Begin typing your search above and press return to search.

కొసరు బాధ్యతలకే రాజీనామా ఏంటి దానం?

By:  Tupaki Desk   |   6 Feb 2016 11:30 AM GMT
కొసరు బాధ్యతలకే రాజీనామా ఏంటి దానం?
X
ఎన్నికలు జరిగిన సమయంలో దారుణమైన ఓటమి ఎదురైతే.. దానికి బాధ్యత వహిస్తూ తాము నిర్వహిస్తున్న పదవికి రాజీనామా చేయటం మామూలే. తాజాగా ఆ జాబితాలోకి వచ్చేశారు గ్రేటర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు దానం నాగేందర్. గ్రేటర్ ఎన్నికల్లో దారుణ పరాజయం అనంతరం ఆయన మాట్లాడారు. గ్రేటర్ లో పార్టీ దారుణ పరాజయానికి బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేసినట్లుగా దానం పేర్కొన్నారు.

తనకు పూర్తిస్థాయిలో బాధ్యతలు అప్పజెప్పనప్పటికీ.. తాజా పరాజయానికి నైతిక బాధ్యత వహిస్తూ గ్రేటర్ అధ్యక్ష పదవికి రాజీనామా చేస్తున్నట్లు దానం ప్రకటించారు. ఇప్పటివరకూ ఇచ్చిన అవకాశానికి ధన్యవాదాలు చెప్పిన ఆయన.. తాను కాంగ్రెస్ లోనే కొనసాగుతానని.. సామాన్య కార్యకర్తలానే వ్యవహరిస్తానని పేర్కొన్నారు.

బడుగు.. బలహీనవర్గాల్ని పార్టీ దూరం చేసుకుందని.. ఆ విషయాన్ని పార్టీ అధినాయకత్వానికి పలుమార్లు చెప్పినట్లుగా వెల్లడించిన దానం.. కాంగ్రెస్ పార్టీ ఎస్సీ.. ఎస్టీ.. మైనార్టీల విశ్వసనీయత కోల్పోయిందని వ్యాఖ్యానించటం గమనార్హం. పార్టీలో గ్రూపుల్ని ప్రోత్సహిస్తున్నారని.. పార్టీకి మంచిది కాదని తాను ఇంతకు ముందే చెప్పినట్లుగా పేర్కొన్నారు. గ్రేటర్ ఎన్నికల్లో తమ పార్టీ వారంతా ఓడిపోతున్నట్లు తాను ముందే చెప్పినట్లుగా దానం పేర్కొనటం గమనార్హం. ఎన్నికల సమయంలో ప్రజల మూడ్ చూస్తేనే విషయం స్పష్టంగా అర్థమైందని చెప్పారు. హైదరాబాద్ ప్రజలు చాలా తెలివిగా ఓట్లు వేసినట్లుగా వ్యాఖ్యానించారు. టీఆర్ఎస్ తప్ప వేరే పార్టీ అధికారంలోకి వస్తే అభివృద్ధి జరగదన్న ఆలోచనతోనే హైదాబాదీయులు ఓట్లు వేసినట్లుగా పేర్కొన్నారు. అయినా.. కొసరు బాధ్యతలు నిర్వర్తిస్తున్నదానం రాజీనామా చేయటం ఏమిటి? అయినా.. ఓడిపోతున్నట్లు ముందే తెలిసినప్పుడు.. రిజల్ట్ రాగానే నైతికబాధ్యత అంటూ రాజీనామా చేయటం ఏమిటో దానంకే తెలియాలి.