Begin typing your search above and press return to search.

ఆ రికార్డు ఆంధ్రప్రదేశ్ దే !

By:  Tupaki Desk   |   1 Sep 2020 4:15 AM GMT
ఆ రికార్డు ఆంధ్రప్రదేశ్ దే !
X
ఏ రాష్ట్రం కోరుకోని దరిద్రమైన రికార్డును ఏపీ సొంతం చేసుకుంది. ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనా మహమ్మారి దేశంలో పెద్ద ఎత్తున విస్తరిస్తుంటే.. అందులో ఏపీ కీలకమైంది. దేశంలోని కరోనా ప్రభావం మొదలైన నాటి నుంచి మహారాష్ట్ర మొదటిస్థానంలో నిలవటం తెలిసిందే. కేసుల తీవ్రత ఎక్కువగా ఉన్నపలు రాష్ట్రాల్లో వైరస్ వ్యాప్తికి చెక్ పెట్టగా.. ఏపీలో మాత్రం అలాంటి పరిస్థితి లేదు. అంతకంతకూ విస్తరిస్తున్న వైరస్ కారణంగా కేసులు భారీగా నమోదవుతున్నాయి.

తాజాగా దేశంలో అత్యధిక కేసులు నమోదైన రెండో రాష్ట్రంగా ఏపీ నిలిచింది. గడిచిన 24 గంటల్లో దేశ వ్యాప్తంగా 78,512 మందికి కరోనా సోకితే.. అందులో రెండు రాష్ట్రాల్లోనే ముప్ఫై శాతానికి పైగా కేసులు నమోదు కావటం గమనార్హం. తాజాగా నమోదైన కేసులతో దేశంలో ఇప్పటివరకు 36.21లక్షల మందికి కరోనా బారిన పడ్డారు. వీరిలో 27.74లక్షల మంది కోలుకోగా.. 64,469 మంది మరణించారు. గడిచిన 24 గంటల్లో 971 మంది మరణించారు.
అత్యధిక కేసులు నమోదైన రాష్ట్రాల్లో మహారాష్ట్ర మొదటి స్థానాన్ని సొంతం చేసుకుంది. ఆ రాష్ట్రంలో 16,408 కేసులు నమోదు కాగా.. ఏపీలో 10,004 కేసులు నమోదయ్యాయి. కాకుంటే.. మరణాల విషయంలో ఏపీ ఊరటనిచ్చేలా ఉంది. మహారాష్ట్రలో 296 మంది 24 గంటల వ్యవధిలో మరణించగా.. ఏపీలో 85 మంది మరణించారు. ఈ రెండు రాష్ట్రాల తర్వాత కర్ణాటకలో అత్యధిక కేసులు నమోదుయ్యాయి. నాలుగో స్థానంలో ఉత్తరప్రదేశ్ నిలిచింది. ఐదో స్థానంలో తమిళనాడు ఉంది.

చాలా రాష్ట్రాలతో పోలిస్తే.. తెలంగాణలో కేసుల నమోదు కాస్త తగ్గుముఖం పట్టింది. తాజాగా 1873 మంది కరోనా బారిన పడగా.. తొమ్మిది మంది మరణించినట్లుగా పేర్కొన్నారు. కరోనా కేసుల నిరోధానికి ఏపీ సర్కారు ఎన్ని చర్యలు తీసుకున్నా.. ఎలాంటి ప్రయోజనం ఉండటం లేకపోవటం ఆ రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెడుతోంది. వైరస్ వ్యాప్తిని నిరోధించటానికి ఎంతగా ప్రయత్నించినా.. దరిద్రపుగొట్ట రికార్డులు ఏపీ సొంతం కావటం గమనార్హం.