Begin typing your search above and press return to search.

ముహుర్తం ఖ‌రారు..కాంగ్రెస్ గూటికి డీఎస్‌

By:  Tupaki Desk   |   4 Aug 2018 4:55 PM GMT
ముహుర్తం ఖ‌రారు..కాంగ్రెస్ గూటికి డీఎస్‌
X
తెలంగాణ రాజ‌కీయాల్లో మ‌రో హాట్ వార్త రాజ‌కీయ వ‌ర్గాల్లో చ‌ర్చనీయాంశంగా మారింది. సీనియ‌ర్ నేత‌ - టీఆర్ ఎస్ రాజ్యసభ సభ్యుడు ధర్మపురి శ్రీనివాస్ పార్టీ ఫిరాయింపే ఈ హాట్ అప్‌ డేట్. పార్టీ మార‌డం అనే వార్త‌ కొత్త ప‌రిణామం కాక‌పోయినా అందుకు పేర్కొంటున్న కార‌ణాలే ఆస‌క్తిక‌రంగా ఉన్నాయి. డీఎస్ కుమారుడు సంజయ్ తమను లైంగికంగా వేధిస్తున్నాడంటూ నిజామాబాద్ శాంకరి నర్సింగ్‌ కాలేజీ విద్యార్థినిలు హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మధ్య కాలంలో తమలో ఇద్దరిని సంజయ్ బలవంతంగా తీసుకెళ్లి లైంగిక దాడులు చేయడానికి ప్రయత్నించారని హోంమంత్రికి విద్యార్థినిలు వివరించారు. వారు ప్రతిఘటించడానికి ప్రయత్నిస్తుంటే.. అదే సమయంలో ఓ మేడమ్ రావడం వల్ల వదిలిపెట్టారన్నారు. ఆరు నెలలుగా తమను సంజయ్‌ లైంగికంగా వేధిస్తున్నాడని మొత్తం 11 మంది విద్యార్థిని ఫిర్యాదులో పేర్కొన్నారు. సంజయ్ కి చెందిన శాంకరి కాలేజీలో చదువుతున్న విద్యార్థినులపై సంజయ్‌ లైంగిక వేధింపులు పాల్పడటంపై మహిళా సంఘాలు భగ్గమన్నాయి. తక్షణమే సంజయ్‌ను అరెస్ట్‌ చేయాలనీ - శాంకరి నర్సింగ్‌ కాలేజీ మూసివేయాలని విద్యార్థులు - మహిళా సంఘాలు ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశాయి. దీంతో ఆయ‌న‌పై నిర్భ‌య కేసు న‌మోదు చేశారు.

అనూహ్యంగా డిఎస్‌ తనయుడు సంజయ్‌ పై ప్రభుత్వానికి ఫిర్యాదు అందడం.. పోలీసు శాఖ శరవేగంగా స్పందించడం.. నిర్భయ సహా నాలుగు సెక్షన్‌ల కింద కేసులు నమోదు చేయడంతో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. నిజానికి సంజయ్‌పై ఎప్పటి నుంచో ఆరోపణలున్నాయి. అయితే.. ఉన్నట్టుండి ఇప్పుడే వాటిని తెరపైకి తెచ్చి.. కేసులు నమోదు చేయడం వెనుక రాజకీయ కోణం ఉందన్న భావన విశ్లేషకుల్లో వ్యక్తమవుతోంది. వాస్త‌వానికి డి.శ్రీనివాస్‌, ప్రస్తుతం అధికార పార్టీలోనే కొనసాగుతున్నా, తనయుడిపై కేసు విషయంలో నోరు మెదపలేని పరిస్థితిలో ఉన్నారు. ప్రతిపక్ష పార్టీలో ఉండి ఉంటే.. తన పరిస్థితి, కేసు తీవ్రత మరోవిధంగా ఉండేదని, పార్టీ నుంచి తనను పొమ్మనలేకే పొగబెడుతున్నారన్న వాదనను ప్రజలకు వినిపించేందుకు డీఎస్ సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది.తాజా పరిణామాల నేపథ్యంలో ఆగ‌స్టు రెండో వారంలో కాంగ్రెస్ అధ్య‌క్షుడు రాహుల్ గాంధీ పర్యటనలో ఆయ‌న‌ కాంగ్రెస్ గూటికి చేరతారన్న ప్రచారం ఇప్పటికే జోరందుకుంది.

మ‌రోవైపు మరోవైపు.. మహిళా, ప్రజాసంఘాలు సంజయ్‌ వ్యవహారాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నాయి. పదకొండు మంది విద్యార్థినులు సంజయ్‌ వేధింపులపై రోడ్డెక్కితే.. దీన్ని రాజకీయ కుట్రగా అభివర్ణించడాన్ని.. మహిళా, ప్రజా సంఘాలు తప్పుబడుతున్నాయి. ఆయన దిగజారుడు రాజకీయాలు మానుకోవాలని, పోలీసులు అతడిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్‌ చేశారు.