Begin typing your search above and press return to search.

వెంటిలేటర్ల అవసరం ఎంతన్నది ఆ పరీక్ష చెప్పేస్తుందట!

By:  Tupaki Desk   |   3 July 2020 1:30 AM GMT
వెంటిలేటర్ల అవసరం ఎంతన్నది ఆ పరీక్ష చెప్పేస్తుందట!
X
ప్రపంచాన్ని వణికిస్తున్న మహమ్మారికి ఇప్పటివరకూ వ్యాక్సిన్ లేదు. ప్రపంచ వ్యాప్తంగా ఎదుర్కొంటున్న ఈ సమస్యకు పరిష్కారాన్ని కనుగునేందుకు పెద్దఎత్తున ప్రయత్నాలు జరుగుతున్నాయి. అయినప్పటికీ సరైన ఫలితాలు ఇప్పటివరకూ వచ్చింది లేదు. రానున్న రోజుల్లో వ్యాక్సిన్ వచ్చే అవకాశం ఉందని చెబుతున్నా.. ఎప్పుడన్న విషయానికి మాత్రం సమాధానం చెప్పలేకపోతున్నారు.

ఇదిలా ఉంటే.. మహమ్మారి సోకిన వారిలో పలువురు ప్రాణాలు కోల్పోతున్న సంగతి తెలిసిందే. దీనికి చెక్ పెట్టేందుకు వీలుగా పలు ప్రయోగాలు నిర్వహిస్తున్నారు. అలా చేస్తున్న ప్రయోగంలో తాజాగా ఒక విజయాన్ని సాధించారు శాస్త్రవేత్తలు. పాజిటివ్ గా తేలిన వారిలో రక్తపరీక్ష ద్వారా భవిష్యత్తులో వారికి వెంటిలేటర్ అవసరం ఎంతన్న విషయాన్ని ముందే గుర్తించే విధానాన్ని యూనివర్సిటీ ఆఫ్ వర్జీనియా శాస్త్రవేత్తలు కనుగున్నారు.

తాజాగా వారు చేపట్టిన అధ్యయనం ఆసక్తికర అంశాల్ని గుర్తించారు. వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్న రోగుల్లో కనిపించే సైటోకైన్ స్ట్రామ్ అనే ప్రోటీన్ ఎక్కువగా ఉన్నట్లు తేల్చారు. దీని ఆధారంగా సదరు రోగికి రాబోయే రోజుల్లో వెంటిలేటర్ అవసరం ఎంత ఉంటుందో అంచనా వేసేందుకు అవకాశం ఉంటుంది. ఈ విధానంతో ప్రాణాలు పోగొట్టుకునే వారి సంఖ్యను తగ్గించే వీలుంది.

రక్తంలో నిర్దిష్ట సైటోకైన్ ల స్థాయిని గుర్తించటం ద్వారా ప్రభావాన్ని ముందుగా అంచనా వేసుకునే అవకాశం ఉంటుంది. అదే సమయంలో షుగర్ పేషెంట్లలో వైరస్ ఎక్కువ ప్రతికూల ప్రభావాన్ని ఎందుకు చూపుతుందన్న విషయాన్ని తెలుసుకునే వీలు తాజా పరిశోధన సాయం చేస్తుందని చెబుతున్నారు. రక్తంలోని సైటోక్లైన్లను గుర్తించటం ద్వారా రోగులకు మెరుగైన వైద్యాన్ని అందించే వీలుతో పాటు.. ప్రాణాల్ని కాపాడటానికి సాయం చేస్తుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు. ఈ కొత్త ఆవిష్కరణ రానున్న రోజుల్లో ఎంతోమంది ప్రాణాల్నినిలిపే వీలుందని చెబుతున్నారు.

సాధారణంగా షుగర్ పేషెంట్లలో ఏదైనా ఫ్లూ వచ్చినప్పుడు సైటోకైన్ ప్రోటీన్ల ఉత్పత్తి పెరుగుతుంది. కరోనా సోకితే ఈ స్థాయి మరింత ఎక్కువ అవుతుందని గుర్తించారు. ఈ చర్యతో రోగ నిరోధక వ్యవస్థ తీవ్రమైన ప్రతిచర్యకు గురవుతున్నట్లు గుర్తించారు. ఈ కారణంగానే ఊపిరితిత్తులపై ఒత్తిడి పెరిగి ప్రాణాలు పోవటానికి కారణమవుతుందని గుర్తించారు. తాజాగా గుర్తించిన రక్త పరీక్ష ప్రపంచానికి మేలు చేసే అవకాశమే ఎక్కువని చెప్పక తప్పదు.