Begin typing your search above and press return to search.

కేసీయార్ కు గ్రేటర్లో డేంజర్ బెల్సే

By:  Tupaki Desk   |   5 Dec 2020 6:20 AM GMT
కేసీయార్ కు గ్రేటర్లో డేంజర్ బెల్సే
X
గ్రేటర్ ఎన్నికల్లో వచ్చిన ఫలితాలు కేసీయార్ కు కచ్చితంగా డేంజర్ బెల్స్ అనే చెప్పాలి. ఈ ఎన్నికల్లో సెంచెరీ కొడతామని చెప్పిన కేసీయార్ అండ్ కో కు జనాలు పెద్ద షాకే ఇచ్చారు. 2016 ఎన్నికల్లో 99 డివిజన్లలో గెలిచిన కారుపార్టీ తాజా ఎన్నికల్లో 56 డివిజన్లకు పడిపోయిందంటే డేంజర్ బెల్స్ మోగటం కాక మరేమిటి ? కారుకు ఎదురే లేదని అనుకుంటున్న కేసీయార్ కు ఒక్కసారిగా పెద్ద స్పీడు బ్రేకర్ ఎదురైనట్లే ఉంది.

ఈ ఎన్నికల్లో గ్రేటర్ ఓటర్లు టీఆర్ఎస్-ఎంఐఎం బంధాన్ని ఎంతమాత్రం అంగీకరించలేదని అర్ధమైపోయింది. తమ రెండు పార్టీల మధ్య ఎటువంటి పొత్తు లేదని ఇటు కేసీయార్, కేటీయార్ తో పాటు అటు ఎంఐఎం అధ్యక్షుడు అసదుద్దీన్ ఓవైసీ ఎంత మొత్తుకున్నా జనాలు నమ్మలేదన్న విషయం అర్ధమైపోయింది. ఎందుకంటే గ్రేటర్ ఎన్నికలకు ముందు వరకు తమ రెండు పార్టీలు ఒకటే అన్నట్లుగా కలరింగ్ ఇచ్చుకున్నాయి.

గ్రేటర్ ఎన్నికల ప్రకటన తర్వాత కూడా కేసీయార్ నిర్వహించిన సమావేశాలకు అసదుద్దీన్ హాజరయ్యారు. దాంతో ఆ రెండు పార్టీలు ఒకటే అని జనాలు నిర్ధారణ చేసుకున్నారు. కేసీయార్ కు ప్రత్యామ్నాయంగా కాంగ్రెస్, టీడీపీలు తేలిపోయిన తర్వాత ప్రత్యామ్నాయం కోసం జనాలు ఎదురు చూస్తున్నారు. ఈ విషయం దుబ్బాక ఉపఎన్నికలో బీజేపీని గెలిపించటంతోనే అందరికీ అర్దమైపోయింది. సెంటిమెంటును కూడా కాదని దుబ్బాకలో బీజేపీని జనాలు గెలిపించారంటే కేసీయార్ పై వ్యతిరేకత ఎంత బలంగా ఉందో అర్ధమైపోతోంది.

దుబ్బాక విజయం వేడి తగ్గకుండానే గ్రేటర్ ఎన్నికలు రావటం బీజేపీకి బాగా కలిసొచ్చింది. ఉపఎన్నికల విజయంతో మంచి ఊపుమీదున్న బీజేపీ నేతలు గ్రేటర్లో రెట్టించిన ఉత్సాహంతో పనిచేశారు. పనిలో పనిగా తమకు మద్దతుగా జాతీయస్ధాయి నేతలను కూడా ప్రచారంలోకి దింపటంతో జనాలకు కూడా కమలం పార్టీపై నమ్మకం కుదిరింది. దాని ఫలితంగానే బీజేపీ 49 డివిజన్లలో గెలిచింది. ఈ గెలుపును బట్టే ఎంఐఎంతో సంబంధాల విషయంలో కేసీయార్, కేటీయార్ ఎంత మొత్తుకున్నా జనాలు వాళ్ళని పట్టించుకోలేదు. ఎంఐఎంతో గట్టి బంధం ఉన్న కారణంగా టీఆర్ఎస్ ప్రస్తుతానికి దారుణంగా దెబ్బతిన్నది.

తాజా గ్రేటర్ రిజల్ట్ చూసిన తర్వాత ముందు ముందు ఎంఐఎంకు కూడా ఓల్డ్ సిటిలో కష్టాలు తప్పవనే అర్ధమైపోయింది. ఎలాగంటే ఓల్డ్ సిటి అన్నది ఎంఐఎం అడ్డా అన్న విషయం తెలిసిందే. అలాంటి చోట కూడా చాలా డివిజన్లలో ఎంఐఎంకు పోటాపోటీగా కమలంపార్టీ నిలిచింది. కొన్ని చోట్ల గెలుపు కూడా సాధించింది. అంటే ఇపుడు కేసీయార్ కు షాక్ కొట్టినట్లే భవిష్యత్తులో ఎంఐఎంకు కూడా షాకులు తప్పేలా లేదు. ఏదేమైనా కేసీయార్ కైతే డేంజర్ బెల్స్ మోగినట్లే అని అర్ధమైపోతోంది.