Begin typing your search above and press return to search.

డేల్ స్టెయిన్ రిటైర్మెంట్ ... అన్ని ఫార్మాట్లకి గుడ్ బై !

By:  Tupaki Desk   |   31 Aug 2021 11:24 AM GMT
డేల్ స్టెయిన్ రిటైర్మెంట్ ... అన్ని ఫార్మాట్లకి గుడ్ బై !
X
డేల్ స్టెయిన్ .. ప్రపంచ క్రికెట్ లో ఓ వరల్డ్ క్లాస్ బెస్ట్ ఫాస్ట్ బౌలర్. ప్రపంచ క్రికెట్ లో తనకంటూ ఓ ప్రత్యేకమైన గుర్తింపు దక్కించుకున్న ఈ స్టార్ బౌలర్ , తాజాగా క్రికెట్ కు వీడ్కోలు పలికాడు. ఎన్నో మధురస్మృతుల నడుమ, కొంత బాధ ఉన్నప్పటికీ, తనకెంతో ఇష్టమైన క్రికెట్ ఆట నుంచి అధికారికంగా వైదొలగుతున్నానని స్టెయిన్ ఓ ప్రకటనలో వెల్లడించాడు. 20 ఏళ్ల కెరీర్ నేటితో ముగిసిందని తెలిపాడు.

ఇన్నేళ్ల కాలంలో శిక్షణ, మ్యాచ్ లు, ప్రయాణాలు, అలసట, విజయాలు, పరాజయాలు, ఆనందాలు, సోదర ప్రేమ ఇలాంటివి ఎన్నో జ్ఞాపకాలు ఉన్నాయని, ఎంతోమందికి కృతజ్ఞతలు చెప్పాలని స్టెయిన్ పేర్కొన్నాడు. ఈ సందర్భంగా స్టెయిన్ తనకిష్టమైన మ్యూజిక్ బ్యాండ్ కౌంటింగ్ క్రోస్ హిట్ సాంగ్ లాంగ్ డిసెంబర్ పాటలోని కొన్ని పంక్తుల గురించి తెలిపాడు. ఈ అద్భుత క్రికెట్ ప్రస్థానంలో తోడ్పాటు అందించిన కుటుంబ సభ్యులకు, జట్టు సహచరులకు, పాత్రికేయులకు, అభిమానులకు... ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు తెలుపుకుంటున్నట్టు పేర్కొన్నాడు.

టెస్టు గ్రేటెస్ట్ ఫాస్ట్ బౌలర్లలో ఒకడిగా గుర్తింపు పొందిన డేల్ స్టెయిన్, తన కెరీర్‌లో 93 టెస్టులు ఆడి 439 వికెట్లు పడగొట్టాడు. ఇందులో 26 సార్లు ఇన్నింగ్స్‌లో ఐదేసి వికెట్లు, ఐదు సార్లు మ్యాచ్‌ లో పది వికెట్లు పడగొట్టాడు. 125 వన్డేలు ఆడిన డేల్ స్టెయిన్, 196 వికెట్లు పడగొట్టాడు. 47 టీ20 మ్యాచుల్లో 64 వికెట్లు తీశాడు. మొత్తంగా అంతర్జాతీయ కెరీర్‌లో 699 వికెట్లు తీసిన డేల్ స్టెయిన్, 700 వికెట్ల క్లబ్‌లో చేరడానికి ఒక్క వికెట్ దూరంలో క్రికెట్‌కి వీడ్కోలు పలికాడు.

ఐపీఎల్ 2008లో ఆర్‌సీబీ తరుపున ఆడిన డేల్ స్టెయిన్, మొదటి మూడు సీజన్లు రాయల్ ఛాలెంజర్స్‌కే ఆడాడు. ఆ తర్వాత డెక్కన్ ఛార్జర్స్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్‌ జట్లకి ఆడాడు.ఒకప్పుడు వరల్డ్ నెంబర్ వన్ బౌలర్ గా కొనసాగిన స్టెయిన్ కాలక్రమంలో గాయాలబారినపడ్డాడు. పలు సర్జరీల అనంతరం ఆటలో మళ్లీ అడుగుపెట్టినా, మునుపటి వాడి లోపించింది. దానికితోడు గాయాలు తిరగబెట్టడం కూడా స్టెయిన్ ప్రతిష్ఠను మసకబార్చింది.

2005లో క్రికెట్ ఎంట్రీ ఇచ్చిన డేల్ స్టెయిన్ 2008లో ఆరో ర్యాంకుకి, 2009లో రెండో ర్యాంకుకి చేరాడు. 2010 నుంచి 2013 వరకూ టాప్ ర్యాంకులో కొనసాగిన డేల్ స్టెయిన్, 2014లో రెండో ర్యాంకుకి పడిపోయినా, 2015లో తిరిగి టాప్‌ లోకి దూసుకొచ్చాడు. 2343 రోజుల పాటు ఐసీసీ టెస్టు బౌలర్ల ర్యాంకింగ్స్‌ లో టాప్‌లో నిలిచిన డేల్ స్టెయిన్, నిర్విరామంగా అత్యధిక రోజులు నెం.1 బౌలర్‌ గా నిలిచిన ప్లేయర్‌గా రికార్డు క్రియేట్ చేశాడు. ఐపీఎల్‌లో పాటు పాక్ సూపర్ లీగ్, కరేబియర్ ప్రీమియర్ లీగ్, బిగ్‌బాష్ లీగ్ వంటి ఎన్నో విదేశీ లీగుల్లో పాల్గొన్న డేల్ స్టెయిన్ రిటైర్మెంట్‌తో ఓ శకం ముగిసినట్టైంది.