Begin typing your search above and press return to search.

మానవత్వం మంట కలిసి పోతుంది.. అంత్యక్రియలని 'అడ్డుకోకండి ప్లీజ్'

By:  Tupaki Desk   |   30 July 2020 5:30 AM GMT
మానవత్వం మంట కలిసి పోతుంది.. అంత్యక్రియలని  అడ్డుకోకండి ప్లీజ్
X
మానవత్వం .. ఇది నేటి సమాజంలో కేవలం ఇలా చదవడానికి , పుస్తకాల్లో ముద్రించడానికి మాత్రమే ఉంది. మనుషుల్లో అసలు లేదు. గతంలో అందరిలో కాకపోయినా కూడా కొంతమందిలో అయినా మానవత్వం ఇంకా మిగిలే వుండేది. దాన్ని ఈ కరోనా మహమ్మారి పూర్తిగా చంపేసింది. ప్రస్తుతం ఓ వ్యక్తి చావు బ్రతుల మధ్య ఉన్నా కూడా సహాయం చేయడానికి ఎవరు ముందుకు రావడంలేదు. ఆ పరిస్థితులని సృష్టించింది ఈ కరోనా వైరస్. ఇక కరోనా వచ్చి చనిపోతే , ఆ మృతదేహాన్ని స్మశానానికి తీసుకుపోవడానికి నలుగురు కూడా ముందుకు రావడం లేదు. ఆ సంగతి పక్కన పెడితే కరోనా తో చనిపోతే కనీసం ఆ శవాన్ని తీసుకుపోవడానికి బంధువులు కూడా ముందుకు రాకపోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రంలో ఇలాంటి పరిస్థితులు చాలా జిల్లాల్లో కనిపిస్తున్నాయి. చాలా జిల్లాల్లో కరోనా మృతదేహాలని తీసుకుపోవడానికి ఎవరు ముందుకు రాకపోవడంతో వైద్య సిబ్బందే వారికీ అంత్యక్రియలు నిర్వర్తిస్తున్నారు.

కరోనా రోగులకు చికిత్స చేయడం ఓ ఎత్తైతే మృత దేహాలు వారి బంధువులకు అప్పగించడం సర్కారు ఆస్పత్రి వైద్యులకు మరో సమస్యగా మారుతోంది. కరోనా లక్షణాలతో చనిపోయినా మృతదేహాలను ముట్టుకునేందుకు కుటుంబసభ్యులు ముందుకురావడం లేదు. మృతదేహాన్ని స్మశానానికి తరలించే నలుగురు కూడా ఉండటం లేదు. దీంతో జేసీబీలు, ట్రాక్టర్లు, ఆటో ట్రాలీలు, అంబులెన్సులే అంత్యక్రియల సాధనాలుగా మారుతున్నాయి. ముఖ్యంగా కొన్ని గ్రామాల ప్రజలు మృతదేహాలని ఊర్లోకి తీసుకురావద్దు అని ,వేరే ప్రాంతానికి తీసుకుపోవాలని ఎవరు చెప్పినా వినకుండా అంత్యక్రియలకు అడ్డుపడుతున్నారు. దీనితో కరోనా మృతులకు గుట్టుచప్పుడు కాకుండా రాత్రి సమయాల్లో అంత్యక్రియలు నిర్వహిస్తున్నారు. మృతుల కుటుంబ సభ్యులే పరిమితికి లోబడి పీపీ కిట్లు ధరించి అంత్యక్రియలు చేయచ్చు అని వైద్యులు చెప్తున్నారు. ఎన్‌–95 మాస్క్‌ చేతి గ్లౌజులు, ఫేస్ ‌షీల్డ్‌ ధరించాలని సూచిస్తున్నారు. అంత్యక్రియలు పూర్తయిన తర్వాత కొంత దూరం వచ్చి వాడిన మాస్క్‌, గ్లౌజులు, ఫేస్‌ ఫీల్డ్‌ దహనం చేయాలంటున్నారు. ఇంటికి వెళ్లిన తర్వాత రెండు సార్లు తలస్నానం చేయాలంటున్నారు. మృతదేహంపై ఆ వైరస్‌ అత్యధికం గా పది గంటల పాటు బతికి ఉంటుందని ఆ తర్వాత చచ్చిపోతుందని వైద్యులు చెప్తున్నారు.

ఈ నెల 22న గద్వాల జిల్లా వడ్డేపల్లి మండల పరిధిలోని రామాపురం గ్రామానికి చెందిన యువకుడు అకస్మాత్తుగా చనిపోయాడు. అదే సమయంలో అతడి ఫ్రెండ్ కరోనా అని నిర్దారణ అయింది. దీంతో మృతి చెందిన యువకుడికి కరోనా సోకి ఉంటుందనే భయంతో కుటుంబ సభ్యులూ అతని అంత్యక్రియలకు వెనకడుగు వేశారు. పాడే మోసే వాళ్లూ కరువవ్వడంతో స్థానిక సర్పంచ్‌ చొరవ తో మృత దేహాన్ని జేసీబీ లో వేసుకుని శ్మశాన వాటికకు తరలించారు. ఈ ఒక్క సంఘటనే కాదు ప్రతి రోజు కూడా ఎలాంటి ఘటనలు జరుగుతున్నాయి. దయచేసి కరోనా మృత దేహాల అంత్యక్రియలని అడ్డుకోకండి .. శవం పై కరోనా మహమ్మారి ఎక్కువ సేపు ఉండదు. అలాగే అన్ని నిబంధనలు పాటించి చేసే అంత్యక్రియలకు మీరు వెళ్లాల్సిన అవసరం లేదు...వారి కుటుంబ సభ్యులకి అడ్డు చెప్పక పోతే చాలు.