Begin typing your search above and press return to search.

రెండు తెలుగు రాష్ట్రాల్ని ముంచేసే ముప్పు.. ‘నివర్’

By:  Tupaki Desk   |   23 Nov 2020 4:15 AM GMT
రెండు తెలుగు రాష్ట్రాల్ని ముంచేసే ముప్పు.. ‘నివర్’
X
ఉదయం వేళలో మాంచి ఎండ.. సాయంత్రం అయ్యేసరికి చల్లగాలి.. రాత్రికి కూల్ అయిపోతూ.. చలికి వణికిస్తున్న ఈ రోజుల్లో అనుకోనిరీతిలో వచ్చిన ఒక అల్పపీడనం ఈ రోజు (సోమవారం) వాయుగుండంగా.. మంగళవారం నాటికి తుపానుగా మారే ప్రమాదం ఉందని చెబుతున్నారు. ఈ తుపానుకు నివర్ గా పేరును నిర్ణయించారు. దీని ప్రభావం రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు.. తమిళనాడు కూడా ప్రభావితమవుతుందని చెబుతున్నారు.

ఈ నెల 25న తమిళనాడు.. పుదుచ్చేరి తీరన తీరం దాటుతుందని అంచనా వేస్తున్నారు. నివర్ ప్రభావం ఇప్పటికే కోస్తా జిల్లాల్లో ప్రారంభమైనట్లుగా చెబుతున్నారు. రాయలసీమ జిల్లాల్లో మంగళవారం నుంచి వర్షాలు మొదలవుతాయని.. బుధవారం నుంచి తెలంగాణలో వర్షాలు ప్రారంభం కావటం ఖాయమంటున్నారు. ఉరుములు.. మెరుపులతో కూడిన భారీ నుంచి అతి భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాస్త్ర వేత్తలు అంచనా వేస్తున్నారు.

ఆంధ్రప్రదేశ్.. తమిళనాడు తీరాల వెంట అయితే గంటకు 45 నుంచి 75కి.మీ. వేగంతో గాలుగు వీసే అవకాశం ఉందంటున్నారు. ఈ తుపాను ప్రభావం ఈ నెల 26 వరకు ఉంటుందని చెబుతున్నారు. ఇప్పటికే ఆరేబియా సముద్రంలో ‘గతి’ పేరుతో తీవ్రమైన తుపాను కొనసాగుతోంది. ఇప్పుడు బంగాళాఖాతంలో మరో తుపాను దూసుకొచ్చింది. వాతావరణ శాఖ అంచనాల ప్రకారం కోస్తాంధ్రలో 23న అక్కడక్కడ వర్షాలు.. 24నకొన్నిచోట్ల భారీ వర్షాలు.. 25న చాలాచోట్ల వర్షాలు.. పలుచోట్ల భారీ.. అతిభారీ.. అత్యంత భారీ వర్షాలు.. 26న చాలాచోట్ల వర్షాలు.. పలుచోట్ల భారీ.. అతి భారీ అత్యంత భారీ వర్షాలు పడే వీలుంది. రాయలసీమ విషయానికి వస్తే 23న అక్కడక్కడ వర్షాలు.. 24న కొన్నిచోట్ల భారీ వర్షాలు.. 25న చాలా చోట్ల వర్షాలు.. పలుచోట్ల భారీ.. అతి భారీ.. అత్యంత భారీ వర్షాలకు వీలుంది.

తెలంగాణ విషయానికి వస్తే.. 23న వర్షాలకు అవకాశం లేదు. 24న అక్కడక్కడ వర్షాలు పడతాయి. 25న మాత్రం కొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం. 26న చాలాచోట్ల వర్షాలు.. పలుచోట్ల భారీ.. అతి భారీ వర్షాలకు వీలుందని చెబుతున్నారు. తమిళనాడులో మాత్రం 24న అత్యంత భారీ వర్షాలు.. 25న అతి భారీ.. అత్యంత భారీ వర్షాలు పడతాయన్న ప్రమాద హెచ్చరికలు జారీ కావటం గమనార్హం.