Begin typing your search above and press return to search.

కమ్యూనిస్ట్ నేత కూతురు దేశద్రోహా?

By:  Tupaki Desk   |   14 Feb 2016 5:12 AM GMT
కమ్యూనిస్ట్ నేత కూతురు దేశద్రోహా?
X
ఎప్పుడూ లేనిది యూనివర్సిటీల్లో కొత్త కొత్త వివాదాలు తెర మీదకు వస్తున్నాయి. తాజాగా ఢిల్లీలోని జేఎన్ యూలో జరిగిన ఒక వివాదాస్పద కార్యక్రమంలో కమ్యూనిస్ట్ నేత డి రాజా కుమార్తె పాల్గొన్నారన్న ఆరోపణ వినిపిస్తే.. తాజాగా మరో కమ్యూనిస్ట్ అగ్రనేత చేసిన వ్యాఖ్యతో ఇప్పటి వరకూ ఆరోపణ కాస్తా నిజమని తేలిపోయింది. ఓపక్క దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేసే ఈ నేత కుమార్తె.. మరోవైపు ఈ దేశానికి చెందిన పోలీసుల రక్షణ కోరటం గమనార్హం. ఈ మొత్తం వివాదాన్ని వివరంగా చూస్తే..

దేశంలోని మిగిలిన రాజకీయ నాయకులకు.. కమ్యూనిస్టులు.. మజ్లిస్ నేతలు కాస్త భిన్నంగా వ్యవహరిస్తుంటారు. తాము నమ్మింది మాత్రమే నిజమని.. మిగిలినదంతా అబద్ధంగా వారు అనుకోవటమే కాదు.. అందరికి అవే మాటలు చెబుతూ ఉంటారు. జాతీయభావం కంటే కూడా తమవైన సొంత భావజాలానికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తుంటారు. దేశంలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడి వందలాది మంది అమాయకుల ప్రాణాలు తీసిన ఉగ్రవాది అఫ్జల్ గురు ఉరితీతను వ్యతిరేకించటం.. దేశానికి వ్యతిరేకంగా నినాదాలు చేయటం లాంటివి కమ్యూనిస్ట్ భావజాలాన్ని బలంగా నమ్మేటోళ్లు మాత్రమే కాదు వారికి తోడుగా మజ్లిస్ నేతలు ఉంటారు.

అఫ్జల్ గురుకు విధించిన ఉరిశిక్ష.. దాన్ని అమలు చేసే విషయంలో జరిగిన కొన్ని అంశాల్ని ప్రస్తావించటం.. అదే సమయంలో అఫ్జల్ కు మద్దుతుగా.. ఆ పేరుతో భారత్ కు వ్యతిరేకంగా నినాదాలు చేయటాన్ని ఏమనాలి? ఇలాంటి ఉదంతమే హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో ఆ మధ్య చోటు చేసుకోగా.. ఈ మధ్యన ఢిల్లీలోని జేఎన్ యూలో జరిగిన అఫ్జల్ గురు సంస్మరణ సభలో సీపీఐ జాతీయ కార్యదర్శి డి.రాజా కుమార్తె అపరాజిత పాల్గొనటం కలకలం రేపుతోంది. ఫేస్ బుక్ తో పాటు..సామాజిక సైట్లలో కనిపిస్తున్న వీడియో ఇప్పుడు కలకలాన్ని రేపుతోంది.

ఒక జాతీయస్థాయి నాయకుడి కుమార్తె.. అఫ్జల్ గురు సంస్మరణ సభకు హాజరుకావటంపై పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తున్నాయి. మరోవైపు.. ఆమె తీరును తప్పు పట్టే వాళ్లతో పాటు.. అలాంటి ఆమెను చంపేస్తామంటూ వార్నింగ్ లు ఇస్తున్నారంటూ కమ్యూనిస్ట్ అగ్రనేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా సీతారాం ఏచూరి కేంద్ర హోంమంత్రి రాజ్ నాధ్ సింగ్ ను కలిశారు. అఫ్జల్ సభలో డి రాజా కుమార్తె హాజరయ్యారని.. ఆమెను చంపేస్తామంటూ పలువురు వార్నింగ్ లు ఇస్తున్నారని.. ఆ విషయాన్ని కేంద్రమంత్రి దృష్టికి తీసుకెళ్లినట్లుగా పేర్కొన్నారు. వారు పాల్గొన్న సభలో జాతి వ్యతిరేక నినాదాలు చేసినట్లు ఆధారాలు ఉన్నాయా? అని సీతారాం ప్రశ్నిస్తున్నారు. అఫ్జల్ గురులాంటి ఒక ఉగ్రవాది సంస్మరణ అంటూ సభను నిర్వహించటమే తప్పు. అమాయకుల ప్రాణాలు బలికొన్న వ్యక్తిని హీరోలా కొలిచే వ్యక్తులు.. జాతి వ్యతిరేక నినాదాలు చేస్తే మాత్రమే తప్పు చేసినట్లా? హత్య చేయకున్నా.. హత్యలు చేసే వారికి మద్దతు పలకటం.. వారికి అండగా నిలవాలని అనుకోవటం లాంటివి సైతం చట్టవ్యతిరేక కార్యకలాపాలన్న సంగతి మర్చిపోకూడదు. మరి.. ఇలాంటి సామాన్య విషయాలు అసమాన్యులైనటువంటి కమ్యూనిస్టు అగ్రనేతల పిల్లలకు తెలీకపోవటం ఏమిటి..? ఉగ్రవాద కార్యకలాపాలతో వందలాది మంది జీవితాల్ని బుగ్గి చేసినోళ్లను సమర్థించే వారంతా దేశద్రోహులే అంటున్న వారి విషయంలో మీ రియాక్షన్ ఏమిటి..?