Begin typing your search above and press return to search.

నయీం...దానం..మ‌ధ్య‌లో కేటీఆర్‌

By:  Tupaki Desk   |   25 Sep 2016 5:53 AM GMT
నయీం...దానం..మ‌ధ్య‌లో కేటీఆర్‌
X
దానం నాగేందర్‌... మాజీ మంత్రి - ప్ర‌స్తుతం హైదరాబాద్‌ కాంగ్రెస్‌ పార్టీ జిల్లా అధ్యక్షుడు. పేరుకే జిల్లా అధ్య‌క్ష స్థానంలో ఉన్న‌ప్ప‌టికీ ఆయ‌న పార్టీలో ఉన్నారో లేరో కూడా తెలియ‌ని ప‌రిస్థితి. పార్టీకి చెందిన సీనియర్ నేతలు రాష్ట్ర వ్య‌వ‌హార‌ల ఇంచార్జీ దిగ్విజయ్‌ సింగ్ వంటివారు కాంగ్రెస్ త‌ర‌ఫున శిక్షణా తరగతులు ఏర్పాటు చేస్తే న‌గ‌ర అధ్య‌క్షుడైన దానం వాటికి డుమ్మాకొట్టారు. అదే స‌మ‌యంలో ముఖ్య‌మంత్రి కేసీఆర్ త‌న‌యుడు కేటీఆర్‌తో భేటీ అయ్యారు. . నయీం డైరీలో ఆయన పేరు ఉన్నట్టు వార్తలు గుప్పుమనడంతో ఆయన హుటాహుటిన మంత్రి కేటీఆర్‌ ను కలిసినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. ఈ నేప‌థ్యంలో దానం దారెటు అనే అంశంపై మళ్లీ చర్చ మొదలైంది.

గ్రేట‌ర్ హైద‌రాబాద్ ఎన్నిక‌ల స‌మ‌యం నుంచి దానం నాగేందర్ పార్టీ మారతారని వార్త‌లు వ‌చ్చాయి. టీఆర్‌ ఎస్‌ లో చేరబోతున్నట్టు రాత్రిపూట హైదరాబాద్‌ లో బ్యానర్లు వెలిశాయి. తెల్లారేటప్పటికీ అలాంటిదేమి లేదని చెప్పి అజ్ఞాతంలోకి వెళ్లిపోయారు. ఇలా కాంగ్రెస్‌ ను వీడుతున్న‌ట్లు ఒకసారి, లేదు మారబోనని మరోసారి మీడియాకు ప్రకటనలు ఇస్తున్నారు. ఇటీవల‌ మంత్రి కేటీఆర్‌ ను కలిసిన నేప‌థ్యంలో అధికార పార్టీ నుంచి హామీ దొరికితే పార్టీ మారే అవకాశం ఉందని పార్టీ వర్గాలు అంటున్నాయి. ఇటు ఇబ్బందులు పడుతూ కాంగ్రెస్‌ లో ఉండలేక...గులాబీ బాస్‌ నుంచి హామీ రాక దానం పరిస్థితి అడకత్తెరలో పొకచెక్కలా మారిందని తెలుస్తోంది. ఇప్పటికే దానంతో ఆ పార్టీ నేతలు షబ్బీర్‌ అలీ - ఉత్తమ్‌ కుమార్‌ రెడ్డి అనేక దఫాలుగా చర్చలు జరిపారు. అయినప్పటికీ ఆయన రాజకీయ భవిష్యత్తుపై ఎటూ తేల్చుకోలేక గోడమీద పిల్లిలా ఉంటున్నారని పార్టీవర్గాలు చెబుతున్నాయి. 'పార్టీలో కొనసాగమని అనేకసార్లు బుజ్జగించాం..ఉండలాని చెప్పాం. ఇక నిర్ణయం తీసుకోవాల్సింది ఆయనే.. పార్టీలో ఉండడం - ఉండకపోవడం అంతా ఆయన ఇష్టం ' అని ఒక సీనియర్‌ నేత తెలిపారు.

లాభసాటి ఒప్పందం కుదరకపోవడంతో టీఆర్‌ ఎస్‌ పార్టీలో చేరేందుకు తటపటాయిస్తున్నారని పార్టీ సీనియర్‌ నేతలు ఆరోపిస్తున్నారు. నయీం డైరీలో ఆయన పేరు ఉన్నట్టు వార్తలు గుప్పుమనడంతో ఆయన హుటాహుటిన మంత్రి కేటీఆర్‌ను కలిసినట్టు విమర్శలు వెల్లువెత్తాయి. నగర అధ్యక్షుడిగా ఉన్న దానం ఊగిసలాటలో ఉండడంతో పార్టీ అధ్యక్ష పదవిని ఆశిస్తున్న కొంత మంది ఆయన పోతే పోనీలే అంటున్నారు.