Begin typing your search above and press return to search.

అమరావతికి వెళ్లని బాబు..పరామర్శ గురించి మాట్లాడటమా?

By:  Tupaki Desk   |   18 Sep 2020 5:30 AM GMT
అమరావతికి వెళ్లని బాబు..పరామర్శ గురించి మాట్లాడటమా?
X
వినేవాడు ఉండాలే కానీ చెప్పేటోడు చెలరేగిపోతారని ఊరికే అనరు మరి. మీడియా ప్రతినిధుల్ని పిలిపించుకొని వారితో అదే పనిగా మాట్లాడే ఏపీ విపక్ష నేత చంద్రబాబు.. ఇటీవల చేస్తున్న వ్యాఖ్యల్లో పస అంతకంతకూ తగ్గిపోతుందని చెప్పాలి. తానేం మాట్లాడుతున్నానన్న విషయంపై ఆయన ఆలోచిస్తున్నారా? లేదా? అన్నదిప్పుడు ప్రశ్నగా మారింది. తాను ఒక వేలెత్తి చూపిస్తే.. నాలుగు వేళ్లు తనవైపు చూపిస్తాయని.. అలాంటి పరిస్థితి తన ఇమేజ్ ను మరింతగా దిగజారుస్తుందన్న విషయాన్ని ఆయన మర్చిపోయినట్లుగా కనిపిస్తోంది.

తిరుపతి ఎంపీ.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత నేత దుర్గాప్రసాద్ కరోనాతో మరణించిన సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఆయన ఇంటికి వెళ్లి.. వారి కుటుంబ సభ్యుల్ని కనీసం పరామర్శించి రాలేదని బాబు వినిపిస్తున్న వాదన వింటే విస్మయానికి గురి కావాల్సిందే. ఎందుకంటే బల్లి దుర్గా ప్రసాద్ కరోనా కారణంగా అస్వస్థతకు గురై.. గుండెపోటుతో మరణించారు.

అలాంటివేళలో.. పరామర్శలు లాంటి వాటికి దూరంగా ఉండాల్సిన అవసరం ఉంది. మరణం వేదన కలిగించేదే అయినా.. ముఖ్యమంత్రి నేరుగా బాధిత కుటుంబం వద్దకు వెళ్లి.. వారిని పరామర్శించటం ద్వారా ఆయన ఆరోగ్యానికే కాదు.. ఆయన చుట్టూ ఉండే వారికి ఇబ్బందికరంగా మారుతుందన్న విషయాన్ని మర్చిపోకూడదు. ఇప్పుడున్న పరిస్థితుల్లో పరామర్శలు లాంటి వాటిని దాదాపుగా బంద్ చేసిన పరిస్థితి. ఇలాంటివేళలో.. పరామర్శకు వెళ్లలేదంటూ చంద్రబాబు ప్రశ్నించిన తీరు చూస్తే.. ఆయనేం మాట్లాడుతున్నారో.. ఆయనకైనా అర్థమవుతుందా? అన్న సందేహం కలుగక మానదు.

ఇదిలా ఉంటే.. కరోనా మొదలైన నాటి నుంచి హైదరాబాద్ కే పరిమితమైన ఏపీ విపక్ష నేత చంద్రబాబు.. అప్పుడప్పుడు చుట్టం చూపుగా అమరావతికి వచ్చి వెళుతున్న వైనాన్ని మర్చిపోకూడదు. ఏపీ ప్రజల కోసం నిత్యం ఆరాటపడే బాబు.. అప్పుడప్పుడు అమరావతికి వచ్చి.. వెంటనే ఎందుకు వెళ్లిపోతున్నది ఎందుకు? అన్నది ప్రశ్న. పరామర్శ కోసం వెళ్లాలని సుద్దు చెప్పటానికి ముందు.. ఏపీ విపక్ష నేతగా హైదరాబాద్ వదిలేసి.. అమరావతిలో ఉండిపోవచ్చు కదా? అలా ఎందుకు చేయనట్లు? అన్న సందేహానికి బాబు తొలుత సమాధానం ఇస్తే బాగుంటుందన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.