Begin typing your search above and press return to search.

తూనీగలు ఇస్తున్న హెచ్చరిక.. కోనసీమలో టెన్షన్‌ టెన్షన్‌

By:  Tupaki Desk   |   29 Sep 2021 7:30 AM GMT
తూనీగలు ఇస్తున్న హెచ్చరిక.. కోనసీమలో టెన్షన్‌ టెన్షన్‌
X
నిపుణులు ఎప్పటికప్పుడు భవిష్యత్ గురించి అంచనాలు వేస్తూ ప్రజలను హెచ్చరిస్తుండటం మనం చూడొచ్చు. కరోనా సమయంలో అదే జరిగింది. ఫస్ట్, సెకండ్ వేవ్ ముప్పు గురించి నిపుణులు పేర్కొన్న దాని కంటే ఎక్కువగానే పరిస్థితులు మనం చూశాం. ఈ క్రమంలోనే అక్టోబర్, నవంబర్‌లో కొవిడ్ థర్డ్ వేవ్ ముప్పు పొంచి ఉన్నదని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో జనాలు మాస్కు ధరించడంతో పాటు భౌతిక దూరం పాటిస్తూ టీకాలు తీసుకుంటున్నారు.

రెండు డోసుల వ్యాక్సిన్ తీసుకున్నప్పటికీ జాగ్రత్తలు తీసుకోవాల్సిందేనని వైద్య నిపుణులు సూచిస్తున్నారు. ఇకపోతే ఈ సంగతులు ఇలా ఉంచితే..ప్రకృతి సైతం విపత్తులకు సంబంధించిన హెచ్చరికలు జారీ చేస్తుంటుందని పెద్దలు చెప్తుంటారు. సంప్రదాయ మార్గంలో స్థానిక ప్రజలు ఆ అంచనాలను అందుకుని అప్రమత్తంగా ఉంటారు. ఏపీలోని కోనసీమ వాసులకు ఇప్పుడు అటువంటి సంకేతాలు అందుతున్నాయట. తూనీగలు ప్రకృతి విపత్తుకు సంబంధించి సంకేతాలు పంపుతున్నట్లు స్థానికులు నమ్ముతున్నారు.

స్థానిక ప్రజల నమ్మకం ప్రకారం.. కోనసీమ తూనీగలు ఆ ప్రాంతంలో వచ్చే తుపాను, వర్షం ఇతరాల గురించి మెసేజ్ ఇస్తాయట. ప్రకృతిలో ఆ మేరకు మార్పులు కూడా సంభవిస్తాయని పేర్కొంటున్నారు స్థానికులు. తూనీగలు సాధారణం కంటే కొంచెం ఎక్కువ హైట్‌‌కు ఎగిరితే ఎండ తీవ్రత ఎక్కువగా ఉంటుందని, అదే హైట్ తక్కువగా ఎగురుతుంటే మరికాసేపట్లో వాన పడుతుందని, అదే తూనీగలు గుంపులుగా కనిపిస్తే ఏదో ప్రమాదం పొంచి ఉన్నట్లేనని స్థానికులు చెప్తున్నారు. ఈ అంచనా ప్రకారం.. కొనసీమకు ముప్పు పొంచి ఉందని, విరుచుకుపడటానికి ప్రకృతి సిద్ధమవుతున్నదని స్థానిక ప్రజానీకం టెన్షన్ పడుతున్నది.

ఇటీవల కాలంలో లక్షలాదిగా తూనీగలు కమ్ముకు వచ్చాయట. ఈ నేపథ్యంలోనే తూనీగలు గుంపులుగా ఏర్పడటం ద్వారా ఏదో జరుగుతుందని భయపడుతున్నారు. కోనసీమ స్థానిక ప్రాంతంలో ఎటు వైపు చూసినా అమలాపురం పరిసర ప్రాంతాల్లోనూ లక్షలాది తూనీగలు గుంపులుగా సంచరిస్తున్నాయి. ఆకాశం వైపు చూస్తే చాలు.. తూనీగలే కనబడుతున్నాయి. దీంతో కోనసీమవాసులు భయాందోళన చెందుతున్నారు. స్థానికులు ఈ విషయమై మాట్లాడుతూ గతంలో వేలల్లో కనబడే తూనీగలు ఈ సారి లక్షల్లో కనబడుతున్నాయని అంటున్నారు. వాటిని చూస్తే చాలు భయం వేస్తుందని, ఏదో ప్రకృతి విపత్తు తుపాను లేదా సునామీ సంభవించే చాన్స్ ఉందని, అందుకే ఇలా తూనీగలు బయటకు వచ్చాయని స్థానికులు అనుమాన పడుతున్నారు. అయితే, ఇదంతా ఉట్టి మూఢనమ్మకమేనని, శాస్త్రీయమైన ఎటువంటి ఆధారాలు లేవని మరికొందరు అంటున్నారు.

కచ్చితంగా ప్రకృతి విపత్తు సంకేతాలు తూనీగలు ఇస్తున్నాయని కొందరు పేర్కొంటుండగా, అదంతా ఉట్టిదేనని మరికొందరు అంటున్నారు. అయితే, తూనీగలు ఇలా బయటకు రావడానికి గల కారణాలను శాస్త్రీయంగా అధ్యయనం చేయాలని అధికారులను మరికొందరు స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. తూనీగలు వేడి లేదా చలిని తట్టుకోలేక అలా ఆకాశం వైపునకు గుంపులుగా ఎగురుతున్నాయా? లేదా ఏదేని హెచ్చరికలు జారీ చేస్తున్నాయా? అనే విషయమై అటవీ శాఖ అధికారులు ఇతర శాఖ అధికారులతో సమన్వయం చేసుకుని సమగ్ర పరిశీలన చేయాలని కోరుతున్నారు.