Begin typing your search above and press return to search.

సెకండ్ వేవ్ :రేపటి నుండి మధ్యాహ్నం 2 వరకే ..తర్వాత అన్ని బంద్ !

By:  Tupaki Desk   |   27 April 2021 8:31 AM GMT
సెకండ్ వేవ్ :రేపటి నుండి మధ్యాహ్నం 2 వరకే ..తర్వాత అన్ని బంద్ !
X
సెకండ్ వేవ్ లో ఆంధ్రప్రదేశ్ ప్రజలను కరోనా వైరస్ వణికిస్తోంది. ప్రభుత్వం కరోనా కట్టడి కోసం తీసుకుంటున్న చర్యలేవి కూడా కరోనా కి అడ్డుకట్ట వేయలేకపోతున్నాయి. దీనితో రాష్ట్ర వాసుల్లో ఆందోళన మొదలైంది. రాష్ట్రంలో ఆ జిల్లా ఈ జిల్లా అన్న తేడా లేకుండా ప్రతి జిల్లాలో కూడా కరోనా కేసులు భారీగా పెరిగిపోయాయి. దీనితో ఇప్పటికే పలు నగరాలని కంటైన్మెంట్ జోన్స్ గా ప్రకటించారు. అలాగే అక్కడ కరోనా వ్యాప్తి ఎక్కువగా జరగకుండా కఠినమైన ఆంక్షలు అమలు చేస్తున్నారు. అలాగే ప్రజలు కూడా స్వీయ నియంత్రణ ను ఫాలో అవుతూ , అత్యవసరం అయితే తప్ప ఇంటి నుండి బయటకి రాకండి అని చెప్తున్నారు.

ఈ నేసథ్యంలో విజయవాడలోని ముఠా కార్మికులు , వ్యాపారులు ఓ కీలక నిర్ణయం తీసుకున్నారు. కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో రేపటి నుండి మధ్యాహ్నం 2 గంటల వరకే వ్యాపారాలు నిర్వహించాలని విజయవాడ ఛాంబర్ అఫ్ కామర్స్ అధ్యక్షుడు కొనకళ్ల విద్యాధరరావు తెలిపారు. కరోనా విజృంభణ భయంకరంగా ఉన్న ఈ నేపథ్యంలో షాపులని పూర్తిగా తెరచి ఉంచడం మంచిది కాదు అని, విజయవాడ లోని వ్యాపారాలు మధ్యాహ్నం 2 లోపల షాపులు మూసేయాలని కోరారు.

ఇక రాష్ట్రంలో రోజు రోజుకీ నమోదు అయ్యే కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య భారీగా పెరుగుతోంది. నిన్న ప్రభుత్వం ప్రకటించిన వివరాల ప్రకారం.. రాష్ట్ర వ్యాప్తంగా గడచిన 24 గంటల్లో 74,972 శాంపిల్స్ ని పరీక్షించగా 9,881 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో రాష్ట్ర వ్యాప్తంగా పాజిటివ్ కేసుల సంఖ్య 10,43,441 చేరింది. వీరిలో ఇప్పటివరకు 9,40,574 మంది డిశ్చార్జ్ అయ్యారు. అలాగే, గడచిన 24 గంటల్లో 4,431 మంది డిశ్చార్జ్ అవగా, ప్రస్తుతం రాష్ట్రంలో యాక్టివ్ కేసుల సంఖ్య 95,131కి పెరిగింది.రాష్ట్రంలో గత 24గంటల్లో 51మంది మృతి చెందగా.., మొత్తం మరణాల సంఖ్య 7,736కి చేరింది.