Begin typing your search above and press return to search.

నిన్న‌టి వ‌ర‌కు కూలీకి.. రేప‌ట్నుంచి అసెంబ్లీకి!

By:  Tupaki Desk   |   3 May 2021 12:30 PM GMT
నిన్న‌టి వ‌ర‌కు కూలీకి.. రేప‌ట్నుంచి అసెంబ్లీకి!
X
ప‌శ్చిమ‌బెంగాల్ లో అరుదైన గెలుపు చోటు చేసుకుంది. ఆ గెలుపుతో ఓ రోజూ కూలీ ఏకంగా ఎమ్మెల్యే అయిపోయారు. అద్వితీయ‌మైన ఈ విజ‌యంప‌ట్ల ప‌లువురు ప్ర‌ముఖులు ప్ర‌శంస‌లు కురిపిస్తున్నారు. సోష‌ల్ మీడియాలో ఈ గెలుపు వైర‌ల్ అవుతోంది. ఈ గెలుపు సాధించింది ఓ మ‌హిళ. ఆమె పేరు చంద‌నా బౌరి.

బెంగాల్ లోని స‌ల్తోరా నియోజ‌క‌వ‌ర్గంలో బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగారు చంద‌నా. ఎలాంటి అంచ‌నాలు లేకుండా ముందుకు సాగిన ఆమె.. త‌న స‌మీప తృణ‌మూల్ అభ్య‌ర్థి సంతోష్ కుమార్ మండ‌ల్ పై 4 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజ‌యం సాధించారు. ఈ గెలుపు దేశ‌వ్యాప్తంగా అంద‌రి దృష్టినీ ఆక‌ర్షించింది. ఇది సామాన్య మ‌హిళ గెలుపు అంటూ సోష‌ల్ మీడియాలో ట్వీట్లు చేస్తున్నారు.

చంద‌న రోజూ కూలీ. ఆమె భ‌ర్త కూడా కూలీనే. ఎన్నిక‌ల అఫిడ‌విట్లో ఆమె పేర్కొన్న ఆస్తుల వివ‌రాలు 65 వేలు కూడా దాట‌లేదు. త‌న‌కు ఒక గుడిసె, మూడు మేక‌లు, మూడు ఆవులు ఉన్న‌ట్టు పేర్కొన్నారు చంద‌నా. ఇక న‌గ‌దు విష‌యానికి వ‌స్తే.. త‌న పేరిట 31,985 రూపాయ‌లు, భ‌ర్త పేరుమీద 30,311 ఉన్న‌ట్టు చూపించారు.

త‌న గెలుపు ప‌ట్ల చంద‌న చాలా ఆనందంగా ఉన్నారు. తాను ఎన్నిక‌ల్లో పోటీచేస్తాన‌నే అనుకోలేద‌ని, అనూహ్యంగా టికెట్ రావ‌డం.. గెల‌వ‌డం అంతా క‌ల‌మాదిరిగా ఉంద‌ని చెప్పారు. ఇక్క‌డ గ‌డిచిన రెండు ఎన్నిక‌ల్లో టీఎంసీ ఘ‌న విజ‌యం సాధించ‌డం గ‌మ‌నార్హం.