Begin typing your search above and press return to search.

ఏపీలో క‌రోనా కోర‌లు.. రాజ్ భ‌వ‌న్ లో హోలీ వేడుక‌ ర‌ద్దు

By:  Tupaki Desk   |   28 March 2021 3:30 AM GMT
ఏపీలో క‌రోనా కోర‌లు.. రాజ్ భ‌వ‌న్ లో హోలీ వేడుక‌ ర‌ద్దు
X
యావ‌త్తు ప్ర‌పంచాన్నే గ‌డ‌గ‌డ‌లాడిస్తున్న క‌రోనా వైర‌స్ త‌న ప్ర‌భావాన్ని త‌గ్గించిన‌ట్టే త‌గ్గించి... ఒక్క‌సారిగా సెకండ్ వేవ్ పేరిట మ‌రోమారు పెంచేసింది. ప్ర‌స్తుతం క‌రోనా సెకండ్ వేవ్ శ‌ర‌వేగంగా విస్త‌రిస్తోంది. దీని ఫ‌లితంగా ఎక్క‌డిక‌క్క‌డ క‌రోనా క‌ట్ట‌డి కోసం ఆంక్ష‌లు మొద‌లైపోయాయి. ఇందులో భాగంగా ఏపీ గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఆదివారం రాజ్ భ‌వ‌న్ లో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన హోలీ వేడుక‌ల‌ను ర‌ద్దు చేసుకున్నారు. ఈ మేర‌కు గ‌వ‌ర్న‌ర్ కార్యాల‌యం శ‌నివారం సాయంత్రం ఓ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేసింది. నానాటికీ పెరిగిపోతున్న క‌రోనా వైర‌స్ విజృంభ‌ణ నేప‌థ్యంలో గ‌వ‌ర్న‌ర్ విశ్వ‌భూష‌ణ్ హ‌రిచంద‌న్ ఆదివారం రాజ్‌భ‌వ‌న్ లో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన హోలీ వేడుక‌ల‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్లుగా స‌ద‌రు ప్ర‌క‌ట‌న‌లో రాజ‌భ‌వ‌న్ తెలిపింది.

క‌రోనా తొలి నాళ్ల‌లో దేశంలోని చాలా రాష్ట్రాల‌కు మాదిరిగానే ఏపీలో కూడా వేల సంఖ్య‌లో క‌రోనా పాజిటివ్ కేసులు నమోద‌య్యాయి. అయితే మిగిలిన ప్రాంతాల మాదిరిగానే నెల‌ల వ్య‌వ‌ధి త‌ర్వాత ఇటీవ‌లే ఏపీలోనూ కేసుల సంఖ్య డ‌బుల్ డిజిట్ కు ప‌డిపోయింది. ఈ క్ర‌మంలో లాక్ డౌన్ ఆంక్ష‌లు పూర్తిగా స‌డ‌లిపోగా... సాధార‌ణ జీవ‌నం ప్రారంభ‌మైపోయింది. అయితే ఉన్న‌ట్లుండి కరోనా సెకండ్ వేవ్ మ‌రోమారు విజృంభించింది. ఇందులో భాగంగా ఏపీలోనూ గ‌డ‌చిన రెండు రోజుల్లో రోజుకు దాదాపుగా వెయ్యి కేసుల మేర న‌మోదయ్యాయి. దీంతో మ‌రోమారు క‌రోనా భ‌యాలు ఒక్క‌సారిగా పెరిగిపోయాయి. ఫ‌లితంగా లాక్ డౌన్ నాటి ఆంక్ష‌లైతే అమలులోకి రాలేదు గానీ... జ‌నంలో క‌రోనా టెన్ష‌న్ పెరిగిపోయింది.

తాజా ప‌రిస్థితిని గ‌మ‌నించిన గ‌వ‌ర్న‌ర్ ఆదివారం రాజ్ భ‌వ‌న్ లో నిర్వ‌హించ‌త‌ల‌పెట్టిన హోలీ వేడుక‌ల‌ను ర‌ద్దు చేసుకున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. ఏటా హోలీ వేడుక‌ల‌ను రాజ్ భ‌వ‌న్ వేదిక‌గా ఘ‌నంగా నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఇందులో భాగంగా ఈ ఏడాది కూడా రాజ్ భ‌వ‌న్ లో హోలీ వేడుక‌ల‌కు అన్ని ఏర్పాట్లూ పూర్తి అయ్యాయి. అయితే క‌రోనా కేసుల పెరుగుద‌ల నేప‌థ్యంలో హోలీ వేడుక‌ల‌ను ర‌ద్దు చేసుకోవ‌డ‌మే ఉత్త‌మ‌మ‌ని విశ్వ‌భూష‌ణ్ భావించారు. అనుకున్న‌దే త‌డ‌వుగా హోలీ వేడుక‌ల‌ను ర‌ద్దు చేసుకుంటున్న‌ట్లుగా ప్ర‌క‌టించారు. అంతేకాకుండా రాష్ట్ర ప్ర‌జ‌లు కూడా హోలీ వేడుక‌ల‌ను త‌మ ఇళ్ల‌లోనే క‌రోనా జాగ్ర‌త్త‌ల‌ను పాటిస్తూనే జ‌రుపుకోవాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. క‌రోనా సోక‌కుండా భౌతిక దూరం, మాస్కుల వాడ‌కం, శానిటైజ‌ర్ల వినియోగం పెంచాల‌ని, అర్హులైన వారంతా వ్యాక్సిన్లు తీసుకోవాల‌ని కూడా ఆయ‌న పిలుపునిచ్చారు.