Begin typing your search above and press return to search.

ద‌గ్గుబాటి వార‌సుడు!..ప‌ర్చూరు నుంచి బ‌రిలోకి!

By:  Tupaki Desk   |   14 Feb 2018 8:33 AM GMT
ద‌గ్గుబాటి వార‌సుడు!..ప‌ర్చూరు నుంచి బ‌రిలోకి!
X
తెలుగు నేల రాజ‌కీయాల్లో ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు ఫ్యామిలీకి ఓ ప్ర‌త్యేక గుర్తింపు ఉన్న విష‌యం తెలిసిందే. టీడీపీ వ్య‌వ‌స్థాప‌కుడు ఎన్టీఆర్ అల్లుడిగా ద‌గ్గుబాటి.. కీల‌క రాజ‌కీయ‌వేత్త‌గానే ఎదిగారు. ఎన్టీఆర్ బ‌తికున్నంత కాలం ద‌గ్గుబాటి... త‌న స‌తీమ‌ణి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిని రాజ‌కీయాల్లోకి తీసుకురాలేదు. తాను మాత్ర‌మే రాజ‌కీయాల్లో కొన‌సాగిన ద‌గ్గుబాటి... త‌న సొంత జిల్లా ప్ర‌కాశంలోనే కాకుండా రాష్ట్ర స్థాయిలో ఓ స్థాయి క‌లిగిన నేత‌గా ఎదిగార‌నే చెప్పాలి. ఎన్టీఆర్ చేతిలోని అధికారంతో పాటు పార్టీని కూడా ఆయ‌న మ‌రో అల్లుడు, ప్ర‌స్తుత పార్టీ అధ్య‌క్షుడు నారా చంద్ర‌బాబునాయుడు లాగేసుకున్న స‌మ‌యంలో... చంద్ర‌బాబు ప‌క్షానే నిలిచిన ద‌గ్గుబాటికి ఆ త‌ద‌నంత‌ర కాలంలో పెద్ద‌గా ప్రాధాన్యం ద‌క్క‌లేద‌నే చెప్పాలి. ఈ క్ర‌మంలో అప్ప‌టిదాకా ఓ మేర ఎదిగిన ద‌గ్గుబాటి... త‌ర్వాతి కాలంలో కేవ‌లం ప్ర‌కాశం జిల్లాకు చెందిన నేత‌గానే కొన‌సాగాల్సి వ‌చ్చింద‌న్న వాద‌న కూడా లేక‌పోలేదు. ఇక 2004లో కాంగ్రెస్ పార్టీలో చేరిన ద‌గ్గుబాటి... త‌న‌తో పాటు త‌న స‌తీమ‌ణి ద‌గ్గుబాటి పురందేశ్వ‌రిని కూడా రాజ‌కీయాల్లోకి దించేశారు. పురందేశ్వ‌రి ఎంపీగా, వెంక‌టేశ్వ‌ర‌రావు ఎమ్మెల్యేగా త‌మ‌దైన శైలిలో స‌త్తా చాటారు.

ద‌గ్గుబాటి అంచ‌నాల‌ను మించేసిన పురందేశ్వరి త‌న‌దైన మాట తీరుతో యూపీఏ స‌ర్కారులో ఏకంగా కేంద్ర మంత్రి ప‌ద‌వి ద‌క్కించుకున్నారు. ఎంపీగానే కాకుండా కేంద్ర మంత్రిగా స‌త్తా చాటిన పురందేశ్వ‌రి తొలుత బాప‌ట్ల‌ - ఆ త‌ర్వాత విశాఖ‌ప‌ట్నం లోక్ స‌భ నియోజక‌వ‌ర్గాల నుంచి ఎంపీగా గెలుపొందారు. మొన్న‌టి ఎన్నిక‌ల‌కు ముందు జ‌రిగిన తెలుగు నేల విభ‌జ‌న‌ను వ్య‌తిరేకించిన పురందేశ్వ‌రి కాంగ్రెస్ పార్టీకి రాజీనామా చేసి భార‌తీయ జ‌న‌తా పార్టీలో చేరిపోయారు. టీడీపీతో బీజేపీ పొత్తు కార‌ణంగా పురందేశ్వ‌రి క‌డ‌ప జిల్లా రాజంపేట లోక్ స‌భ నియోజ‌క‌వ‌ర్గం నుంచి బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగి ఓట‌మిపాల‌య్యారు. అయినా కూడా పురందేశ్వ‌రి స‌త్తాను గుర్తించి బీజేపీ అధిష్ఠానం ఆమెకు పార్టీ మ‌హిళా విభాగం మ‌హిళా మోర్చా అధ్య‌క్షురాలిగా నియ‌మించింది. అయినా ఇప్పుడు ద‌గ్గుబాటి వెంక‌టేశ్వ‌ర‌రావు - పురందేశ్వ‌రిలకు సంబందించి ఇంత పురాణం అవ‌స‌రమా? అంటే.. అవ‌స‌ర‌మేన‌ని చెప్పాలి. ఎందుకంటే వ‌చ్చే ఎన్నిక‌ల్లో ద‌గ్గుబాటి దంప‌తుల వార‌సుడు రాజ‌కీయ తెరంగేట్రం చేయ‌నున్నారు. ద‌గ్గుబాటి దంప‌తుల పుత్ర ర‌త్నం చెంచురాము... ఎప్పుడు రాజ‌కీయాల్లోకి వ‌స్తారా అంటూ చాలా కాలం నుంచే విశ్లేష‌ణ‌లు సాగుతున్నాయి. అయితే స‌మ‌యం రానే వ‌చ్చిందంటూ ఇప్పుడు ఆస‌క్తిక‌ర క‌థ‌నాలు వినిపిస్తున్నాయి.

