Begin typing your search above and press return to search.

అమెరికాలో 5 లక్షలు దాటిన కరోనా మరణాలు !

By:  Tupaki Desk   |   23 Feb 2021 7:01 AM GMT
అమెరికాలో 5 లక్షలు దాటిన కరోనా మరణాలు !
X
అమెరికా కరోనా మహమ్మారి దెబ్బ కి చిగురుటాకులా వణికిపోతోంది. ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా వెలుగొందుతున్నప్పటికీ కరోనా వైరస్ ను అరికట్టడంలో మాత్రం వెనుకబడిపోయింది. చైనా లో పుట్టిన ఈ మహమ్మారి అమెరికా పై ఇంకా దండయాత్ర చేస్తూనే ఉంది. కరోనా కేసులు , కరోనా మరణాలు ఇంకా అమెరికా వాసులని భయపెడుతూనే ఉంది. ఇకపోతే తాజాగా అమెరికా వ్యాప్తంగా కరోనా బారిన పడి మరణించిన వారి సంఖ్య సోమవారం ఐదు లక్షలు దాటింది. జాన్స్ హాప్కిన్స్ యూనివర్శిటీ లెక్కల ప్రకారం అమెరికాలో ఇప్పటివరకు 5,00,071 మంది కొవిడ్-19 కారణంగా ప్రాణాలు కోల్పోయారు. ఈ నేపథ్యంలో వైట్‌ హౌస్ వెలుపల నిర్వహించిన క్యాండిల్ లైట్ కార్యక్రమంలో అధ్యక్షుడు జో బైడెన్, ఉపాధ్యక్షురాలు కమలా హ్యారిస్ పాల్గొని నిమిషం పాటు మౌనం పాటించారు.

అమెరికాలో ప్రపంచంలోనే అత్యధికంగా 2 కోట్ల 81 లక్షల మంది కరోనాకు గురయ్యారు. మరోపక్క వ్యాక్సినేషన్ కార్యక్రమం కూడా శరవేగంగా సాగుతోంది. అమెరికా ప్రభుత్వం ఇప్పటివరకు 6.42 కోట్ల వ్యాక్సిన్ డోస్‌లను ప్రజలకు వేసింది. అమెరికాలో మొట్టమొదటి కరోనా మరణం గతేడాది ఫిబ్రవరిలో నమోదైంది. ఆ తర్వాత మూడు నెలల సమయంలోనే మరణాల సంఖ్య లక్ష దాటింది. మరో నాలుగు నెలల్లో ఈ సంఖ్య రెండు లక్షలకు చేరువైంది. ఆ తర్వాత మూడు నెలలకు మూడు లక్షలకు, బైడెన్ ప్రమాణ స్వీకారం చేసే సమయానికి నాలుగు లక్షలకు, ఇప్పుడు ఐదు లక్షలకు చేరింది.

దీనిపై అమెరికా అధినేత బైడెన్ మాట్లాడుతూ .. వియత్నాం, మొదటి, రెండో ప్రపంచయుద్దాల్లో మరణించిన అమెరికన్ల సంఖ్య కంటే కరోనా కారణంగా మరణించిన వారి సంఖ్యే ఎక్కువగా ఉందన్నారు. ఒక దేశంగా ఇటువంటి క్రూరమైన విధిని మనం అంగీకరించలేము. దీనికి మనమంతా అడ్డుకట్ట వేయాల్సిన అవసరం ఉంది. ఇప్పటివరకు మనం కోల్పోయిన వారందరిని గుర్తుతెచ్చుకోండి. మనమందరం కలిసికట్టుగా ఈ కరోనా మహమ్మారితో పోరాడాలి. జీవితంలో ఏం సాధించాలనేది దు:ఖం ద్వారా తెలుస్తుందని నా అభిప్రాయం అని బైడెన్ అన్నారు. తంలో తన భార్య, పిల్లలను ప్రమాదంలో కోల్పోయిన విషయాన్ని జో బైడెన్ గుర్తుచేసుకున్నారు. కరోనా మృతులకు సంతాపంగా మరో ఐదు రోజులపాటు ఫెడరల్ ప్రభుత్వ కార్యాలయాలపై ఉన్న అన్ని అమెరికా జెండాలనూ అవనతం చేయాలని బైడెన్ ఆదేశాలు జారీ చేశారు. సోమవారం రాత్రి వాషింగ్టన్‌లోని నేషనల్ కాథెడ్రల్ చర్చి గంటను మహమ్మారి వల్ల చనిపోయినవారికి నివాళిగా ప్రతి వెయ్యి మందికి ఒకసారి చొప్పున 500 సార్లు మోగించారు.