Begin typing your search above and press return to search.

పాడు ప్లాస్టిక్ రక్తాన్ని వదల్లేదు.. ప్రపంచానికి సరికొత్త ఉపద్రవం

By:  Tupaki Desk   |   26 March 2022 5:26 AM GMT
పాడు ప్లాస్టిక్ రక్తాన్ని వదల్లేదు.. ప్రపంచానికి సరికొత్త ఉపద్రవం
X
అక్కడా ఇక్కడా అన్న తేడా లేకుండా ఎక్కడైనా సరే విడిచిపెట్టకుండా ఉండే ప్లాస్టిక్.. ఇప్పుడు మనిషి రక్తంలోనే కాదు.. తల్లి గర్భంలోని ఉమ్మినీరులోకి వెళ్లిపోయిన వైనం తొలిసారి బయటకు వచ్చింది. ప్రపంచానికి పెద్ద సమస్యగా మారిన ప్లాస్టిక్ భూతం ఇప్పుడు ఏకంగా మనిషి రక్తంలోకి చేరిన వైనాన్ని గుర్తించిన వైనం ప్రపంచాన్ని షాక్ కు గురి చేస్తోంది. మనిషి శరీరంలోని మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు కొత్త విషయమేమీ కాదు. కానీ.. తాజాగా మాత్రం ప్రపంచంలోనే తొలిసారి మానవ రక్తంలో మైక్రో ప్లాస్టిక్ అవశేషాల్ని గుర్తించారు.

ఈ ఆందోళనకరమైన అంశాన్ని నెదర్లాండ్స్ కు చెందిన శాస్త్రవేత్తలు గుర్తించారు. మొత్తం 22 మంది రక్త నమూనాల్ని సేకరించి పరిశీలించారు. వారిలో 17 మంది రక్తంలో మైక్రో ప్లాస్టిక్ అవశేషాలు ఉన్నాయి.

అంగుళంలో 0.00002 వంతు పరిమాణంలో ఉండే అత్యంత సూక్ష్మ ప్లాస్టిక్ కణాలుగా వీటిని గుర్తించారు. ఇది నిజంగా ఆందోళన కలిగించే అంశంగా చెబుతున్నారు. అయితే.. ఈ అంశాన్ని మరింత ఎక్కువ నమూనాల్లో సేకరించి పరిశోధన జరపాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు.

అయితే.. రక్తంలో ఉన్న సూక్ష్మ ప్లాస్టిక్ కణాలు ఒకే చోట ఉంటున్నాయా? రక్తం సరఫరా అయ్యే క్రమంలో వివిధ అవయువాలకు చేరుతున్నాయా? అన్న ప్రశ్నలతో పాటు మెదడులోకి రక్తంలోని విషాలను వెళ్లకుండా నిరోధించే బ్లడ్ బ్రెయిన్ బ్యారియర్ వ్యవస్థను కూడా అధిగమించి మెదడులోకి కూడా చేరుతున్నాయా? అన్న అంశం మీద పరిశోధనలు చేయాల్సి ఉంటుందని చెబుతున్నారు. ప్లాస్టిక్ కాలుష్యం మీద పోరాటం చేస్తున్న "కామన్ సీస్" అనే సంస్థ ఈ అధ్యయనం వెనుక ఉంది.
తాజా అధ్యయనంలో భాగంగా తాము సేకరించిన రక్తపు నమూనాల్లో ఐదు రకాల ప్లాస్టిక్ అవశేషాల గురించి పరిశోధకులు శోధించారు. ఆ ఐదు ఏమంటే..

1. పాలీమిథైల్‌ మెథక్రిలేట్‌
2. పాలీప్రొపిలీన్‌
3. పాలిస్టరీన్‌
4. పాలీ ఇథలీన్‌
5. పాలీ ఇథలీన్‌ టెరెఫ్తాలేట్‌

మొత్తం సేకరించిన నమూనాల్లో 50 శాతం రక్త నమూనాల్లో 'పాలీ ఇథలీన్ టెరెఫ్తాలేట్ ఉన్నట్లు గుర్తించారు. ఇది అందరిని ఆందోళనకు గురి చేసే అంశం. ఎందుకంటే.. మనం ఎంతో ఇష్టంగా.. నిత్యం వినియోగించే పెట్ బాటిల్స్ ను ఈ ప్లాస్టిక్ తోనే తయారు చేస్తుంటారు. ఫుడ్ ప్యాకేజింగ్ లో ఈ ప్లాస్టిక్ ను విరివిరిగా వినియోగిస్తుంటారు. ఇక.. రెండో స్థానంలో 36 శాతం నమూనాల్లో 'పాలిస్టరీన్' అవశేషాల్ని గుర్తించారు. ఇది.. మనం నిత్యం వాడు క్యారీ బ్యాగుల్లో ఉంటుంది. సో.. రోజువారీ జీవితంలోని అలవాట్లను తక్షణం మార్చుకోకుంటే.. రానున్న రోజుల్లో ఆరోగ్య సమస్యలు ఖాయమని చెప్పక తప్పదు.