Begin typing your search above and press return to search.

భార‌త్ విభ‌జ‌న‌కు నెహ్రూనే కార‌ణం:ద‌లైలామా

By:  Tupaki Desk   |   8 Aug 2018 12:19 PM GMT
భార‌త్ విభ‌జ‌న‌కు నెహ్రూనే కార‌ణం:ద‌లైలామా
X
భారత స్వాతంత్య్ర పోరాటంలో గాంధీ - నెహ్రూలతో మ‌రెంద‌రో మ‌హనీయులు అహ‌ర్నిశ‌లు పాటుబ‌డి....అనేక క‌ష్ట‌న‌ష్టాలు అనుభ‌వించారు. అకుంఠిత దీక్ష‌తో...ఎన్నోపోరాటాలు చేసి బ్రిటిషు వారిని త‌రిమికొట్టారు. అయితే, గాంధీ - నెహ్రూల‌తో సమానంగా స్వాతంత్ర్యం కోసం మొహమ్మద్‌ అలీ జిన్నా కృషి చేశారని సమాజ్‌వాదీ పార్టీ ఎంపీ ప్రవీణ్‌ నిషాద్‌ వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగ‌తి తెలిసిందే. అంతేకాకుండా, జిన్నా పేరిట బీజేపీ దిగజారుడు రాజకీయాలకు పాల్పడుతోందని షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆ వ్యాఖ్య‌ల‌పై చెల‌రేగిన దుమారం స‌ద్దుమ‌ణిగేలోపు జిన్నాపై బౌద్ధ గురువు ద‌లైలామా సంచ‌ల‌న వ్యాఖ్య‌లు చేశారు. ఆనాడు జిన్నాను భార‌త ప్రధాని చేసి ఉంటే భార‌త విభ‌జ‌న జరిగి ఉండేది కాద‌ని ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. ఆ నిర్ణ‌యం తీసుకొని ఉంటే అవిభాజ్య భార‌త్ ముక్కలయ్యేది కాదని అభిప్రాయ‌ప‌డ్డారు.

గోవా ఇన్‌ స్టిట్యూట్‌ ఆఫ్‌ మేనేజ్‌ మెంట్ లో జరిగిన ఓ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజ‌రైన దలైలామా ఈ వ్యాఖ్య‌లు చేశారు. విద్యార్థుల‌నుద్దేశించి ప్ర‌సంగించిన ద‌లైలామా నెహ్రూపై కూడా ఆస‌క్తిక‌ర వ్యాఖ్య‌లు చేశారు. జీవితంలో ప్ర‌తి ఒక్క‌రూ ఏదో ఒక స‌మ‌యంలో త‌ప్పు చేస్తారని..., భారత మాజీ ప్రధాని జవహర్‌ లాల్‌ వంటి గొప్ప వ్యక్తులు అందుకు అతీతం కాద‌ని ద‌లైలామా అన్నారు. .జిన్నాను ప్రధానిని చేయాలని గాంధీ భావించార‌ని - అందుకు నెహ్రూ ఒప్పుకోలేద‌ని చెప్పారు. తాను ప్రధాని కావాల్సిందేనంటూ నెహ్రూ పట్టుబట్టార‌ని, ఒకవేళ నెహ్రూ ఆ తప్పు చేయకపోయి ఉంటే జిన్నా ప్రధాని అయి అవిభాజ్య భారత్ విడిపోయేది కాద‌ని అన్నారు. అయినా, జీవితంలో తప్పులు జరగడం సహజ‌మ‌ని, ప్ర‌తి ఒక్క‌రూ కొన్ని ప‌రిస్థితుల వ‌ల్ల‌....కార‌ణాల వ‌ల్ల త‌ప్పులు చేస్తుంటార‌ని దలైలామా అభిప్రాయ‌ప‌డ్డారు.