వ‌చ్చే ఎన్నిక‌ల్లో రాజ‌కీయా తెరంగేట్రం చేయ‌నున్న చెంచురాము... త‌న తండ్రి వెంక‌టేశ్వ‌ర‌రావు చాలా సార్లు ఎమ్మెల్యేగా ప్రాతినిథ్యం వ‌హించిన ప‌ర్చూరు నియోజ‌క‌వ‌ర్గం నుంచే బ‌రిలోకి దిగుతార‌ట‌. కొత్త‌గా రాజ‌కీయాల్లోకి వ‌స్తున్న చెంచురాముకు ఆదిలోనే ఇబ్బందులు ఎదురుకాకూడ‌ద‌న్న భావ‌న‌తో... త‌మ ఫ్యామిలీకి మంచి ప‌ట్టున్న ప‌ర్చూరు నుంచే ఆయ‌న‌ను బ‌రిలోకి దించేందుకు ద‌గ్గుబాటి దంప‌తులు దాదాపుగా నిర్ణ‌యం తీసుకున్నార‌ట‌. టీడీపీలో ఉన్న‌ప్పుడే కాకుండా కాంగ్రెస్‌లో చేరిన స‌మ‌యంలోనూ వెంక‌టేశ్వ‌ర‌రావు ప‌ర్చూరు నుంచే చాలా సార్లు గెలిచారు. పార్టీల‌తో ఏమాత్రం సంబంధం లేకుండానే ప‌ర్చూరులో ద‌గ్గుబాటి ఫ్యామిలీకి మంచి ప‌ట్టుంద‌ని చెప్ప‌క త‌ప్ప‌దు. ఈ కార‌ణంగానే చెంచురామును నేరుగా అసెంబ్లీకి పంపేందుకు మార్గం సిద్ధం చేసిన ద‌గ్గుబాటి క‌పుల్‌... అత‌డిని ప‌ర్చూరు అసెంబ్లీ నుంచే బ‌రిలోకి దింపుతార‌ట‌. ప్ర‌స్తుతం పురందేశ్వ‌రి బీజేపీలో ఉన్న నేప‌థ్యంలో చెంచురాము కూడా బీజేపీ అభ్య‌ర్థిగానే బ‌రిలోకి దిగుతార‌ట‌.

ఈ నేప‌థ్యంలో ప్ర‌స్తుతం అక్క‌డ సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న టీడీపీ నేత సాంబ‌శివ‌రావుకు వ‌చ్చే ఎన్నిక‌ల్లో ఇబ్బందికర‌మైన ప‌రిస్థితులు త‌ప్ప‌వ‌న్న వాద‌న వినిపిస్తోంది. ప్ర‌స్తుతం టీడీపీ - బీజేపీల మ‌ధ్య పొత్తు ఉన్నా... వ‌చ్చే ఎన్నికల్లో ఈ పొత్తు కొన‌సాగుతుందా? లేదా? అన్న అనుమానాలు వ్య‌క్త‌మ‌వుతున్నాయి. పొత్తు ఉన్నా కూడా ఈ స్థానాన్ని త‌న‌కు ఇచ్చే విధంగా పురందేశ్వ‌రి బీజేపీ అధిష్ఠానం నుంచి ఇప్ప‌టికే హామీ తీసుకున్నార‌ట‌. పొత్తు లేకున్నా... బీజేపీ అభ్య‌ర్థిగా బ‌రిలోకి దిగనున్న చెంచురాము... త‌మ ఫ్యామిలీకి ఉన్న ప‌ట్టు ఆధారంగా ఈజీగానే గెలిచే అవ‌కాశాలే ఉన్నాయ‌న్న వాద‌న వినిపిస్తోంది. అంటే.. బీజేపీతో పొత్తు కొన‌సాగినా... లేకున్నా... ప్ర‌కాశం జిల్లాలో ప‌ర్చూరును టీడీపీ వ‌దులుకోవాల్సిందేనన్న మాట‌.