Begin typing your search above and press return to search.

`ద‌ళిత బంధు` టీఆర్ ఎస్‌లో జోష్ పెంచేనా?

By:  Tupaki Desk   |   5 Aug 2021 8:38 AM GMT
`ద‌ళిత బంధు` టీఆర్ ఎస్‌లో జోష్ పెంచేనా?
X
తెలంగాణ ప్ర‌భుత్వం ప్ర‌తిష్టాత్మ‌కంగా భావిస్తున్న `ద‌ళిత బంధు` ప‌థ‌కం.. అధికార పార్టీ టీఆర్ ఎస్‌కు, ముఖ్య‌మంత్రి కేసీఆర్‌కు జోష్ పెంచుతుందా? అంతర్గ‌త స‌ర్వేలు నిర్వ‌హించిన కేసీఆర్‌కు ఎలాంటి సంకేతాలు అందాయి? ఇవీ ఇప్పుడు తెలంగాణ వ్యాప్తంగా రాజ‌కీయ నేత‌ల‌ను, మేధావుల‌ను తొలుస్తున్న ప్ర‌శ్న‌లు. వాస్త‌వానికి ఈ ప‌థ‌కం ప్రారంభంతో అనేక స‌మ‌స్య‌లు తెర‌మీదికి వ‌స్తాయ‌ని.. వాటిని ప‌రిష్క‌రించ‌డం.. మ‌రిన్ని స‌మ‌స్య‌ల‌కు దారితీస్తుంద‌ని మేధావులు అభిప్రాయ‌ప‌డుతున్నారు.

ఇప్ప‌టి వ‌ర‌కు ఉన్న అంచ‌నాలు, స‌ర్వే ఫ‌లితాల‌ మేర‌కు ఈ ప‌థ‌కం ప్ర‌భావం బీసీల‌పై ఎక్కువ‌గా ప‌డుతుంద‌ని భావిస్తున్నారు. ప్ర‌స్తుతం ఉప ఎన్నిక‌కు సిద్ధ‌మ‌వుతున్న ఉమ్మ‌డి క‌రీం న‌గ‌ర్ జిల్లా హుజూరాబాద్ నియోజ‌క‌వ‌ర్గం బీసీల ఓటు బ్యాంకు 50శాతం ఉంది. ఈ క్ర‌మంలో త‌మ‌కు కూడా ల‌బ్ధి చేకూర్చేలా.. `బీసీ బంధు` ప‌థ‌కాన్ని వారు కోరుకునే అవ‌కాశం మెండుగా క‌నిపిస్తోంది. మ‌రీ ముఖ్యంగా బీసీల్లోని పేద కుటుంబాలు.. ఇలాంటి ప‌థ‌కాలు కావాల‌నే అభిప్రాయం వినిపిస్తోంది. ఈ విష‌యంలో వారు త‌మ వాద‌న‌ను కూడా బ‌హిర్గ‌తం చేస్తున్నారు.

తాజాగా నిర్వ‌హించిన స‌ర్వేలో 6311 మంది ద‌ళితులు, 11,325 మంది ద‌ళితేత‌రులు(ముఖ్యంగా బీసీ సామాజిక వ‌ర్గాలు) త‌మ అభిప్రాయాల‌ను కుండ‌బ‌ద్ద‌లు కొట్టి మ‌రీ చెప్పారు. ఈ క్ర‌మంలో బీసీలు.. త‌మ‌ను ప్ర‌భుత్వం విస్మ‌రించింద‌ని ఆవేద‌న వ్య‌క్తం చేయ‌డం గ‌మ‌నార్హం. రాష్ట్ర వ్యాప్తంగా నిర్వ‌హించిన ఈ స‌ర్వేలో బీసీలు.. తాము మ‌రింత వెనుక‌బ‌డిపోయే ప్ర‌మాదం ఉంద‌ని పేర్కొన‌డం విశేషం.

