Begin typing your search above and press return to search.

ఏపీలో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?

By:  Tupaki Desk   |   23 July 2020 4:30 PM GMT
ఏపీలో కరోనా కేసులు ఎందుకు పెరుగుతున్నాయి?
X
మొన్న 4వేలు.. నిన్న 5వేల కేసులు.. ఈరోజు 6వేలకు పైగా కేసులు.. ఏపీలో కరోనా వైరస్ జెట్ స్పీడుతో పరిగెడుతోంది. వేగంగా మహమ్మారి వ్యాపిస్తోంది. మరణాలు కూడా అదేస్థాయిలో సంభవిస్తున్నాయి.మొత్తం కేసుల సంఖ్య 60వేలు దాటింది. మహారాష్ట్ర, తమిళనాడు, ఢిల్లీ బాటలో ఆంధ్రప్రదేశ్ కూడా కరోనా కల్లోలంగా ఎందుకు మారుతోందన్నది ఇప్పుడు అందరినీ తొలుస్తున్న ప్రశ్న.

ప్రస్తుతం దేశంలో కరోనా వ్యాప్తిలో ఏపీ 5వ స్థానంలో ఉంది. వారం రోజులుగా ఏపీలో కరోనా నిర్ధారణ పరీక్షలు భారీగా చేస్తున్నారు.సగటున 30వేల నుంచి 50వేల కేసులు చేస్తున్నారు. అందుకే కేసులు బయటపడుతున్నాయి. జులై 11 తర్వాత కేసుల సంఖ్య పెరగడం గమనిస్తున్నాం. జులై1 నుంచి ఇప్పటివరకు కేసులు.. మృతులు రెండున్నర రెట్లు పెరిగారు.

రాష్ట్రంలో కరోనా విస్తృతి పెరిగిందని.. ఆగస్టు రెండో వారం నాటికి మరింత పెరుగుతాయని.. అక్టోబర్, నవంబర్ నాటికి కేసులు తగ్గుతాయని వైద్య నిపుణులు చెబుతున్నారు.లాక్ డౌన్ ఎత్తివేతతో ప్రజలు యథేచ్చగా తిరుగుతూ పాజిటివ్ ఉన్న వారు.. లక్షణాలు లేని వారు అందరికీ అంటించడం వల్లే ఇది వ్యాపిస్తోందని చెబుతున్నారు. లాక్ డౌన్ నిబంధనలు పాటించకపోవడమే కేసులు పెరగడానికి కారణం అంటున్నారు.

పార్టీలు, వివాహాలు .. పుట్టినరోజులంటూ ప్రజలు గుమిగూడుతున్నారు. అధికారులు ఆపడం లేదు. ప్రజలు బాధ్యత విస్మరించడం వల్లే కేసులు పెరుగుతున్నాయని జిల్లా వైద్యాధికారులు తేల్చారు. ఇక ఇతర రాష్ట్రాల నుంచి వచ్చేవారితోనూ ఏపీలో భారీగా కేసులు పెరుగుతున్నాయంటున్నారు.

చూస్తుంటే ఏపీలో సామాజిక వ్యాప్తి దశ మొదలైందని వైద్యాధికారులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిపై ఇప్పటికే ఐఎంఏ అనుమానం వ్యక్తం చేయగా.. ఐసీఎంఆర్ మాత్రం అధికారికంగా చెప్పలేదు. దీంతో కేసుల వ్యాప్తికి ప్రజల నిర్లక్ష్యం ప్రధాన కారణంగా తెలుస్తోంది.