Begin typing your search above and press return to search.

ఇంట్లోనే 85 శాతం మంది కోలుకుంటున్నారు ...భయపడకండి !

By:  Tupaki Desk   |   1 Aug 2020 8:10 AM GMT
ఇంట్లోనే 85 శాతం మంది కోలుకుంటున్నారు ...భయపడకండి !
X
ఏపీలో కరోనా కేసులు రోజురోజుకి పాత రికార్డ్స్ ను చెరిపివేస్తూ కొత్త రికార్డ్స్ క్రియేట్ చేస్తున్నాయి. ముఖ్యంగా గత మూడు రోజుల్లో 10 వేలకి పైగా కరోనా పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నాయి. ఈ నేపథ్యంలో రాష్ట్ర వాసుల్లో ఆందోళన మొదలైంది. అయితే, కరోనా పాజిటివ్‌ కేసులని చూసి ప్రజలు భయపడాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ స్పష్టం చేసింది. ఏ పరిస్థితి అయినా ఎదుర్కోవడానికి సిద్ధంగా ఉన్నామని, వైరస్‌ సోకి ఆస్పత్రులకు వచ్చే వారికి అరగంటలోనే బెడ్లు కేటాయించాలన్న సీఎం వైఎస్ జగన్‌ మోహ‌న్‌ రెడ్డి‌ ఆదేశాల మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ సర్వం సిద్ధమైంది. అలాగే , రాష్ట్రంలో నమోదవుతున్న కరోనా పాజిటివ్‌ కేసుల్లో 85 శాతం మంది ఇళ్లలోనే ఉంటూ కోలుకున్నారని అధికారులు ప్రకటించారు.

మిగిలిన 15 శాతం ఆస్పత్రుల్లో చేరినా, వారిలో కేవలం 4 శాతం రోగులు మాత్రమే అత్యవసర వైద్య సేవల విభాగంలో చికిత్స పొందుతున్నారు. ఆస్పత్రుల్లో చేరిన వారిలో 11 శాతం మంది సాధారణ చికిత్సతో డిశ్చార్జ్‌ అవుతున్నారు. కరోనా వైరస్‌ సోకిన వారి చికిత్స కోసం రాష్ట్ర వ్యాప్తంగా 138 ఆస్పత్రులను గుర్తించారు. అన్ని ఆస్పత్రులలో 4300 ఐసీయూ బెడ్లు ఉండగా, నాన్‌ ఐసీయూ, ఆక్సిజన్‌ బెడ్లు 17,406 ఉన్నాయి. ఇక రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం1,40,933 కరోనా పాజిటివ్ కేసులు నమోదవ్వగా, అందులో 63,864 మంది కరోనా నుంచి కోలుకున్నారు.

ప్రస్తుతం 75,720 మంది యాక్టివ్ కేసులు చికిత్స పొందుతున్నారు. రాష్ట్రంలో ఇప్పటి వరకు కరోనాతో మరణించిన వారి సంఖ్య 1349గా ఉంది. కరోనా సోకిన వారిలో అత్యధికంగా ఇళ్లలోనే ఉండి చికిత్స తీసుకున్నారు. అలాగే , కరోనా‌ చికిత్సకు అవసరమైన ప్లాస్మా సేకరణపైనా ప్రభుత్వం ప్రత్యేకంగా దృష్టి పెట్టింది. ఆ దిశలో ప్రజలను ప్రోత్సహించే విధంగా ప్లాస్మా డొనేట్‌ చేస్తే రూ.5 వేలు ఇవ్వాలని ప్రభుత్వం నిర్ణయించింది. కోవిడ్‌ నివారణ చర్యలపై సీఎం వైఎస్‌ జగన్ శుక్రవారం నిర్వ‌హించిన స‌మీక్ష‌లో ఈ విషయాన్ని ప్రకటించారు.