Begin typing your search above and press return to search.

కేసులు పెరిగిపోతున్నాయి.. టెస్టులు తగ్గించాలన్న ట్రంప్

By:  Tupaki Desk   |   22 Jun 2020 4:30 AM GMT
కేసులు పెరిగిపోతున్నాయి.. టెస్టులు తగ్గించాలన్న ట్రంప్
X
మహమ్మారికి అడ్డుకట్ట వేసేందుకు ఉన్న అవకాశం వీలైనన్ని నియంత్రణ మార్గాల్ని అనుసరించటమే. మాయదారి రోగం అంటుకోకుండా భౌతిక దూరాన్ని పాటించటం.. పాజిటివ్ కేసులు కనిపించిన చోట పెద్ద ఎత్తున పరీక్షలు నిర్వహించటం ద్వారా.. రోగ తీవ్రత ఎంత ఉందన్న విషయాన్ని తెలుసుకునే వీలుంటుంది. అయితే.. దీనిపై ఒక్కో ప్రభుత్వం ఒక్కోలా వ్యవహరిస్తుంటుంది. ఏపీలో ఇప్పటికి ఆరు లక్షలకు పైనే నిర్దారణ పరీక్షలు చేస్తే.. తెలంగాణలో ఇప్పటివరకూ అరవై వేల కంటే తక్కువ పరీక్షలు మాత్రమే చేశారు. రోజువారీగా చూసినా ఏపీకి.. తెలంగాణకు మధ్య టెస్టుల విషయంలో పొంతనే ఉండదు.

మాయదారి రోగానికి పుట్టిల్లు అయిన చైనాలో నేటికి మహమ్మారి భయపెట్టిస్తోంది. ఇప్పటికి కేసులు నమోదవుతున్నాయి. తాజాగా దేశ రాజధాని బీజింగ్ లో 22 కేసులు తేలిన నేపథ్యంలో నిర్దారణ పరీక్షల వేగాన్ని పెంచాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా రోజు 10 లక్షల పరీక్షలు చేసేలా చర్యలు చేపట్టింది. ఇదిలా ఉంటే.. అమెరికాలో పెరుగుతున్న కేసులకు కట్టడి చేసేందుకు ఆ దేశాధ్యక్షుడు ట్రంప్ నోటి నుంచి అనూహ్యమైన వ్యాఖ్య వచ్చింది. ఇప్పటికే ఆ దేశంలో 23.30లక్షల మంది పాజిటివ్ కేసులు నమోదు కాగా.. మాయదారి రోగం కారణంగా ఆ దేశంలో ఇప్పటివరకు 1.21 లక్షల మంది మరణించారు.

రోజులు గడుస్తున్న కొద్దీ కేసుల సంఖ్య పెరగటమే కాని తగ్గని పరిస్థితి. ఈ నేపథ్యంలో కేసుల నమోదు తగ్గించే అంశం ట్రంప్ కు ఇప్పుడు ప్రయారిటీగా మారింది. మరికొద్ది నెలల్లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరుగుతున్న వేళ.. గతంలో మాదిరి నిర్దారణ పరీక్షల్ని పెద్ద ఎత్తున చేసేందుకు ఇష్టపడటం లేదు. తాజాగా ఆయన మాట్లాడుతూ.. ఎక్కువ పరీక్షలు చేస్తే ఎక్కువ కేసులు వెలుగులోకి వస్తున్నాయని.. అందుకే పరీక్షలు తగ్గించాలని తాను అధికారులకు చెప్పినట్లు పేర్కొన్నారు.

ఆయన చేసిన వ్యాఖ్యలు ఎన్నికల ర్యాలీలో కావటం గమనార్హం. ఓపక్క దేశంలో కేసుల సంఖ్య అదుపులోకి రాని వేళ.. మరింత లోతుల్లోకి వెళ్లి వైరస్ వ్యాప్తికి ప్రయత్నించాల్సింది పోయి.. టెస్టులు చేస్తే కేసుల సంఖ్య పెరుగుతుంది కాబట్టి.. ఇప్పుడు చేస్తున్న వాటిని తగ్గించమని కోరటమంటే దేనికి నిదర్శనం? అమెరికా లాంటి నాగరిక సమాజం ట్రంప్ చేసే వ్యాఖ్యలకు ఎలా స్పందిస్తుందో చూడాలి. ఏ మైనా ఇలాంటి సిత్రమైన వ్యాఖ్యల్ని చేసే సత్తా ట్రంప్ కు మాత్రమే ఉందని చెప్పక తప్పదు.