Begin typing your search above and press return to search.

దళితబంధు మార్గదర్శకాలు.. లబ్ధిదారుల ఎంపిక ఇలా..

By:  Tupaki Desk   |   6 Aug 2021 7:17 AM GMT
దళితబంధు మార్గదర్శకాలు.. లబ్ధిదారుల ఎంపిక ఇలా..
X
తెలంగాణ రాష్ట్రంలో ప్రవేశపెట్టిన దళిత బంధు పథకం సంబంధించిన మార్గదర్శకాలను ప్రభుత్వం విడుదల చేసింది. నిరుపేదలైన దళితులు లబ్ధి పొందేలా ఈ పథకం విజయవంతం కోసం అధికారులు పకడ్బందీగా పనిచేయాలని ఇప్పటికే సీఎం కేసీఆర్ సూచించారు. ఇందులో భాగంగా తాజాగా పథకం లబ్ధిదారులకు ఎలా చేర్చాలి..? వారికి ఈ పథకం ఏవిధంగా ఉపయోగపడనుంది..?వంటి అంశాలను చెప్పారు. దళిత బంధు పథక అమలు మొత్తం అధికారుల పర్యవేక్షణలో జరగనుంది. దీని కోసం ప్రత్యేకంగా జిల్లా, మండల, గ్రామస్థాయిలో కమిటీలు వేయనున్నారు. జిల్లాస్థాయిలో కలెక్టర్ పర్యవేక్షించనున్నారు. ఈ కమిటీలోని సభ్యలు అర్హులను గుర్తించి వారికి నిధులు మంజూరు చేయనున్నారు.

దళిత బంధు పథకం కమిటీ నిర్వహిస్తుంది. జిల్లా స్థాయిలో కలెక్టర్ అధ్యక్షుడిగా ఉంటారు. అలాగే కమిటీలో జడ్పీ సీఈవో, వ్యవసాయ, పశుసంవర్థక, డీఆర్డీఏ, రవాణా, పరిశ్రమ శాఖల అధికారులు సభ్యులుగా ఉంటారు. అలాగే కలెక్టర్ నామినేట్ చేసి మరో ఇద్దరు సభ్యులు కూడా ఉంటారు. ఇక గ్రామస్థాయిలో పంచాయతీ కార్యదర్శి, వ్యవసాయ విస్తరణాధికారి, రెవెన్యూ అధికారి ఉంటారు. వీరు దళిత బంధువ పథకాన్ని పకడ్బందీగా నిర్వహిస్తారు.

పేద దళితులు అభివృద్ది చెందాలన్న ఉద్దేశంతో ‘దళిత బంధు’ను ప్రవేశపెట్టామని సీఎం కేసీఆర్ ఇప్పటికే పలుమార్లు చెప్పారు. ఇందుకోసం కుటుంబానికి రూ.10 లక్షలు అందించనున్నట్లు తెలిపారు. అయితే దళిత బంధు నిధులు మహిళల ఖాతాల్లోనే జమ చేస్తామని ఎస్సీ కార్పొరేషన్ డైరెక్టర్ పి.కరుణాకర్ తెలిపారు. ముందుగా అర్హులను గుర్తించి వారి కుటుంబాల్లోని మహిళ ఖాతాల్లోకి నేరుగా డబ్బులు వేస్తామని వెల్లడించారు. ఈ పథకం ప్రభుత్వ ఉద్యోగులకు వర్తించదని పేర్కొన్నారు. జిల్లా కలెక్టర్ తయారు చేసిన ప్రొసిడింగ్ ప్రకారం దళిత నిధులు మంజూరు చేస్తామన్నారు.

ఇక అర్హులు వారు చేయాలనుకున్న పనులు సంబంధిత అధికారులతో యూనిట్లను ప్రారంభించుకోవచ్చని తెలిపారు. లబ్ధి పొందిన కుటుంబాలకు ప్రత్యేకంగా కోడ్ కేటాయిస్తామని, ఓ క్యూఆర్ కోడ్ కూడా ఉంటుందని తెలిపారు. అలాగే యూనిట్ మంజూరు చేయడంతో పాటు దానికి సరిపడేలా ఇన్సూరెన్ష్ ను కూడా ఇప్పిస్తామన్నారు. దళితులు అత్యవసర పరిస్థితుల్లో డబ్బు సాయం అందించేందుు దళిత రక్షణ నిధిని కూడా ఏర్పాటు చేయనున్నారు. దళిత బంధు పథకం పొందిన వారు దళిత రక్షణ నిధికి రూ.10వేలు, ఎస్సీ కార్పొరేషన్ నుంచి రూ.10 వేలు జోడించి మొత్తం రూ.20 వేలను దళిత రక్షణ నిధికి అందజేస్తారు. ఈ మొత్తం దళితులు అత్యవసర సమయాల్లో వాడుకోవచ్చన్నారు. అయితే దళిత బంధు లబ్దిదారులు సంవత్సరానికి రూ.1000 కంట్రిబ్యూటర్ చెల్లించాల్సి ఉంటుందన్నారు. వారు చెల్లించిన మొత్తం మళ్లీ వారే అత్యవసర సమయాల్లో వినియోగించుకోవచ్చు.

దళిత బంధు పై ప్రజల్లో అవగాహ పెంపొందించడానికి ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. ఇందులో భాగంగా పాటల ద్వారా ప్రజలకు అవగాహన కల్పిస్తారు. ఇప్పటికే ఎమ్మెల్యే రసమయి బాలకిషన్ కు మరోసారి సాంస్క్కృతిక చైర్మన్ పదవిని ఇచ్చిన విషయం తెలిసిందే. ఆయన ఆధ్వర్యంలో కొన్ని పాటలను దళిత బంధు కోసం చిత్రీకరించి వాటిని రిలీజ్ చేయనున్నారు. ఇందుకోసం ఇప్పటికే రాసిన కొన్ని పాటలను స్వయంగా కేసీఆర్ పరిశీలించారు. వాటిలో కొన్ని మార్పులు కూడా చేశారు. రసమయితో పాటు దేశపతి శ్రీనివాస్, గోరటి వెంకన్న తదితరులు ఈ కార్యక్రమంలో పాలు పంచుకోనునన్నారు. వీరంతా దళిత బంధుపై అవగాహన కల్పించేలా పాటలతో పాటు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించునున్నారు.తెలంగాణ ఉద్యమంలో పాటల ద్వారా చాలామంది ప్రజల్లో అవగాహన కలిగింది. దీంతో ఇప్పుడు మరోసారి సాంస్కృతిక కార్యక్రమాలను ఈ పథకానికి వినియోగించుకోనున్నారు.