Begin typing your search above and press return to search.

మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ జగన్ కీలక ఆదేశాలు

By:  Tupaki Desk   |   16 April 2021 5:30 AM GMT
మహమ్మారి విరుచుకుపడుతున్న వేళ జగన్ కీలక ఆదేశాలు
X
ఉన్న తెలుగు రాష్ట్రాల్లో కరోనా కేసుల వ్యాప్తి అంతకంతకూ పెరిగిపోతోంది. శరవేగంగా నమోదవుతున్న కొత్త కేసులకు తగ్గట్లు.. ఆసుపత్రుల్లో బెడ్లు నిండుకుంటున్నాయి. దీంతో.. రోగులు తీవ్ర ఇబ్బందులకు గురి కావాల్సి వస్తోంది. హైదరాబాద్ మహానగరంలోని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఈ రోజున బెడ్లు దొరకటం మహా కష్టంగా మారింది. భారీ ఎత్తున పైరవీలు.. గంటల కొద్దీ నిరీక్షణ తప్పటం లేదు. ఇలాంటి వేళ.. ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి కీలక ఆదేశాల్ని జారీ చేశారు.

కరోనా బాధితులు ఎవరైనా సరే ఫోన్ చేస్తే.. మూడు గంటల వ్యవధిలో పడకలు కేటాయించాలన్నారు. 104 నంబరు ద్వారా కోవిడ్ సేవలు అందాలని.. వీటిపై ప్రచారం చేయాలన్నారు. కొవిడ్ నివారణ చర్యలు.. టీకా పంపిణీపై మంత్రి ఆళ్ల నానితో కలిసి ఉన్నతాధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా పెద్ద ఆసుపత్రులు.. కార్పొరేట్ ఆసుపత్రులకు స్పష్టమైన ఆదేశాల్ని జారీ చేశారు.

ఆరోగ్య శ్రీ జాబితాలో ఉన్న ఆసుపత్రులు.. ప్రైవేటు ఆసుపత్రుల్లో ఉన్న పడకల వివరాలు అధికారుల వద్ద ఉండాలని.. చికిత్స ఫీజుల వివరాల్ని రోగులకు అర్థమయ్యేలా బోర్డుల్లో ఉండాలన్నారు. ప్రభుత్వం పేర్కొన్న ఫీజుల కంటే అధికంగా వసూలు చేస్తే.. చర్యలు తప్పవన్నారు. వినతుల కోసం 1902 నెంబరును ప్రత్యేకంగా కేటాయించాలని.. ఆసుపత్రుల్లోని రోగులకు నాణ్యమైన ఆహారాన్ని అందించాలన్నారు.

హోం క్వారంటైన్ లో ఉండే వారికి కచ్ఛితంగా ఇంటికే వారికి అవసరమైన ఏడు రకాల టాబ్లెట్లతో కూడిన కిట్ ఇవ్వాలన్నారు. 108 కొవిడ్ ఆసుపత్రుల్లో రెమ్డెసివర్ ఇంజెక్షన్లకు కొరత రాకుండా చూసుకోవాలన్నారు. ఆసుపత్రుల్లో ఆక్సిజన్ సరఫరాకు అవరోధం రాకుండా చూసుకోవాలన్నారు. సీఎం జగన్ ప్రస్తావించిన సమస్యల్లో చాలావరకు తెలంగాణలో ఉన్నాయి. అయితే.. జగన్ మాదిరి తెలంగాణ సీఎం కేసీఆర్ ఇంత యాక్టివ్ గా స్పందించటం లేదన్న మాట వినిపిస్తోంది. జగన్ మాదిరి.. క్లియర్ ఆదేశాల్ని కేసీఆర్ సైతం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.