Begin typing your search above and press return to search.

అమెరికాకు టీకా వేసేందుకు ఫైజర్ ఫ్యాక్టరీ నుంచి వెహికిల్ బయటకొచ్చింది

By:  Tupaki Desk   |   14 Dec 2020 10:29 AM IST
అమెరికాకు టీకా వేసేందుకు ఫైజర్ ఫ్యాక్టరీ నుంచి వెహికిల్ బయటకొచ్చింది
X
కంటికి కనిపించని కరోనా కారణంగా ప్రపంచానికే పెద్దన్న అయిన అమెరికాకు ఎదురైన చేదు అనుభవాలు అన్ని ఇన్ని కావు. ఇప్పటివరకు ఎప్పుడూ ఎదురుకాని ఎన్నో దారుణాలు కోవిడ్ కారణంగా చోటు చేసుకున్నాయని చెప్పాలి. ప్రపంచ యుద్ధాల సమయంలోనూ అమెరికాకు జరగనంత నష్టాన్ని కరోనా చేసిందని చెప్పాలి. తాజాగా విరుచుకుపడుతున్న సెకండ్ వేవ్ తో అగ్రరాజ్యం చిగురుటాకులా వణుకుతోంది. ఈ మహమ్మారి నుంచి రక్షణ కల్పించేందుకు వీలుగా అత్యవసర వినియోగానికి ఫైజర్ వ్యాక్సిన్ కు అనుమతిని ఇవ్వటం తెలిసిందే.

దీంతో ఫైజర్ ఫ్యాక్టరీ నుంచి వ్యాక్సిన్ ట్రక్కులుబయలుదేరాయి. ఫైజర్ కు అతి పెద్ద కర్మాగారం మిషిగన్ లో ఉంది. అక్కడ నుంచి బయలుదేరిన వాహనాలు దేశ వ్యాప్తంగా ఉన్న 145 టీకా సరఫరా కేంద్రాలకు టీకాల్ని రవాణా చేస్తున్నారు. ఈ వాహనాల్లో భద్ర పర్చిన టీకా బాక్సులకు జీపీఎస్ పరికరాల్ని అమర్చారు. ఎందుకంటే.. ఈ టీకా మైనస్ 94 డిగ్రీల ఉష్ణోగ్రతలో భద్రపర్చాలి.

ఈ నేపథ్యంలో టీకా రవాణాకు ప్రత్యేక వాహనాల్ని వినియోగిస్తున్నారు. ఇందుకోసం ఫైజర్ ప్రత్యేక ఏర్పాట్లను చేసింది. తొలి విడతలో అమెరికా వ్యాప్తంగా 30 లక్షల డోసుల్నిపంపిణీ చేయనున్నారు. ఆసుపత్రుల్లోని క్రిటికల్ కేర్ యూనిట్స్ లో పని చేస్తున్న వైద్య సిబ్బందికి.. ఆసుపత్రుల్లో దీర్ఘకాలిక వ్యాధులతో బాధ పడుతున్న వారికి ఈ వ్యాక్సిన్ ఇవ్వనున్నారు. మరో మూడు వారాల తర్వాత మరోసారి రెండో డోసును సప్లై చేయనున్నారు. వ్యాక్సిన్ రవాణాకు ఫెడెక్స్ ట్రక్కులు బయలుదేరాయి. కోవిడ్ తో ఉక్కిరిబిక్కిరి అవుతున్న అమెరికాకు ఫైజర్ వ్యాక్సిన్ ఉపశమనం కలిగిస్తుందని చెప్పక తప్పదు.