Begin typing your search above and press return to search.

ఆగస్టులో ఏపీలోని 7 జిల్లాల్లో కరోనా తాండవం ఆడేస్తుందట

By:  Tupaki Desk   |   31 July 2020 4:30 AM GMT
ఆగస్టులో ఏపీలోని 7 జిల్లాల్లో కరోనా తాండవం ఆడేస్తుందట
X
ఏపీలో కరోనా వీరంగం అంతకంతకూ ఎక్కువ అవుతోంది. అంచనాలకు భిన్నంగా పెరిగిపోతున్న పాజిటివ్ కేసులతో ఏపీ ప్రజలు ఉక్కిరిబిక్కిరి అవుతోంది. ప్రభుత్వం ఎన్ని చర్యలు తీసుకుంటున్నా.. పాజిటివ్ కేసుల నమోదు మాత్రం తగ్గట్లేదు. తాజాగా రోజుకు పదివేలకు పైగా కేసులు నమోదు కావటమే కాదు.. రానున్న కొద్ది రోజుల్లో ఇది కాస్తా ఇరవై వేలకు చేరుకున్నా ఆశ్చర్యం లేదని చెబుతున్నారు. దీనంతటికి కారణంగా ఏపీ ప్రజల్లో లోపించిన క్రమశిక్షణ.. బాధ్యతారాహిత్యమేనని చెబుతున్నారు.

ఎంత మొత్తుకున్నా.. బయటకు వచ్చే విషయంలో ఏపీ ప్రజలు ప్రదర్శిస్తున్న తీరు తాజాగా పెరుగుతున్న కేసులకు కారణమని చెబుతున్నారు. తమ వరకు వచ్చే దాకా కానీ పట్టని తీరు ఏపీ ప్రజల్లో ఎక్కువగా కనిపిస్తోంది. కరోనాను తేలిగ్గా తీసుకోవటం.. తమనేం చేయదన్న ధీమా కూడా తాజా దుస్థితికి కారణంగా చెబుతున్నారు. భారీగా నమోదవుతున్న కేసుల నేపథ్యంలో రానున్న రోజుల్లో పరిస్థితి మరెలా ఉంటుందన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది.

ఈ అంశంపై నిపుణుల కమిటీ షాకింగ్ రిపోర్టు ఒకటి సిద్ధం చేసినట్లుగా సమాచారం. దీని ప్రకారం ఆగస్టు నెలలో రాష్ట్రంలోని ఏడు జిల్లాల్లో భారీ ఎత్తున కేసులు నమోదు కావటం ఖాయమని తేల్చినట్లు చెబుతున్నారు. అంతేకాదు.. సదరు ఏడు జిల్లాల్లో ఏ తేదీల్లో కేసుల నమోదు తీవ్రంగా ఉంటుందన్న అంచనాను కట్టారు. దీని ప్రకారం చూస్తే.. ఇలాంటి డేంజర్ పరిస్థితుల్లో తూర్పుగోదావరి.. ప్రకాశం.. పశ్చిమగోదావరి.. కర్నూలు.. విశాఖ.. అనంతపురం.. గుంటూరు జిల్లాలు ఉన్నట్లు తేల్చారు.

ఆగస్టు నెలలో ఏ జిల్లాల్లో ఏ తేదీ నుంచి ఏ తేదీకి మధ్య కాలంలో కేసుల సంఖ్య భారీగా పెరుగుతాయన్న అంచనాను వేసినట్లు చెబుతున్నారు. ఈ సమయాల్లో పెరిగే కేసులకు తగ్గట్లు ఏర్పాట్లు చేయాలని భావిస్తున్నారు. ఈ డేంజర్ డేట్లలో మరణాలు ఎక్కువగా చోటు చేసుకోకుండా ఉండేందుకు ప్లాన్ చేస్తున్నట్లు చెబుతున్నారు. పెద్ద వయస్కుల విషయంలో జాగ్రత్తగా ఉండాలని.. ఇప్పటికే ఆరోగ్య సమస్యలు ఎదుర్కొనే వారి విషయంలో మరింత అప్రమత్తత ఉండాలని చెబుతున్నారు.

ఆగస్టులో భారీ ఎత్తున కేసులు నమోదయ్యే జిల్లాలు.. ఏయే తేదీల్లో అన్న విషయానికి వస్తే..
జిల్లా కీలక డేట్లు ఇవే
తూర్పు గోదావరి ఆగస్టు 01 - 14
ప్రకాశం ఆగస్టు03 - 17
పశ్చిమగోదావరి ఆగస్టు 04 - 18
కర్నూలు ఆగస్టు 04 - 18
విశాఖపట్నం ఆగస్టు 14 - 27
అనంతపురం ఆగస్టు 16 - 29
గుంటూరు ఆగస్టు 20 - సెప్టెంబరు 3