండ్ నాయ‌కులు కానీ ఎందుకు స్పందించ‌డం లేదు.

ప్ర‌భుత్వం త‌ర‌ఫున అన్ని చ‌ర్య‌లు తీసుకుంటున్నామ‌ని చెబుతున్నా.. క్షేత్ర‌స్థాయిలో అదే ప‌రిస్థితి ఉన్నా.. దీనిని స‌మ‌ర్ధించుకునేందుకు మంత్రులు కానీ.. కీల‌క నాయ‌కులు కానీ.. ఎందుకు ప్ర‌య‌త్నించ‌డం లేద‌నే ప్ర‌శ్న‌లు తెర‌మీదికి వ‌స్తుండ‌డం గ‌మ‌నార్హం. జ‌గ‌న్ అటు కేంద్ర ప్ర‌భుత్వాన్ని ఏ విష‌యంలోనూ నిల‌దీయ‌లేక‌పోతుండ‌డం కూడా ఆయ‌న ప్ర‌తిప‌క్షాల‌కే కాకుండా.. ఇటు స్వ‌ప‌క్షానికి కూడా మైన‌స్ అవుతున్నారు.