Begin typing your search above and press return to search.

దళతబంధు.. ఇలా చేశారేంటి కేసీఆర్?

By:  Tupaki Desk   |   21 Jan 2023 5:30 AM GMT
దళతబంధు.. ఇలా చేశారేంటి కేసీఆర్?
X
'దళితబంధు' అన్నంతనే రాజకీయాల మీద అవగాహన ఉన్న ప్రతి ఒక్కరూ దీని గురించి చెప్పేస్తారు. దళితులకు రూ.10 లక్షల ఆర్థిక సాయం అందించే ఈ పథకం దేశ రాజకీయాల్లో కొత్త శకం అంటూ తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ తరచూ చెబుతుంటారు. తాజాగా ముగిసిన ఖమ్మం బహిరంగ సభలోనూ దళితబంధు గురించి ఆయన చెప్పుకున్న గొప్పలు అన్ని ఇన్ని కావు.

అయితే.. ఈ కొత్త ఆర్థిక సంవత్సరం అంటే 2022 ఏప్రిల్ నుంచి ఇప్పటివరకు దళితబంధుకు సంబంధించిన ఎంపిక జరగకపోవటం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది. నోరు తెరిస్తే ఈ పథకం గురించి గొప్పలు చెప్పుకునే ముఖ్యమంత్రి.. దాని అమలు విషయంలోనూ అంతే ఆసక్తిని ఎందుకు ప్రదర్శించటం లేదన్నది ప్రశ్నగా మారింది.

ఈ పథకాన్ని 2021లో షురూ చేయటం తెలిసిందే. ప్రతిష్ఠాత్మక హుజూరాబాద్ ఉప ఎన్నికల నేపథ్యంలో దళిత బంధు ప్రకటించారని చెబుతారు. హుజూరాబాద్ లో అర్హులైన వారికి దాదాపు ఈ పథకం కింద లబ్థి చేకూర్చారని చెబుతారు. అదే ఏడాది ముఖ్యమంత్రి దత్తత గ్రామమైన వాసాలమర్రిలో 75 మందికి అందించారు.

ఆ తర్వాత రాష్ట్రంలో పలువురికి ఈ పథకం కింద నిధులను అందించారు. ఒక లెక్క ప్రకారం 2022 మార్చి 31 నాటికి తెలంగాణ రాష్ట్రంలోని 38 మంది వేల మందికి దళిత బంధు కింద నిధులను అందజేశారు. నిజానికి లక్ష్యం 40 వేల మంది అంటే.. అందులో 38 వేల మందిని ఎంపిక చేయటం అంటే.. ఈ పథకాన్ని చాలా బాగానే అమలు చేశారని చెప్పాలి.

ఇంతవరకు బాగానే ఉన్నా.. 2022 ఏప్రిల్ ఒకటో తేదీ నుంచి మొదలయ్యే ఆర్థిక సంవత్సరంలోనే లెక్క తేడా కొట్టేసింది. ఈ ఆర్థిక సంవత్సరం మరో రెండు నెలలు అంటే మార్చి 31 నాటికి ముగుస్తుంది. అంటే.. దగ్గర దగ్గర 10 నెలలు కొత్త ఆర్థిక సంవత్సరంలో ముగుస్తున్నా.. ఇప్పటివరకు ఒక్కరిని కూడా ఈ పథకం కింద నిధులు చెల్లించకపోవటం ప్రశ్నగా మారింది.

వర్తమాన బడ్జెట్ లో దళిత బంధు కింద రూ.17వేల కోట్లను ఆర్భాటంగా కేటాయింపులు చేసినట్లుగా ప్రకటించినప్పటికీ.. గడిచిన పది నెలల్లో ఒక్కరికి కూడా దళిత బంధు కింద నిధుల్ని ఎందుకు ఇవ్వనట్లు? అన్నది ఇప్పుడు ప్రశ్నగా మారింది. నియోజకవర్గానికి 1500 మంది చొప్పున ఎంపిక చేసి రాష్ట్ర వ్యాప్తంగా 2.82 లక్షల మందికి ఈ పథకానికి వర్తింపజేస్తామని ప్రకటించారు. కానీ.. దళిత బంధును ఈ ఏడాదికి ఒక్కరిని కూడా ఎంపిక చేయకపోవటంపై ఆగ్రహం వ్యక్తమవుతోంది.

గొప్పులు చెప్పుకోవటానికి దళితబంధు పథకాన్ని తరచూ ప్రస్తావించే ముఖ్యమంత్రి కేసీఆర్.. మరి ఆ పథకం అమలు విషయంలో మాత్రం ఇలా ఎందుకు ఉంటున్నారన్న ప్రశ్న తలెత్తుతోంది. ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరు విపక్షాలకు ఇప్పుడో ఆయుధంగా మారింది. పథకాన్ని ఆర్భాటంగా ప్రకటించి.. తొలి ఏడాది అమలు చేసి.. తర్వాత చప్పుడు చేయకుండా ఉండటం దేనికి నిదర్శనం? అన్న ప్రశ్న తలెత్తుతోంది.

తమ సర్కారుకు దళిత బంధు సానుకూల ఫలితాలు ఇస్తుందన్న ఆలోచనలో ఉన్న దానికి భిన్నంగా ప్రస్తుతం చోటు చేసుకున్న పరిణామాల నేపథ్యంలో ప్రతికూల ఫలితాలకు దారి తీస్తుందన్న భయాందోళనలో గులాబీ ఎమ్మెల్యేలు ఉన్న పరిస్థితి. ఎందుకిలా జరుగుతున్నట్లు కేసీఆర్?


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.