ముహుర్తం కుదిరింది.. కారు దిగేసి హస్తం గూటికి డీఎస్!

Mon Jan 17 2022 11:17:51 GMT+0530 (IST)

d srinivas joined in congress party

గడిచిన కొంతకాలంగా టీఆర్ఎస్ పార్టీని వీడతారంటూ ప్రచారం జరుగుతున్న తెలంగాణ సీనియర్ నేత డి. శ్రీనివాస్.. తిరిగి కాంగ్రెస్ లోకి వచ్చేందుకు వీలుగా అన్ని ఏర్పాట్లు జరిగిపోయినట్లుగా చెబుతున్నారు. కాంగ్రెస్ లో ఉన్న తనను.. టీఆర్ఎస్ లోకి తీసుకెళ్లిన కేసీఆర్..ఆ సందర్భంలో ఇచ్చిన మాటను.. చేసిన హామీని నిలబెట్టుకోకపోవటం.. టీఆర్ఎస్ పార్టీ తీరు ఆయన ఏ మాత్రం జీర్ణించుకోలేకపోతున్నారు. కాంగ్రెస్ ను వదిలి వచ్చి.. తప్పు చేశానన్నభావన ఆయన పలుమార్లువ్యక్తం చేశారు.అయినప్పటికీ పార్టీ మారే విషయంలో ఆచితూచి అన్నట్లుగా వ్యవహరించారు. తన మనసులోని మాటను దాచుకోకుండా.. అసంత్రప్తిని వ్యక్తం చేసినప్పటికి టీఆర్ఎస్ అధినేత కేసీఆర్ మాత్రం కామ్ గా ఉండటం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో తాను కాంగ్రెస్ కు తిరిగి వెళ్లటం మినహా మరో మార్గం లేదన్న నిర్ణయానికి వచ్చేశారు డీఎస్. కాంగ్రెస్ అధినాయకత్వం కూడా ఆయన్ను పార్టీలోకి తిరిగి వచ్చేందుకు ఓకే చెప్పటంతో.. ఆయన గులాబీ కారు దిగేసే టైం దగ్గరకు వచ్చేసినట్లు చెబుతున్నారు.

విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం.. ఈ నెల 24న ఆయన కాంగ్రెస్ లో చేరటం ఖాయమంటున్నారు. ఢిల్లీలో కాంగ్రెస్ అధ్యక్షురాలు సోనియాగాంధీ సమక్షంలోపార్టీలోకి తిరిగి చేరనున్నట్లు చెబుతున్నారు. దీనికి తగ్గట్లే ఏర్పాట్లు జరగనున్నాయి. తాను పార్టీ మారటానికి ముందు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేయాలని డీఎస్ భావిస్తున్నట్లు చెబుతున్నారు. డీఎస్ అన్నంతనే కాంగ్రెస్ అన్న మాట వినిపిస్తూ ఉంటుంది.

1989 నుంచి 2015 వరకుకాంగ్రెస్ పార్టీలోనే కొనసాగిన డీఎస్.. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు అనంతరం.. టీఆర్ఎస్ తప్పించి మరే పార్టీకి తెలంగాణలో అవకాశం లేదన్న భావనకు వచ్చి ఆయన్ను గులాబీ కారులో ఎక్కేయాలని గులాబీ బాస్ కోరటం.. డీఎస్ ఓకే చెప్పటం తెలిసిందే.ఆయనకు రాజ్యసభ పదవికి ఎంపిక చేశారు. కాంగ్రెస్ పార్టీలో పీసీసీ అధ్యక్షుడిగా వ్యవహరించిన ఆయన.. తెలుగు కాంగ్రెస్ పెద్ద తలకాయాల్లో ఒకరిగా ఉండేవారు.

టీఆర్ఎస్ పార్టీలోకి చేరిన తర్వాత తొలుత రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుగా నియమితులైన డీఎస్ కు.. తర్వాత రాజ్యసభ పదవిని కట్టబెట్టారు. అయితే.. నిజామాబాద్ జిల్లాకు చెందిన టీఆర్ఎస్ నేతలు ఆయనకు వ్యతిరేకంగా కేసీఆర్ కు ఫిర్యాదు చేశారు. దీనిపై వివరణఇచ్చేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ ను కలవాలని డీఎస్ ప్రయత్నించారు. కానీ.. ఆయన అపాయింట్ మెంట్ ఇవ్వకుండా దూరం పెట్టేశారు. దీంతో.. అప్పటి నుంచి పార్టీకి దూరమయ్యారు డీఎస్. ఆయనపై ఇంత కోపానికి కారణం.. తన కుమార్తె కవిత ఓటమికి కూడా డి.శ్రీనివాస్ కారణమన్న భావన కేసీఆర్ లో ఉందని చెబుతారు.

2019లో జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో నిజామాబాద్ ఎంపీ స్థానానికి బీజేపీ అభ్యర్థిగా డీఎస్ కుమారుడు అర్వింద్ బరిలోకి దిగటం.. ఆయన గెలుపులో డీఎస్ కీలకభూమిక పోషించారని చెబుతారు. అది కూడా డీఎస్ మీద కేసీఆర్ కోపానికి కారణంగా చెబుతున్నారు. ఈ ఏడాది జూన్ వరకు డీఎస్ రాజ్యసభ సభ్యత్వం ఉంది. ఆ తర్వాత ఎటు కొనసాగింపు అవకాశం లేదు.

ఎలాంటి పదవి లేకుండా టీఆర్ఎస్ లో కొనసాగే కన్నా.. కాంగ్రెస్ లో పెద్ద తలకాయలా ఉండటం మంచిదన్న ఆలోచనకు వచ్చిన డీఎస్.. పార్టీ మారేందుకు సిద్ధమైనట్లు చెబుతున్నారు. ఇప్పటికే రేవంత్ కు వ్యతిరేకంగా పని చేసే వర్గం కాంగ్రెస్ లో బలంగా తయారైన వేళ.. డీఎస్ ఎంట్రీతో సమీకరణాలు ఎలా మారతాయన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది. మొత్తానికి డీఎస్ ఎంట్రీతో తెలంగాణ కాంగ్రెస్ లో కొన్ని మార్పులకు అవకాశం ఉందన్నమాట వినిపిస్తోంది.