Begin typing your search above and press return to search.

డీఎస్ కుమారుడిని బీజేపీ భ‌లే గౌర‌వించేస్తోందే

By:  Tupaki Desk   |   3 Oct 2017 11:01 AM GMT
డీఎస్ కుమారుడిని బీజేపీ భ‌లే గౌర‌వించేస్తోందే
X
తెలంగాణ రాష్ట్రంలో బ‌ల‌ప‌డ‌ట‌మే ల‌క్ష్యంగా ముందుకు సాగుతున్న బీజేపీ త‌న ల‌క్ష్యాన్ని చేరుకునే క్ర‌మంలో కీల‌క అంశాల‌పై దృష్టి సారించింది. ఈ క్ర‌మంలో తెలంగాణ‌ సీఎం కేసీఆర్ త‌న‌య క‌విత ప్రాతినిధ్యం వ‌హిస్తున్న నిజామాబాద్ ఎంపీ స్థానంపై బీజేపీ స్పెష‌ల్ ఫోక‌స్ పెట్టిన‌ట్లు క‌నిపిస్తోంది. టీఆర్ఎస్‌ రాజ్యసభ స‌భ్యుడు అయిన ఎంపీ డీ.శ్రీనివాస్‌ రెండో కుమారుడు ధర్మపురి అరవింద్‌ బీజేపీలో చేర్చుకున్న సంగ‌తి తెలిసిందే. గ‌త నెల 17న కేంద్ర హోం మంత్రి రాజ్‌ నాథ్ సింగ్ సమక్షంలో కాషాయదళ తీర్థం పుచ్చుకున్నారు. అయితే బీజేపీలోకి ఎంట్రీ త‌ర్వాత డీఎస్ త‌న‌యుడికి విశేష ప్రాధాన్యం ద‌క్కుతోంద‌ని అంటున్నారు.

తాజాగా గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా బీజేపీ కార్యాల‌యంలో నిర్వ‌హించిన ప‌లు కార్య‌క్ర‌మాలు ఇందుకు ఉద‌హ‌రిస్తున్నారు. గాంధీ జ‌యంతి సంద‌ర్భంగా బీజేపీ రాష్ట్ర అధ్య‌క్షుడు డాక్ట‌ర్ ల‌క్ష్మ‌ణ్‌ - ఆ పార్టీ శాస‌న‌స‌భాపక్ష నేత జి.కిష‌న్ రెడ్డి స‌హా పార్టీ ముఖ్య‌నేత‌లు నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో అర‌వింద్ పాల్గొన్నారు. సాధార‌ణంగా రాష్ట్రపార్టీ కార్యాక్ర‌మాల్లో జిల్లా స్థాయి నేత‌లు పాల్గొన‌డం అనేది అత్యంత అరుదు. పైగా ఇప్ప‌టివ‌ర‌కు అధికారికంగా ఇటు జిల్లా - అటు రాష్ట్ర ప‌రిధిలోనూ ధ‌ర్మ‌పురి అర‌వింద్‌ కు ఎలాంటి ప‌ద‌విని అధికారికంగా క‌ట్ట‌బెట్ట‌లేదు. అంతేకాకుండా ఆయ‌న పార్టీలో చేరి క‌నీసం నెల‌రోజులు కూడా కాలేద‌ని..స‌రిగ్గా లెక్కేస్తే.... కేవ‌లం ఇర‌వై రోజులు మాత్ర‌మే అయింద‌ని అంటున్నారు.

దీంతోపాటుగా పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి రాంలాల్ ముఖ్యఅతిథిగా ఆహ్వానించి రాష్ట్ర కార్యాల‌యంలో నిర్వ‌హించిన కీల‌క‌ స‌మావేశంలో కూడా డీఎస్ త‌న‌యుడికి స్థానం కల్పించిన‌ట్లు స‌మాచారం. ఈ సంద‌ర్భంగా అధికార‌ టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోవ‌డం, మిగ‌తా విప‌క్షాల కంటే దూకుడుగా ముందుకు సాగ‌డం వంటి అంశాల‌ను చ‌ర్చించిన‌ట్లు తెలుస్తోంది. ఇంత‌టి కీల‌క స‌మావేశాలు - కార్య‌క్ర‌మాల్లో అర‌వింద్‌ కు స్థానం క‌ల్పించ‌డం అంటే...ఆయ‌న‌కు కీల‌క బాధ్య‌త‌లు అప్ప‌గించే అవ‌కాశం ఉంద‌ని అంటున్నారు. ఇదంతా తెలంగాణ సీఎం కేసీఆర్‌ ను, ఆయ‌న త‌న‌య ఎంపీ క‌వితను టార్గెట్ చేసుకొని బీజేపీ ప‌న్నుతున్న వ్యూహ‌మ‌ని విశ్లేషిస్తున్నారు.

కాగా, అరవింద్ వచ్చే లోక్‌ స‌భ ఎన్నికల్లో నిజామాబాద్‌ నుంచి బీజేపీ అభ్యర్థిగా బరిలోకి దిగే అవకాశముందని తెలుస్తోంది. అరవింద్ పంద్రాగస్టున ప్రధానమంత్రి నరేంద్ర మోడీకి అనుకూలంగా ఓ జాతీయ దినపత్రికలో ఇచ్చిన ప్రకటన కలకలం సృష్టించింది. దీంతోనే ఆయ‌న బీజేపీ ఎంట్రీ ఖ‌రారైంది.కాగా, తన కొడుకు బీజేపీలో చేరతారన్న వార్తలను డీఎస్ మొద‌ట తోసిపుచ్చారు. అనంతరం ఓ మీడియా సంస్థ‌తో మాట్లాడుతూ కొడుకులు తన మాట వినడం లేదని కూడా ఆయన వాపోయారు. తాను మాత్రం టీఆర్‌ ఎస్‌ లోనే ఉంటానని, పార్టీని విడిచిపోనని తేల్చి చెప్పారు.