Begin typing your search above and press return to search.

కేసీఆర్ పై.. దండ‌‘యాత్ర‌’!

By:  Tupaki Desk   |   1 July 2021 10:30 AM GMT
కేసీఆర్ పై.. దండ‌‘యాత్ర‌’!
X
‘పాదయాత్ర.. ’ పైకి చూడ్డానికి ఇదొక ప‌ద‌మేగానీ.. త‌రచి చూస్తే ఇదొక అద్భుత‌మైన అస్త్రం. స‌రిగ్గా వినియోగించుకోవాలేగానీ.. ప్ర‌భుత్వాల‌ను కూల్చ‌గ‌ల‌దు. కొత్త ప్ర‌భుత్వాన్ని కొలువు తీర్చ‌నూ గ‌ల‌దు. ఇది ఆల్రెడీ నిరూపిత‌మైన వాస్త‌వం. తెలుగు రాష్ట్రాల్లో ఘ‌న‌మైన పాద‌యాత్ర‌లుగా చెప్పుకునేవి రెండూ వైఎస్ రాజ‌శేఖ‌ర రెడ్డి, వైఎస్ జ‌గ‌న్ చేసిన‌వే కావ‌డం గ‌మ‌నార్హం. చిత్రంగా.. ఇవి రెండూ చంద్ర‌బాబుకు వ్య‌తిరేకంగా చేసిన‌వే కావ‌డం విశేషం. స‌క్సెస్ ఫుల్ గా టీడీపీ ప్ర‌భుత్వాన్ని దించేసిన‌వి కూడా కావ‌డం గ‌మ‌నించాల్సిన అంశం. అయితే.. ఇప్పుడు ఇదే అస్త్రాన్ని కేసీఆర్ పై ప్ర‌యోగించేందుకు సిద్ధ‌మ‌వుతున్నారు విప‌క్ష నేత‌లు!

తెలంగాణ‌లో కేసీఆర్ ను ఢీకొట్ట‌డం ఇప్పుడున్న ప‌రిస్థితుల్లో అంత తేలికైన విష‌యం అయితే కాదు. ఏదైనా అద్భుతం జ‌ర‌గాలి. అది పాద‌యాత్ర‌తోనే సాధ్యం అని న‌మ్ముతున్నాయి విప‌క్షాలు. పీసీసీ అధ్య‌క్షుడిగా బాధ్య‌త‌లు స్వీక‌రించిన రేవంత్ రెడ్డి.. పాద‌యాత్ర చేసేందుకు సిద్ధ‌మ‌వుతున్న‌ట్టుగా తెలుస్తోంది. టీపీసీసీ వ‌ర్కింగ్ ప్రెసిడెంట్ గా ఉన్న‌ప్పుడే.. ఆయ‌న పాద‌యాత్ర‌కు పూనుకున్న సంగ‌తి తెలిసిందే. కానీ.. సీనియ‌ర్లు హైక‌మాండ్ కు ఫిర్యాదు చేసి అడ్డుకున్నారు. మ‌రి, ఇప్పుడు ఆయ‌నే బాస్‌. కాబ‌ట్టి.. పాద‌యాత్ర‌తోనే కేసీఆర్ పై యుద్ధం ప్ర‌క‌టించాల‌ని చూస్తున్న‌ట్టు స‌మాచారం.

అటు బీజేపీ నేత‌లు కూడా ఇదే మంత్రాన్ని ప్ర‌యోగించేందుకు చూస్తున్నార‌ట‌. కేసీఆర్ విష‌యంలో దూకుడుగా వ్య‌వ‌హ‌రించే రాష్ట్ర అధ్య‌క్షుడు బండి సంజ‌య్ సైతం పాద‌యాత్ర చేయ‌డాల‌ని చూస్తున్న‌ట్టు వినికిడి. ఈ క‌రోనా గోల లేకుంటే.. ఆయ‌న ఈ పాటికే మొద‌లు పెట్టేవార‌ని కూడా తెలుస్తోంది. టీఆర్ఎస్ కు స‌రైన ప్ర‌త్యామ్నాయం తామేన‌ని చెప్పుకుంటున్న కాషాయ పార్టీ.. పాద‌యాత్ర ద్వారా ఈ హైప్ ను మ‌రింత పెంచాల‌ని చూస్తోంద‌ట‌.

ఇక‌, తెలంగాణ రాజ‌కీయాల్లోకి ప్ర‌వేశించిన ష‌ర్మిల సైతం పాద‌యాత్ర చేస్తాన‌ని గ‌తంలోనే ప్రకటించారు. ప్ర‌జ‌ల స‌మ‌స్య‌ల‌ను తెలుసుకునేందుకు తాను యాత్ర‌కు శ్రీకారం చూడ‌తాన‌ని ఖ‌మ్మం వేదిక‌గా ప్ర‌క‌టించారు. అయితే.. క‌రోనా సెకండ్ వేవ్ కారణంగానే ష‌ర్మిల యాత్ర నిలిచిపోయిందని తెలుస్తోంది. ఈ ప‌రిస్థితులు చ‌క్క‌బ‌డితే.. నేత‌లు ఒక్కొరొక్క‌రుగా రోడ్డెక్కే అవ‌కాశం ఉంద‌ని స‌మాచారం. మొత్తానికి తెలంగాణ రాజ‌కీయాల్లో స‌రికొత్త అధ్యాయం అయితే మొద‌లు కాబోతోంది. మ‌రి, ఇది ఎన్నిక‌ల నాటికి ఏ రూపు తీసుకుంటుంది? కేసీఆర్ ఎలా ఎదుర్కొంటారు? అన్న‌ది చూడాలి.