Begin typing your search above and press return to search.

దామోదర తెలివిగా తప్పించుకున్నాడే!

By:  Tupaki Desk   |   28 Oct 2015 10:30 PM GMT
దామోదర తెలివిగా తప్పించుకున్నాడే!
X
కాంగ్రెస్‌ పార్టీకి చెందిన మాజీ డిప్యూటీ ముఖ్యమంత్రి దామోదర రాజనరసింహను చూసి తెలంగాణలోని పలువురు కాంగ్రెస్‌ నాయకులు ఇప్పుడు అసూయ పడుతున్నారు. ఇలా అసూయ పడుతున్న వారిలో ప్రధానంగా ఆయన వర్గ ప్రత్యర్ధులే ఎక్కువగా ఉన్నారు. అరె.. దామోదర వరంగల్‌ ఎంపీ ఉప ఎన్నిక బరిలో అభ్యర్థిగా పోటీ చేయాల్సి వచ్చే పరిస్థితి నుంచి తృటిలో తప్పించుకున్నాడే.. అని వారు విచారిస్తున్నారు. దామోదర రాజనరసింహను అధిష్ఠానం ఫస్ట్‌ మరియు టాప్‌ మోస్ట్‌ ఆప్షన్‌ గా పరిగణించి ఉంటే పరిస్థితి బలే ఉండేదని.. డిప్యూటీ సీఎంగా వెనకేసుకున్న సంపద కరిగిపోయి ఉండేదిన పార్టీలోని ఆయన శత్రుకూటమి అంచనా వేస్తున్నారు. అందుకే దామోదర భలే తప్పించుకున్నాడే అని అనుకుంటున్నారు.

నిజానికి రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ వరంగల్‌ కోసం అభ్యర్థుల ప్రాబబుల్స్‌ గా తయారుచేసిన ఆరుగురి జాబితాలో దామోదరదే రెండో పేరు. వివేక్‌ తర్వాత ఆయన అయితేనే బాగుంటుందని... ఆర్థికంగా ఖర్చును తట్టుకోగలడని రాష్ట్ర పార్టీ సూచించింది. అయితే తుది జాబితాలోకి తన పేరు రాకుండా రాజనరసింహ తెలివిగా తప్పించుకోగలిగారు.

వరంగల్‌ ఉప ఎన్నికకు పెట్టే ఖర్చు దండగైపోతుందని కాంగ్రెస్‌ నాయకులంతా పోటీకి విముఖత వ్యక్తం చేస్తున్న సంగతి తెలిసిందే. అధిష్ఠానం పెద్దలు కూడా పదేపదే వెంటపడుతున్నప్పటికీ.. వివేక్‌ మాత్రం ససేమిరా అంటున్నారు. నిజానికి ఆయన తర్వాత అంత ఒత్తిడిని ఎదుర్కోవాల్సి ఉన్న నాయకుడు దామోదర రాజనరసింహ. వరంగల్‌ ఉప ఎన్నిక లో పోటీచేయడం వివేక్‌ కు ఇష్టం లేదనే సంగతి రాష్ట్ర నాయకులకు ఎప్పటినుంచో తెలుసు. అందుకే గతంలో ఈ విషయమై జరిగిన సమావేశాల్లో వారు రాజనరసింహను కూడా అడగడమూ.. ఆయన రాష్ట్ర రాజకీయాలు వదలి కేంద్ర రాజకీయాలకు వెళ్లడం తనకు ఇష్టం లేదన్నట్లుగా తెలివిగా జవాబివ్వడమూ జరిగింది.

మామూలుగా అయితే ఆర్థిక వనరుల పరంగా గట్టి అభ్యర్థినే వరంగల్‌ బరిలో మోహరించాలనే పార్టీ అనుకుంటున్న సంగతి క్లియర్‌. అయితే ఆ జాబితాలో వివేక్‌ తర్వాత రాజనరసింహ పేరే పరిశీలనకు రావాలి. అయితే ఏం మాయ చేశారో గానీ.. ఆయన బలే తప్పించుకున్నారని.. పార్టీలో నాయకులు చెప్పుకుంటున్నారు.