Begin typing your search above and press return to search.

టీడీపీని ఖాళీ చేసే పనిలో ఉన్న ఒకే ఒక్కడు

By:  Tupaki Desk   |   16 Feb 2019 4:58 PM GMT
టీడీపీని ఖాళీ చేసే పనిలో ఉన్న ఒకే ఒక్కడు
X
బలహీనపడినట్లుగా నటించి శత్రువును అజాగ్రత్తలో పడేసి దెబ్బతీయడం యుద్ధకళలో ఒక కీలక ఎత్తుగడ. ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఓ సీనియర్ లీడర్ తన ఇంటి శత్రువుపై పగ తీర్చుకోవడానికి అదే వ్యూహం అమలు చేసి సక్సెస్ దారిలో నడుస్తున్నారు. ఆయన ఇంకెవరో కాదు... టీడీపీ అధినేత - ఏపీ సీఎం చంద్రబాబు నాయుడి తోడల్లుడు దగ్గుబాటి వెంకటేశ్వరరావేనట. మామ.. ఎన్టీఆర్ వద్ద ఉంటూ కలసిమెలసి రాజకీయాలు చేసిన చంద్రబాబు - దగ్గుబాటి వెంకటేశ్వరరావుల్లో చంద్రబాబు ఏకంగా సీఎం కాగా.. వెంకటేశ్వరరావు క్రమక్రమంగా తెర ముందు రాజకీయాలు దూరమయ్యారు.

వెంకటేశ్వరరావు తెరముందు రాజకీయాలకు దూరమైనా ఆయన సతీమణి - ఎన్టీఆర్ కుమార్తె పురంధేశ్వరి మాత్రం కాంగ్రెస్ ప్రభుత్వంలో కేంద్రమంత్రయ్యారు. ఇప్పుడు బీజేపీలోనూ కీలక పదవిలో ఉన్నారు. కానీ - గత ఎన్నికల్లో మాత్రం ఆమెకు ఓటమి తప్పకపోవడంతో చట్టసభల్లో లేరు. పైగా రాజకీయంగా చంద్రబాబు వ్యతిరేక పార్టీల్లోనే ఉంటుండడంతో రాజకీయ శత్రుత్వం ఆ రెండు కుటుంబాల మధ్య తీవ్రస్థాయిలో ఉంది.

ఇలాంటి వేళ దగ్గుబాటి వెంకటేశ్వరరావు - పురంధేశ్వరిల కుమారుడు హితేశ్ చెంచురామయ్య రాజకీయ ప్రవేశానికి వారు వైసీపీని ఎంచుకున్న సంగతి తెలిసిందే. రానున్న అసెంబ్లీ ఎన్నికల్లో హితేశ్ వైసీపీ నుంచి అసెంబ్లీకి పోటీ చేయడం ఖాయంగా కనిపిస్తోంది. పురంధేశ్వరి బీజేపీలోనే కొనసాగినా హితేశ్ మాత్రం వైసీపీలో ఉంటున్నారు. హితేశ్‌ కు అండగా ఇప్పుడు తండ్రి వెంకటేశ్వరరావు మొత్తం రాజకీయమంతా చక్కబెడుతున్నారట. అందులో భాగంగానే ఆయన వైసీపీ బలోపేతానికి తన రాజకీయ అనుభవాన్నంతా ఉపయోస్తున్నట్లు తెలుస్తోంది. మొన్న ఆమంచి - వైసీపీ మధ్య డీల్ కుదిర్చింది కూడా దగ్గుబాటేనట. ఇప్పుడు మరో ఇద్దరు ఎమ్మెల్యేలను కూడా వైసీపీలోకి పంపించేందుకు ఆయన అన్ని ఏర్పాట్లూ చేసినట్లు చెబుతున్నారు.