Begin typing your search above and press return to search.

సీఎం జగన్ తో సినీ పెద్దల భేటీ...ఎందుకంటే

By:  Tupaki Desk   |   26 Feb 2020 2:50 PM GMT
సీఎం జగన్ తో సినీ పెద్దల భేటీ...ఎందుకంటే
X
తాడేపల్లిలోని సీఎం నివాసంలో సీఎం జగన్ తో టాలీవుడ్ సినీ ప్రముఖులు బుధవారం భేటీ అయ్యారు. టాలీవుడ్ నిర్మాతలు దగ్గుబాటి సురేశ్, శ్యాంప్రసాద్ రెడ్డి, నల్లమలపు బుజ్జి తదితరులు ఏపీ సీఎం జగన్ ను కలిశారు. గతంలో విశాఖను అతలాకుతలం చేసిన హుద్ హుద్ తుపాను బాధితుల కోసం కట్టిన ఇళ్లను ప్రారంభించాల్సిందిగా సీఎం జగన్ ను వారు కోరారు. తుపాను తర్వాత భారీగా విరాళాలు సేకరించి, దాదాపు రూ.15 కోట్లతో బాధితులకు ఇళ్లు నిర్మించామని సీఎంకు వారు తెలిపారు. ఆ ఇళ్ల నిర్మాణ ప్రాజెక్టు పూర్తయిందని, వాటి ప్రారంభోత్సవ కార్యక్రమానికి రావాలంటూ సీఎంను ఆహ్వానించారు. సీఎం చేతుల మీదుగా బాధితులకు ఇళ్ల పట్టాలు అందజేయాలని సినీ ప్రముఖులు కోరారు.

తాము చేసిన విజ్ఞప్తికి సీఎం జగన్ సానుకూలంగా స్పందించారని నిర్మాత సురేష్ బాబు తెలిపారు. హుద్ హుద్ టైంలో కలెక్ట్ చేసిన ఫండ్స్ తో విశాఖలోని బక్కినపాలెంలో ఉన్న మధురవాడ దగ్గర 320 సింగిల్ బెడ్ రూం ప్లాట్లు నిర్మించామని చెప్పారు. మంచి క్వాలిటీతో వాటిని నిర్మించామని, ఆ ప్రాజెక్టు పూర్తి అయిందని సీఎంకు వివరించామన్నారు. తమ ప్రతిపాదనకు సీఎం సానుకూలంగా స్పందించారని, తన తదుపరి వైజాగ్ పర్యటనలో ఆ ప్రారంభోత్సవాన్ని ప్లాన్ చేయాలని సూచించినట్లు సురేష్ బాబు తెలిపారు. గ్రాండ్ గా ఆ ఓపెనింగ్ ప్రోగ్రాం నిర్వహిస్తామని, పలువురు సినీ ప్రముఖులు ఆ కార్యక్రమానికి హాజరవుతారని చెప్పారు.

హుద్ హుద్ తుపాను తర్వాత రెండు రోజుల పాటు సినీ ఇండస్ట్రీలోని కార్యక్రమాలు ఆపివేశామని, ఆ రెండు రోజుల పాటు టెలీథాన్ పేరుతో ప్రోగ్రామ్ నిర్వహించామని శ్యామ్ ప్రసాద్ రెడ్డి తెలిపారు. ఆ రెండు రోజులు ఉదయం ఆరు గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఇండస్ట్రీలోని ప్రతి ఒక్కరు ఆ షోలో పాల్గొన్నారని, కొంతమంది బయటివారు పాల్గొన్నారని అన్నారు. ఆ రెండురోజుల షో వల్ల 15 కోట్లు కలెక్ట్ చేశామని,కమర్షియల్ ప్లాట్ ల తరహాలో సింగిల్ బెడ్ రూం ప్లాట్లు నిర్మించామని, వాటిని బాధితులకు అందజేయాల్సిందిగా సీఎం జగన్ ను కోరామని అన్నారు. తాము కట్టిన ప్లాట్లు చూసి కార్పొరేట్ కంపెనీలు కూడా ప్రశంసించాయని అన్నారు.