Begin typing your search above and press return to search.

ప్రముఖ వ్యాపారవేత్త మృతి కేసులో కీలక పరిణామం!

By:  Tupaki Desk   |   6 Nov 2022 5:31 AM GMT
ప్రముఖ వ్యాపారవేత్త మృతి కేసులో కీలక పరిణామం!
X
టాటా సన్స్‌ మాజీ చైర్మన్, ప్రముఖ బిజినెస్‌మేన్‌ సైరస్‌ మిస్త్రీ కారు ప్రమాదంలో సెప్టెంబర్‌ 4 మరణించిన సంగతి తెలిసిందే. ముంబై – అహ్మదాబాద్‌ హైవేపై ఉన్న సూర్య నది వంతెనపై కారు ప్రమాదానికి గురై మిస్త్రీ మరణించారు. ఆ సమయంలో కారు నడుపుతున్న అనహిత పండోలే.. ఆమె భర్త డారియస్‌ తీవ్రంగా గాయపడ్డ సంగతి తెలిసిందే.

అప్పటి నుంచి ముంబైలోని ఒక ఆస్పత్రిలో చికిత్స పొందిన అనహిత పండోలే, డారియస్‌ కొద్ది రోజుల క్రితం ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ అయ్యారు. ఈ నేపథ్యంలో పోలీసులు విచారణను వేగవంతం చేశారు. ప్రమాదాలను తట్టుకునేలా రూపొందించిన కొన్ని కోట్ల రూపాయల విలువైన మెర్సిడెస్‌ బెంజ్‌ కారు ప్రమాదానికి గురి కావడంపై ఈ విచారణ సాగుతోంది.

ఈ నేపథ్యంలో కారు ప్రమాదం జరిగినప్పుడు ముంబైకి చెందిన ప్రముఖ గైనకాలజిస్ట్, డాక్టర్‌ అనహిత పండోల్‌ అనే మహిళ కారును డ్రైవ్‌ చేసిన సంగతి తెలిసిందే. ఆమె నిర్లక్ష్యం వల్లే ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు మొదట తమ విచారణలో నిర్ధారించారు. ఇటీవల ఆమె ఆస్పత్రి నుంచి డిశ్చార్జ్‌ కావడంతో నవంబర్‌ 5న ఆమెపై పోలీసులు కేసు నమోదు చేశారు. మోటారు వాహనాల చట్టంతో పాటు భారతీయ శిక్షాస్మృతి సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు.

ఈ ఘటనపై మహారాష్ట్ర ప్రభుత్వం సైతం విచారణకు ఆదేశించింది. ఇందుకోసం ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసింది. విచారణలో పలువురి నుంచి సాక్ష్యాలు సేకరించింది. ప్రాంతీయ రవాణా కార్యాలయంతో పాటు మెర్సిడెస్‌ ఇండియా నుంచి కూడా నివేదికలు తీసుకున్నారు.

మరోవైపు కారు నడిపి ప్రమాదానికి కారణమైన పండోల్‌ భర్త డేరియస్‌ వాంగ్మూలాన్ని కూడా పోలీసులు తీసుకున్నారు. ఒక దారి నుంచి మరో దారికి మారే క్రమంలో కారు అదుపుతప్పి ప్రమాదానికి గురయిందని డేరియస్‌ చెప్పినట్లు సమాచారం. రిపోర్టులు, దర్యాప్తు ఆధారంగా పండోల్‌ నిర్లక్ష్యపు డ్రైవింగ్‌ కారణంగానే ప్రమాదం జరిగిందని.. దీంతో సైరస్‌ మిస్త్రీ మరణించారని పోలీసులు నిర్ధారించారు.

మరోవైపు ఈ ప్రమాదానికి రోడ్డు లోపం, అతి వేగమే కారణమంటూ హాంకాంగ్‌ మెర్సిడెజ్‌ బెంజ్‌ టీమ్‌ నివేదిక ఇచ్చిన సంగతి విదితమే. మెర్సిడెస్‌ బెంజ్‌ అధికారులు సైతం ప్రమాద స్థలానికి వచ్చి విచారణ చేపట్టారు.