ఇక‌, ద‌ళిత బంధు ప‌థ‌కానికి సంబంధించి ద‌ళితులు వ్య‌క్తం చేసిన అభిప్రాయం.. మ‌రింత షాకిచ్చేలా ఉంది. ఈ ప‌థ‌కం అమ‌లై.. త‌మ అకౌంట్ల‌లోకి రూ.10 లక్ష‌ల చొప్పున ప‌డిన‌ప్పుడు తాము ఎవ‌రికి ఓటు వేయాలో నిర్ణ‌యించుకుంటామ‌ని చెప్ప‌డం గ‌మ‌నార్హం. ఇక‌, ఎక్కువ మంది ద‌ళితులైతే.. హుజూరాబాద్ ఉప పోరు ముగియ‌గానే ఈ ప‌థ‌కాన్ని కొండేక్కించేయ‌డం ఖాయ‌మ‌నే నిశ్చితాభిప్రాయంలో ఉండ‌డం గ‌మ‌నార్హం. ఈ స‌ర్వే ఫ‌లితాలు చూసిన త‌ర్వాత‌.. టీఆర్ ఎస్ మేధావులు ఆశ్చ‌ర్యం వ్య‌క్తం చేస్తున్నార‌ని స‌మాచారం. ద‌ళిత బంధు ప‌థ‌కం త‌మ‌పై ఎంతో ప్ర‌భావం చూపిస్తుంద‌ని.. పార్టీకి బూమ్ వ‌స్తుంద‌ని భావిస్తున్నారు.

ఎందుకంటే.. తాజాగా తాను ద‌త్త‌త తీసుకున్న వాసాల‌మ‌ర్రి గ్రామంలో ప‌ర్య‌టించిన సీఎం కేసీఆర్ ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ఇక్క‌డ కూడా అమ‌లు చేసేందుకు రెడీ అయ్యారు. దీంతో దీనిపై వ‌స్తున్న అపోహ‌లు తొలిగిపోవ‌డంతోపాటు.. ప్ర‌భుత్వంపైనా.. ముఖ్య‌మంత్రిపైనా విశ్వాసం పెరుగుతుంద‌ని.. టీఆర్ ఎస్ నాయ‌కులు చెబుతున్నారు. అంటే.. కేవ‌లం హుజూరాబాద్ ఎన్నిక కోస‌మే కాదు.. నిజంగానే మ‌న‌సు పెట్టి కేసీఆర్ ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేస్తున్నార‌ని.. ద‌ళితులు భావించే అవ‌కాశం మెండుగా ఉంద‌ని టీఆర్ ఎస్ నేత‌లు అనుకుంటున్నారు.

వాస్త‌వానికి వాసాల‌మ‌ర్రి చాలా చిన్న గ్రామం. ఇక్క‌డ ద‌ళితుల సంఖ్య కూడా చాలా త‌క్కువే. సో.. ఇక్క‌డ ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డం.. చాలా తేలిక‌నే అభిప్రాయాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. ఈ నేప‌థ్యంలోనే వాసాల‌మ‌ర్రిలో ఈ ప‌థ‌కాన్ని అమ‌లు చేయ‌డం ద్వారా హుజూరాబాద్ ప్ర‌జ‌ల్లో.. కాన్ఫిడెన్స్ పెంచేందుకు, త‌ద్వారా ఓట్లు రాబ‌ట్టుకోవ‌చ్చ‌ని స‌ర్కారు ప్లాన్ చేస్తోంది. ఈ నేప‌థ్యంలోనే ద‌ళిత బంధు ప‌థ‌కాన్ని ప్రారంభించే స్పాట్‌ను స‌ర్కారు వ్యూహాత్మ‌కంగా మార్చుకుంద‌ని అంటున్నారు ప‌రిశీల‌కులు. మ‌రి ఏం జ‌రుగుతుందో చూడాలి.