Begin typing your search above and press return to search.

అగ్రరాజ్యానికి 10 రోజులు పడితే.. మనం ఆరు రోజుల్లో పూర్తి

By:  Tupaki Desk   |   29 Jan 2021 8:30 AM GMT
అగ్రరాజ్యానికి 10 రోజులు పడితే.. మనం ఆరు రోజుల్లో పూర్తి
X
శాస్త్రసాంకేతిక రంగాల్లోనే కాదు.. దేనిలోనూ భారత్ పోటీ పడలేదు. కానీ.. తాను తల్చుకుంటే అద్భుతాల్ని క్రియేట్ చేయగలనన్న విషయాన్ని భారత్ తాజాగా నిరూపించింది. ప్రపంచానికి నిద్ర లేకుండా చేసిన కరోనాకు చెక్ చెబుతూ.. దాని అంతు చూసే వ్యాక్సిన్ అందుబాటులోకి రావటంతో.. ఏ దేశానికి ఆ దేశం వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని చేపడుతోంది. భారత్ తో పోలిస్తే.. మన కంటే ముందుగా రష్యా.. చైనా.. యూకే.. అమెరికా తోపాటు పలు యూరప్ దేశాలు.. అరబ్ దేశాలు వ్యాక్సిన్ వేయటం షురూ చేశాం.

భారత్ లో మాత్రం సంక్రాంతి పండుగ తర్వాత మాత్రమే టీకాలు వేసే కార్యక్రమం మొదలైంది. ఎప్పుడు వచ్చామన్నది కాదు అన్నయ్య.. బుల్లెట్ దిగిందా? లేదా? అన్నదే పాయింట్ అన్న రీతిలో.. లేటుగా వచ్చినా లేటెస్టుగా టీకాల కార్యక్రమంలో భారత్ తన సత్తా చాటిందని చెప్పాలి. ప్రపంచంలోని పలు దేశాలకు పది లక్షల వ్యాక్సిన్ వేయటానికి ఎన్ని రోజులు పట్టిందన్న విషయంలో.. మిగిలిన దేశాల కంటే మిన్నగా భారత్ వ్యవహరించింది. అగ్రరాజ్యానికి సైతం సాధ్యం కాని రీతిలో టీకాలు వేసే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టామని చెప్పాలి.

పది లక్షల వ్యాక్సిన్లను వేయటానికి అమెరికాకు ఏకంగా పది రోజులు పడితే.. అదే గొప్పనుకున్నారు. కానీ.. భారత్ మాత్రం మిగిలిన వారంతా నోరెళ్ల బెట్టేలా పది లక్షల మందికి వ్యాక్సిన్ ను కేవలం ఆరు రోజుల్లోనే పూర్తి చేసింది. ఇక స్పెయిన్ కు 12 రోజులు.. ఇజ్రాయల్ కు 14.. యూకేకు 18.. ఇటలీకి 19.. జర్మనీ 20.. యూఏఈకి 27 రోజులు పట్టింది. మిగిలిన వారెవరూ చేయలేని రీతిలో అతి తక్కువ వ్యవధిలో మిలియన్ వ్యాక్సినేషన్ కార్యక్రమాన్ని పూర్తి చేసిన ఘనత భారత్ కు మాత్రమే సొంతమని చెప్పాలి.

ప్రపంచదేశాల్లో భారత్ ఎంత వేగంగా వ్యాక్సిన్ వేసిందన్న విషయంపై క్లారిటీ వచ్చింది కదా. మరి.. మన దేశంలో ఏ రాష్ట్రం టీకాలు వేసే విషయంలో యమా దూకుడును ప్రదర్శించిందన్న విషయాన్ని చూస్తే.. తెలుగు రాష్ట్రాలు మహా జోరుగా ఉన్నాయి. దీంతో పాటు లక్ష ద్వీప్.. ఒడిశా.. హర్యానా.. అండమాన్ నికోబార్ దీవులు.. రాజస్థాన్.. త్రిపుర.. మిజరోం.. కర్ణాటక.. మధ్యప్రదేశ్ రాష్ట్రాల పని తీరు బాగుందంటున్నారు.

ఇక.. జార్ఖండ్.. ఢిల్లీ.. తమిళనాడు.. ఉత్తరాఖండ్.. ఛత్తీస్ గఢ్.. మహారాష్ట్రలలో వ్యాక్సినేషన్ ను మరింత వేగవంతంగా నిర్వహించాల్సిన అవసరం ఉంటుందన్నారు. ఇక.. దేశంలోనే అతి పెద్ద రాష్ట్రాలైన ఉత్తరప్రదేశ్.. పశ్చిమబెంగాల్ లాంటి రాష్ట్రాల పరిస్థితి మాత్రం బాగోలేదన్న మాట వినిపిస్తోంది.