Begin typing your search above and press return to search.

వరల్డ్స్ రిచెస్ట్ ఆలయానికి తప్పని వైరస్ తిప్పలు..!

By:  Tupaki Desk   |   21 May 2020 10:30 PM GMT
వరల్డ్స్ రిచెస్ట్ ఆలయానికి తప్పని వైరస్ తిప్పలు..!
X
కేరళలో ఉన్న శ్రీ అనంత పద్మనాభ స్వామి ఆలయం ప్రపంచంలో కెల్లా అత్యంత ధనిక ఆలయం అని అందరికి తెలిసిందే. అలాంటి ఆలయం పై కూడా మహమ్మారి ఎఫెక్ట్ పడింది. సగటున రోజుకు 2 లక్షల రూపాయలు - హుండీ కానుకల రూపంలో మరో లక్ష రూపాయల వరకూ ఆదాయం ఈ గుడికి వచ్చేది. ఇప్పుడు ఆన్ ‌లైన్‌ విరాళాల రూపంలో రోజూ 10 నుంచి రూ. 20 వేల రూపాయల ఆదాయం మాత్రమే వస్తోంది. దీనితో గుడి కోసం ఉన్న 307 మంది సిబ్బందికి వేతనాలు ఇచ్చేందుకు బ్యాంకు డిపాజిట్లు - ఇతరత్రా డిపాజిట్లపై వచ్చే వడ్డీపై ఆధారపడుతున్నాం అని, ఆలయ ఖర్చుల కోసమని నా జీతం నుంచి 30 శాతం ఆలయ నిధికే ఇస్తున్నా అని శ్రీ అనంత పద్మనాభస్వామి ఆలయం ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ వి. రతీశన్ తెలిపారు.

గతంలో ప్రతి రోజూ 5-10 వేల మంది వరకూ దర్శనం చేసుకునేవారు. ఇప్పుడు వైరస్ కారణంగా అది సున్నాకు పడిపోయింది అని అయన తెలిపారు. మొత్తంగా మార్చి - ఏప్రిల్ నెలలకు గానూ తమకు రూ.4 కోట్ల నుంచి రూ.6 కోట్ల వరకూ ఆదాయంలో నష్టం వచ్చిందని ఆలయ యాజమాన్యం లెక్కగట్టింది. ఇక అత్యంత ధనిక దేవాలయ పరిస్థితే ఇలా ఉంటే, మిగతా ఆలయాల పరిస్థితి ఇంకా ఘోరంగా ఉంది.

శబరిమలలోని అయ్యప్ప స్వామి గుడి కూడా వీటిలో ఒకటి.ఉద్యోగులకు వేతనాలిచ్చే స్థితిలో కూడా మేం లేము. నా నెలవారీ వేతనంలోనూ 25 శాతం కోత పడుతోంది అని ట్రావెన్‌ కోర్ దేవస్వోమ్ బోర్డు (టీడీబీ) ఛైర్మన్ ఎన్.వాసు తెలిపారు. శబరిమల అయ్యప్ప స్వామి దేవాలయం సహా దాదాపు 1,250 గుళ్ల నిర్వహణను టీడీబీ చూసుకుంటోంది. లాక్‌డౌన్ అమల్లోకి వచ్చినప్పటి నుంచి వీటి ఆదాయాలు సున్నాకు పడిపోయాయి. అయితే, వేతనాలు చెల్లించేందుకు మాకు కనీసం రూ.40 కోట్లు అవసరం అని, అలాగే పూజల నిర్వహణకు మరో రూ.10 కోట్లు కావాలి. ఇప్పుడు ఉన్న కొన్ని నిధులతో సర్దుకుంటున్నాం అని ఎన్.వాసు తెలిపారు.

టీడీబీ నిర్వహణలో ఉన్న గుళ్లలో ఒక్క శబరిమల నుంచే రూ.100 కోట్ల ఆదాయం వచ్చేది అని , మిగతా ఆలయాల నుంచి రూ.100 కోట్ల వరకూ వచ్చేవి అని ,కానీ ఈ లాక్ డౌన్ కారణంగా ఒక్క రూపాయి కూడా రాలేదు అని అయన తెలిపారు. కేరళలోని గురువాయూర్ గుడి కూడా సంపన్న ఆలయాలలో ఒకటి. అయితే, మిగతా ఆలయాలతో పోల్చితే, ఈ ఆలయం పరిస్థితి మెరుగ్గానే ఉంది. గురువయ్యూర్ ఆలయ నిర్వహణ చేసుకోగలుగుతున్నామని ఆ ఆలయానికి సంబంధించిన అధికారి ఒకరు చెప్పారు. కర్ణాటకలోని కోస్తా జిల్లాల్లోని కొల్లూరు మూకాంబికా, కుక్కు సుబ్రమణ్య ఆలయాలకు దక్షిణ భారత రాష్ట్రాలతోపాటు విదేశాల నుంచి కూడా భక్తులు వస్తుంటారు. మొత్తంగా దేశంలోని చాలా దేవాలయ బోర్డులు ఉద్యోగులకి జీతాలు ఇవ్వడానికి నానా అవస్థలు పడుతున్నాయి.