Begin typing your search above and press return to search.

డాబుల బాబు అసలు కథ ఇది?

By:  Tupaki Desk   |   4 Dec 2018 7:40 AM GMT
డాబుల బాబు అసలు కథ ఇది?
X
అవకాశం దొరికినప్పుడల్లా సైబరాబాద్ నిర్మాత నేనే అని చెప్పే చంద్రబాబు అడ్డంగా దొరికిపోయారు. ఆయన మాటలు కేవలం ఉత్త బుర్ర కథే అని నిరూపితమైంది. వినేవాడుంటే.. అసలు విషయం లేని అంశాన్ని ఆద్యంతం ఆసక్తికరంగా చెప్పుకునే చంద్రబాబు.. హైదరాబాద్ నిర్మాత నేనే అన్నారు. మరి కులీకుతుబ్ షా ఏం చేశాడని కేసీఆర్ ప్రశ్నిస్తే.. వెంటనే సర్దుకున్న ఆయన సైబరాబాద్ కట్టిందినేనేనని ఊదరగొట్టుకుంటూ తెలంగాణలో తిరగడం మొదలుపెట్టారు.

చరిత్ర చెరిగిపోనిది. ఏదో రూపంలో బయటపడుతూనే ఉంటుంది. ‘ది బర్త్‌ అండ్‌ గ్రోత్‌ అఫ్‌ ఇండియన్‌ ఐటీ ఇండస్ట్రీ’ అనే గ్రంథంలో హైదరాబాద్ లో ఐటీ కంపెనీల స్థాపన ఎప్పటి నుంచి మొదలైందని.. అభివృద్ధి, మనుగడ ఎలా సాగించాయన్న అంశాలు కూలంకషంగా ఉన్నాయి. చంద్రబాబు చెప్పుకుంటున్నట్లు ఐటీ పరిశ్రమలు ఆయన హయాంలో ఏమి మొదలవలేదు. 1987లోనే హైదరాబాద్‌లో ‘ఇంటర్‌ గ్రాఫ్‌’ సంస్థ మొదలైంది. పీవీ నరసింహారావు 1991లో ప్రధానమంత్రి అయ్యాక పూర్తి స్థాయిలో దృష్టి సారించారు. 1992లో అప్పటి ముఖ్యమంత్రి నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి ఐటీ పాలసీని తీసుకొచ్చారు. అమీర్‌పేట లోని మైత్రీవనంలో ఐటీ కంపెనీలకు స్థలం కేటాయించారు. కంప్యూటర్‌ మెయింటెనెన్స్‌ కార్పొరేషన్‌ (సీఎంసీ) రీసెర్చ్‌ అండ్‌ డెవలప్‌మెంట్‌ సెంటర్‌ కూడా ఇక్కడే ఏర్పాటైంది.

1987లో రామలింగరాజు తన సమీప బంధువులతో కలిసి సికింద్రాబాద్‌లో ‘సత్యం’ కంప్యూటర్స్‌ను ప్రారంభించారు. 1992లో పబ్లిక్‌ ఇష్యూకి వెళ్లింది. హైదరాబాద్‌లో ఐటీ పరిశ్రమ ఏర్పాటుకు పలువురు ముందుకు రావడంతో 1993లో అప్పటి ముఖ్యమంత్రి కోట్ల విజయభాస్కరరెడ్డి మాదాపూర్‌లో సైబర్‌ టవర్స్‌తోపాటు అక్కడ ఐటీ పరిశ్రమకు అవసరమైన మేరకు భూములు కేటాయించాలని నిర్ణయం తీసుకున్నారు. చంద్రబాబు హయాంలో ఒక్క సైబర్ టవర్ మాత్రమే నిర్మాణం చేసుకుంది. ఈ మేరకు 2004, 2010లో గూగుల్ మ్యాపుల్లో స్పష్టంగా కనిపిస్తోంది. కానీ బాబు దీన్ని కూడా అబద్దాలాడి తనను తాను సైబరాబాద్ నిర్మాతగా పచ్చి అబద్దాలాడుతున్నారు.

సైబరాబాద్‌ ప్రాంతం ఒక నగరంగా రూపుదిద్దుకోవడం ప్రారంభమైంది దివంగత నేత వైఎస్‌ రాజశేఖరరెడ్డి హయాంలోనే. హైటెక్‌ సిటీ నిర్మాణం 2008 నాటికి తుది దశకు చేరుకుని కంపెనీలు పని చేయడం మొదలుపెట్టాయి. 2010 నాటికి సైబరాబాద్‌ పూర్తి స్థాయిలో నిర్మితమైంది.

నేదురుమల్లి జనార్దన్‌రెడ్డి, కోట్ల విజయభాస్కరరెడ్డి తీసుకున్న నిర్ణయాలను ముందుకు తీసుకెళ్లాల్సిన చంద్రబాబు.. రాష్ట్ర ప్రయోజనాలను పక్కన పెట్టి సొంత ప్రయోజనాలను తెరమీదకు తీసుకువచ్చారు. ఏడాది పాటు మాదాపూర్, కొండాపూర్, గచ్చిబౌలి ప్రాంతాల్లో పర్యటించిన ప్రిన్స్‌టన్‌ ఇన్‌స్టిట్యూట్‌ అఫ్‌ ఇంటర్నేషనల్‌ అండ్‌ రీజనల్‌ స్టడీస్‌కు చెందిన రీసెర్చ్‌ స్కాలర్‌ దలేల్‌ బెన్‌బలాలీ సంస్థ ఈ విషయాన్ని వెల్లడించింది. సైబర్‌ టవర్స్‌ శంకుస్థాపనకు ముందే మాదాపూర్ - కొండాపూర్ - గచ్చిబౌలి - నానక్‌రామ్‌గూడ - నల్లగండ్ల ప్రాంతాల్లో చంద్రబాబు. ఆయన బినామీల పేరుతో భూములు కొనుగోలు చేసినట్లు నిర్ధారించింది. చాలా సరసమైన ధరలకు భూములను పేదల నుంచి లాక్కొని రిజర్వ్ గా ఉంచేసుకున్నారు. అంతేగాక, టెండర్లు లేకుండా దానిని ఎల్‌అండ్‌టీకి కేటాయించడం విశేషం.

చంద్రబాబు హయంలో మొదలు కాని పరిశ్రమల గురించి, సైబరాబాద్ నిర్మాణం చేసింది నేనే అని ఆయన చెప్పుకోవడం వల్ల అభాసుపాలవుతున్నారనడంలో సందేహం లేదు. వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్య మంత్రిగా ఉన్నప్పుడు సైబరాబాద్ కు ఓ రూపు తీసుకువచ్చారు. ఈ విషయాన్ని కూడా ఆయన దాచి పెట్టేశారు. చంద్రబాబు అధికారాన్ని అడ్డం పెట్టుకొని రాష్ట్ర ప్రయోజనాలను పక్కనబెట్టి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశారు. అభివృద్ధి చేసిందంతా తానేనని ఏ రాష్ట్ర ముఖ్యమంత్రి చెపుకోని విధంగా చంద్రబాబు ఊదరగొట్టుకోవడం దేనికి నిదర్శనమో ప్రజలే గమనించాలి.