Begin typing your search above and press return to search.

యడ్డీ పదవికి డేంజర్ బెల్స్

By:  Tupaki Desk   |   18 Jun 2021 8:00 PM IST
యడ్డీ పదవికి డేంజర్ బెల్స్
X
కర్నాటక ముఖ్యమంత్రి యడ్యూరప్ప పదవికి డెంజర్ బెల్స్ మోగుతున్నాయా ? అవుననే అంటున్నాయి పార్టీ వర్గాలు. యడ్డీ వివాదాన్ని పరిష్కరించేందుకు ప్రత్యేకించి బీజేపీ అగ్రనేతలు అరుణ్ సింగ్ ను ఢిల్లీ నుండి బెంగుళూరుకు పంపారు. గడచిన రెండు రోజులుగా మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీలతో సమావేశమైన అరుణ్ సింగ్ అందరి అభిప్రాయాలు తీసుకుంటున్నారు.

సింగ్ తో భేటీ అయిన మంత్రుల్లో కొందరు యడ్డీపై ఆరోపణలు చేయటమే కాకుండా తమ అసంతృప్తిని వ్యక్తం చేశారు. అలాగే సింగ్ తో భేటీ అయిన 50 మంది ఎంఎల్ఏ+ఎంఎల్సీల్లో కూడా చాలామంది ముఖ్యమంత్రి పనితీరుపై తీవ్రంగా విరుచుకుపడినట్లు సమాచారం. వయస్సయిపోయిన కారణంగా యడ్యూరప్ప సీఎంగా పనికిరాడని కొందరు చెప్పారట. తమ వాదనకు మద్దతుగా కొన్ని ఉదాహరణలు కూడా వినిపించారట.

అలాగే మరికొందరు ఎంఎల్ఏలు మాట్లాడుతూ తండ్రి పదవిని అడ్డుపెట్టుకుని కొడుకు విజయేంద్ర భారీ ఎత్తున అవినీతి చేస్తున్నట్లు ఆరోపించారట. పైగా తన అవినీతికి జాతీయ నేతల పేర్లను వాడుకుంటున్నట్లు చెప్పారట. ఇలాగే ఎవరి దగ్గరున్న సమాచారాన్ని, ఎవరి అభిప్రాయాలను వారు యడ్డీకి వ్యతిరేకంగానే వినిపించారట.

అంటే క్షేత్రస్ధాయిలో జరుగుతున్నది చూస్తుంటే యడ్డీకి వ్యతిరేకంగా మంత్రులు, ఎంఎల్ఏలు, ఎంఎల్సీల్లో బలమైన ప్రత్యర్ధివర్గం తయారైనట్లు అర్ధమైపోతోంది. విచిత్రమేమిటంటే యడ్యూరప్ప ఎప్పుడు ముఖ్యమంత్రిగా పనిచేసినా విపరీతమైన అవినీతి ఆరోపణలు రావటం, పార్టీపరంగా విచారణ జరపటం మామూలైపోయింది. యడ్డీపై అభిప్రాయాలు సేకరించిన అరుణ్ సింగ్ భేటీ విషయాలపై మీడియాతో మాట్లాడద్దని ఆంక్షలు విధించటమే ఆశ్చర్యంగా ఉంది.