Begin typing your search above and press return to search.

రహస్య ఎజెండాలేంటో చెప్పొచ్చుగా దాడి?

By:  Tupaki Desk   |   8 May 2016 4:42 AM GMT
రహస్య ఎజెండాలేంటో చెప్పొచ్చుగా దాడి?
X
ఏపీకి ప్రత్యేక హోదా విషయంలో బీజేపీ వైఖరి ఏమిటన్నది తెలిసిందే. ఎన్నికల సమయంలో మెజార్టీ మీదున్న సంశయంతో ఏపీకి ప్రత్యేక హోదా అంశాన్ని పదే పదే ప్రస్తావించటమే కాదు..తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ అంశంపై దృష్టి సారించి ఏపీని ఆదుకుంటామని చెప్పారు. ఎన్నికల్లో బంపర్ మెజార్టీ రావటంతో ప్రత్యేకహోదా అంశాన్ని పక్కన పడేసి తమదైన రీతిలో వ్యవహరిస్తున్న కమలనాథుల వైఖరిని చూసిన తర్వాత కాంగ్రెస్ కు.. బీజేపీకి మధ్య పెద్ద తేడా లేదన్న విషయం సీమాంధ్రులకు బాగానే అర్థమవుతోంది. ఇదిలా ఉంటే.. ప్రత్యేక హోదా మీద తాజాగా గొంతు విప్పిన మాజీ మంత్రి దాడి వీరభద్రరావు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రత్యేక హోదా మీద ప్రతి రాజకీయ పార్టీకి రహస్య ఎజెండాలు ఉన్నట్లుగా ఆయన ఆరోపిస్తున్నారు.

ప్రత్యేక హోదా ఇవ్వటం బీజేపీకి ఇష్టం లేదని చెబుతున్న ఆయన.. తొలి నుంచి ప్రత్యేక హోదా ఇవ్వం.. ప్యాకేజీ ఇస్తామన్న మాటను కమలనాథులు చెబుతున్నారన్న విషయాన్ని మర్చిపోకూడదని చెప్పుకొచ్చారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలన్న ఆలోచన బీజేపీకి లేదని.. ఒకవేళ ఇవ్వాలన్న ఆలోచన ఉండి ఉంటే బిల్లును ప్రవేశ పెట్టి ఆమోదించటం పెద్ద విషయమేమీ కాదని పేర్కొన్నారు. హోదా ఇవ్వాలన్న ఆలోచన లేని బీజేపీ.. నీతిఆయోగ్ అంటూ సాకులు చెప్పి కాలం గడిపేసిందంటూ మండిపడ్డారు.

ఏపీకి ప్రత్యేక హోదాను అమలు చేయని పక్షంలో రాజకీయ పార్టీల మీద ప్రజలకు పూర్తిగా నమ్మకం పోవటం ఖాయమని చెబుతున్నారు. ఎందుకంటే.. దేశ ప్రధాని స్వయంగా పార్లమెంటులో హామీ ఇచ్చింది కూడా నెరవేర్చని పక్షంలో రాజకీయ పార్టీల మీద ప్రజలకు నమ్మకం ఎలా వస్తుందన్న దాడి.. ఏపీకి ప్రత్యేక హోదా అంశంపై ప్రతి పార్టీకి రహస్య ఎజెండాలు ఉన్నాయన్నారు. రహస్యఎజెండాలు ఉన్నట్లుగా చెబుతున్న దాడి.. ఆ గుట్టు ఏంటో బయటపెడితే సరిపోయేది కదా? సందేహాలు వ్యక్తం చేయటం.. విమర్శలు సంధించటం కంటే వాటి గుట్టుమట్లను బయటపెట్టి.. తన వాదనకు తగ్గ ఆధారాల్ని చూపించటం ద్వారా ప్రజల్ని మరింత చైతన్యం చేయొచ్చుగా? అవేమీ చేయకుండా ఉత్తినే మాటలు చెబితే సరిపోతుందా దాడి?