Begin typing your search above and press return to search.

డేటా ఇష్యూలో ఏపీ స‌ర్కారుకు నోటీసులంటే..?

By:  Tupaki Desk   |   5 March 2019 1:31 AM GMT
డేటా ఇష్యూలో ఏపీ స‌ర్కారుకు నోటీసులంటే..?
X
రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇప్పుడు డేటా చౌర్యం ఎపిసోడ్ హాట్ టాపిక్ గా మారింది. ఏపీలో డేటా చౌర్యం జరిగిన‌ట్లుగా వ‌చ్చిన ఫిర్యాదుపై సైబ‌రాబాద్ పోలీసులు విచార‌ణ చేస్తున్నారు. అయితే.. సైబ‌రాబాద్ పోలీసుల తీరుపై కొన్ని వ్యాఖ్య‌లు వ‌స్తున్న వేళ‌.. వాటికి చెక్ చెబుతూ సైబ‌రాబాద్ సీపీ స‌జ్జ‌న్నార్ ఒక మీడియా స‌మావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సంద‌ర్భంగా ఆయ‌న కొన్నికీల‌క వ్యాఖ్య‌లు చేయ‌టం హాట్ టాపిక్ గా మారింది.

అంతేకాదు.. స‌జ్జ‌న్నార్ వ్యాఖ్య‌లు కొన్ని న‌ర్మ‌గ‌ర్భంగా ఉండ‌టం.. ఆయ‌న తీరు కాస్త భిన్నంగా ఉంద‌న్న మాట వినిపిస్తోంది. రెగ్యుల‌ర్ గా ఆయ‌న ప్రెస్ మీట్ల‌కు హాజ‌ర‌య్యే విలేక‌రులు తాజాగా ఆయ‌న నిర్వ‌హించిన మీడియా స‌మావేశం కాస్త భిన్నంగా ఉంద‌న్న మాట చ‌ర్చ‌గా మారింది. ఏపీకి సంబంధించిన డేటా ఒక ఐటీ కంపెనీ దగ్గ‌ర ఉండ‌టంపై కంప్లైంట్ రావ‌టం.. అది కాస్తా రాజ‌కీయ రంగు పులుముకోవ‌టం తెలిసిందే. ఏపీ లోని అధికార.. విప‌క్షాల మ‌ధ్య పొలిటిక‌ల్ వార్ గా మారిన ఈ ఎపిసోడ్ లో సైబ‌రాబాద్ సీపీ మాట్లాడుతూ.. ఐటీ గ్రిడ్స్ సంస్థ డేటా స్కామ్ మీద వ‌స్తున్న ఆరోప‌ణ‌ల వెనుక ఎవ‌రున్నా వ‌దిలే ప్ర‌స‌క్తే లేద‌ని.. క‌ఠిన చ‌ర్య‌లు త‌ప్ప‌వ‌న్న మాట ఆయ‌న నోటి నుంచి కాస్త క‌టువుగా వ‌చ్చింద‌న్న మాట వినిపిస్తోంది. అంతేకాదు.. ఆయ‌న మాట‌ల్లో అవ‌స‌ర‌మైతే ఏపీ ప్ర‌భుత్వానికి కూడా నోటీసులు ఇస్తామ‌న్న కీల‌క వ్యాఖ్య కూడా వ‌చ్చింది.

ఏపీ మంత్రుల‌కు.. అధికారుల‌కు నోటీసులు ఇస్తామ‌ని.. కేసును అడ్డుకోవ‌టానికి ఏపీ పోలీసులు కుట్ర‌లు చేస్తున్నారంటూ కామెంట్ చేయ‌టం హాట్ టాపిక్ గా మారింది. ఐటీ గ్రిడ్స్ వ‌ద్ద‌కు స‌మాచారం ఎలా వ‌చ్చింద‌న్న దానిపై సైబ‌రాబాద్ పోలీసులు ఇప్పుడు దృష్టి సారించారు.

క్లౌడ్ టెక్నాల‌జీతో డేటాను నిక్షిప్తం చేశార‌ని.. ఈ నేప‌థ్యంలో అమెజాన్ కు నోటీసులు ఇచ్చిన‌ట్లుగా సైబ‌రాబాద్ పోలీసులు చెబుతున్నారు. ఈ డేటా ఆధారంగానే ఓట్ల తొల‌గింపు కోసం ఫారం 7 కింద వేల సంఖ్య‌లో ద‌ర‌ఖాస్తులు చేసిన‌ట్లుగా అనుమానిస్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ వెనుక ఏపీకి చెందిన పెద్ద త‌ల‌కాయ‌లు ఉన్న‌ట్లుగా వినిపిస్తున్న వాద‌న ఏపీ అధికార‌ప‌క్షంలో పెను దుమారంగా మారింది.

ఈ వ్య‌వ‌హారంపై తాజాగా ఏపీ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు మాట్లాడుతూ.. త‌మ డేటా విష‌యంలో ఏం చేయాలో త‌మ‌కు తెలుస‌ని.. త‌మ‌పై ఒక కేసు పెడితే నాలుగు కేసులు పెడ‌తామంటూ తీవ్రంగా రియాక్ట్ అయ్యారు. ఇదిలా ఉంటే.. ఏపీ మంత్రి లోకేశ్ కేంద్రంగా ఈ వ్య‌వ‌హారం తిరుగుతున్న‌ట్లుగా అనుమానిస్తున్నారు. ఎందుకంటే.. ఐటీ గ్రిడ్స్ సంస్థ ముఖ్యులు లోకేశ్ కు స‌న్నిహితుల‌న్న మాట వినిపిస్తోంది.

ఇదిలా ఉంటే టీడీపీ నేత‌ల ఆరోప‌ణ‌లు వేరుగా ఉన్నాయి. వైఎస్సార్ కాంగ్రెస్ నేత‌లే 8 ల‌క్ష‌ల ఓట్ల తొల‌గింపున‌కు పాల్ప‌డ్డార‌ని.. వారు చేసి.. ఆ త‌ప్పును త‌మ మీద రుద్దుతున్న‌ట్లుగా వ్యాఖ్యానిస్తున్నారు. ఈ ఎపిసోడ్ లో ఎన్నిక‌ల సంఘం జోక్యం చేసుకోవ‌టంతో పాటు.. అన్ని వ్య‌వ‌స్థ‌లు ఒక్కొక్క‌టికి ఎంట్రీ ఇచ్చే అవ‌కాశం ఉంద‌న్న మాట వినిపిస్తోంది. అదే జ‌రిగితే.. కీల‌క‌మైన ఎన్నిక‌ల వేళ బాబుకు ఇప్పుడున్న స‌వాళ్లు స‌రిపోవ‌న్న‌ట్లుగా కొత్త తిప్ప‌లు త‌యారుగా ఉన్న‌ట్లే.