తెలంగాణ రాష్ట్రంలో దళితుల భ్యున్నతి కోసం కేసీఆర్ ప్రభుత్వం తీసుకొచ్చిన అద్భుతమైన పథకం దళిత బంధు పథకం. దళితుల జీవితాల్లో గుణాత్మకమార్పు తీసుకురావడానికి ముఖ్యమంత్రి కెసిఆర్ దళిత బంధు పథకానికి రూపకల్పన చేసి హుజురాబాద్ నుంచే ఆ పథకం అమలుకు శ్రీకారం చుట్టాలని నిర్ణయం తీసుకున్నారు. అందులో భాగంగా గురువారం దళిత బంధు కోసం మొదటి విడతలో రూ.500ల కోట్ల రూపాయలను ప్రభుత్వం విడుదల చేసింది. పైలెట్ ప్రాజెక్టు కింద హుజురాబాద్ లో అమలు చేసేందుకు రూ.500 కోట్ల బిఆర్ ఒ మంజూరు చేశారు.
ఇదిలా ఉంటె .. తెలంగాణ ప్రభుత్వానికి జాతీయ ఎస్సీ కమిషన్ నోటీసులు పంపింది. దళితులకు రూ.10 లక్షల నగదు సహాయం అందించే పథకానికి రాష్ట్ర ప్రభుత్వం ‘తెలంగాణ దళిత బంధు పథకం’ అని పేరు ఖరారు చేసిన సంగతి అందరికి తెలిసిందే. అయితే ఆ పేరు వద్దు దళిత పదం స్థానంలో 'అంబేడ్కర్' అని చేర్చాలంటూ ఎస్సీ కమిషన్ లో ఓ పిటిషన్ దాఖలైంది. ఆ పిటిషన్ ను స్వీకరించిన కమిషన్ 15 రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి నోటీసులు పంపింది.
ఇకపోతే , ఇప్పటికే దళిత బంధు పథకం అమలు కార్యాచరణపై సిఎం కెసిఆర్ అధ్యక్షతన ప్రగతిభవన్ లో అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సమావేశంలో దళిత బంధు పథకం లబ్ధిదారులకు కొత్తగా ‘దళిత బీమా’ పథకాన్ని కూడా తీసుకురావడానికి ప్రభుత్వం ఆలోచిస్తోందని సిఎం చెప్పారు. హుజూరాబాద్ నియోజకవర్గాన్ని పైలట్ ప్రాజెక్టుగా ఎంచుకొని ఇక్కడి నుంచే ఈ పథకం అమలును ప్రారంభించనున్నారు. నియోజవకర్గం లోని హుజూరాబాద్ మండలంలో 5,323 దళిత కుటుంబాలకు, కమలాపూర్ మండలంలోని 4,346 కుటుంబాలకు, వీణవంక మండలంలోని 3,678 కుటుంబాలకు, జమ్మికుంట మండలంలోని 4,996 కుటుంబాలకు, ఇల్లందకుంట మండలంలో 2,586 కుటుంబాలకు మొత్తం హుజూరాబాద్ నియోజకవర్గంలోని 20,929 మంది దళిత కుటుంబాల నుంచి లబ్ధిదారులను ఎంపిక చేస్తారు. నిబంధనల మేరకు ఎంపిక చేసిన లబ్ధిదారుల కుటుంబాలకు పరిపూర్ణ స్థాయిలో ఈ పథకాన్ని వర్తింపజేస్తారు.
వాసాలమర్రి గ్రామాన్ని కేసీఆర్ దత్తత తీసుకున్న విషయం తెలిసిందే. ఇటీవల వాసాలమర్రిలో గ్రామస్తులతో సహపంక్తి భోజనం కూడా చేశారు. తర్వాత గ్రామసభ నిర్వహించారు. మరో 20 సార్లు వాసాలమర్రికి వస్తానని హామీ ఇచ్చారు. అందులో భాగంగానే అయన బుధవారం అక్కడ పర్యటించారు. వాసాలమర్రిలోని 76 దళిత కుటుంబాలకు దళిత బంధు పథకాన్ని అమలు చేస్తున్నామని ప్రకటించారు. రేపటినుంచే దళితుల చేతుల్లో రూ. 10 లక్షల చొప్పున డబ్బులు ఉంటాయని స్పష్టం చేశారు. వాసాలమర్రి గ్రామానికి దళిత బంధు కోసం రూ. 7.60 కోట్లు తక్షణమే మంజూరు చేస్తున్నానని సీఎం కేసీఆర్ ప్రకటించారు. దళిత బంధు నిధులను ఒకే విడుతలో పంపిణీ చేస్తామని చెప్పారు.
హుజురాబాద్ ఉప ఎన్నిక నేపథ్యంలోనే దళిత బంధు పథకాన్ని కేసీఆర్ సర్కార్ తీసుకొచ్చింది. ఇదే విషయాన్ని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎన్నిక పూర్తయితే ఎవరూ పట్టించుకోరు అని అంటున్నారు. ఇదివరకటి పథకాలు.. దళితుడు సీఎం నినాదాలు ఏమయ్యాయని అడుగుతున్నారు. కానీ ప్రభుత్వం మాత్రం అదేం లేదని అంటోంది. తాము సంక్షేమ పథకానికి కట్టుబడి ఉన్నామని తెలిపింది. దళితులు.. బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే ముఖ్యం అని చెబుతోంది.