Begin typing your search above and press return to search.

కేసుల్లో ఏపీకి ఏ మాత్రం పోలిక లేనట్లుగా తెలంగాణ?

By:  Tupaki Desk   |   10 Aug 2020 7:30 AM GMT
కేసుల్లో ఏపీకి ఏ మాత్రం పోలిక లేనట్లుగా తెలంగాణ?
X
కరోనా వేళ..అన్ని రాష్ట్రా ప్రభుత్వాలు తాజా పరిస్థితి ఎలా ఉందో తెలియజేస్తూ బులిటెన్ ను విడుదల చేస్తుంటాయి. తాజాగా ఈ రోజు (సోమవారం) బులిటెన్ ను విడుదల చేశారు. ఓపక్క మిగిలిన రాష్ట్రాల్లో కేసులు పెరుగుతుంటే.. తెలంగాణలో మాత్రం అలాంటి పరిస్థితి లేదన్నట్లుగా గణాంకాలు చెబుతున్నాయి. ఓపక్క ఏపీలో పదకొండు వేల వరకు రోజులో కేసులు నమోదు అవుతుంటే.. తెలంగాణలో మాత్రం అందులో పది.. పన్నెండు శాతానికి మించని రీతిలో కేసులు నమోదు కావటంపై విస్మయం వ్యక్తమవుతోంది.

ఈరోజు విడుదలైన బులిటెన్ ను చూస్తే.. మొత్తం కేసులు 1256 మాత్రమే కావటం గమనార్హం. అదే సమయంలో ఏపీలో 10,820 కేసులు నమోదయ్యాయి. కొద్ది రోజుల క్రితం వరకు భారీగా కేసులు నమోదైన హైదరాబాద్ లోనూ కేసుల సంఖ్య గణనీయంగా తగ్గింది. ఇవాల్టి బులిటెన్ ప్రకారం జీహెచ్ఎంసీలో 389 కేసులు మాత్రమే నమోదయ్యాయి. ఈ కేసులతో పోలిస్తే.. ఏపీలోని ఏ జిల్లాలో అయినా అంతకంటే ఎక్కువ కేసులు నమోదవుతున్న పరిస్థితి.

తాజాగా నమోదవుతున్న కేసుల్ని చూస్తుంటే.. తెలంగాణను చూసి ఏపీ ఆసూయపడేలా ఉందని చెప్పక తప్పదు. దేశ వ్యాప్తంగా నమోదవుతున్న కేసుల్ని చూస్తుంటే.. ఏపీ రెండో స్థానంలో ఉంది. తొలి స్థానంలో మహారాష్ట్ర నిలుస్తోంది. ఇప్పుడా రాష్ట్రంలో రోజుకు 12వేలకు పైగా కేసులు నమోదవుతున్నాయి. ఆదివారం నాటి బులిటెన్ ప్రకారం ఒక్కరోజులో 12.822 కేసులు నమోదయ్యాయి. రెండోస్థానంలో ఉన్న ఏపీలో 10,820 కేసులు నమోదయ్యాయి. మరికొద్ది రోజుల్లోనే మహారాష్ట్రను ఏపీ దాటేస్తుందా? అన్నదిప్పుడు సందేహంగా మారింది. మహారాష్ట్ర.. ఏపీ తర్వాత అత్యధిక కేసులు నమోదవుతున్న రాష్ట్రాలుగా తమిళనాడు.. కర్ణాటకలు ఉన్నాయి.

ఆసక్తికరమైన మరో అంశం ఏమంటే.. ఆ మధ్య వరకు కేసుల నమోదును పెద్ద ఎత్తున కంట్రోల్ చేసినట్లుగా ప్రశంసలు అందుకున్న కేరళలోనూ కేసులు భారీగా నమోదవుతున్నాయి. కేరళ కంటే పెద్ద రాష్ట్రమైన మధ్యప్రదేశ్ లో 859 కేసులు మాత్రమే నమోదు కావటం గమనార్హం. మరణాల విషయంలో మహారాష్ట్ర మొదటిస్థానంలో ఉంటే.. తమిళనాడు రెండోస్థానంలో ఉంది. ఈ విషయంలో ఏపీ నాలుగో స్థానంలో ఉండగా.. తెలంగాణలో అతి తక్కువ మరణాలు చోటు చేసుకుంటున్నట్లుగా గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జగన్ సర్కారు సమర్థవంతంగా కోవిడ్ ను కంట్రోల్ చేస్తున్నట్లుగా చెబుతున్నప్పుడు.. ఆ రాష్ట్రంలో వేలాది కేసులు ఎందుకు నమోదవుతున్నట్లు? ఎక్కడ తప్పు జరుగుతున్నట్లు?