Begin typing your search above and press return to search.

హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లొచ్చు..కండీషన్స్ అప్లై

By:  Tupaki Desk   |   10 May 2020 5:08 AM GMT
హైదరాబాద్ ఐటీ ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లొచ్చు..కండీషన్స్ అప్లై
X
దగ్గర దగ్గర ఎనిమిది వారాలకు పైనే ఇంటి దగ్గరే ఉండిపోయిన వారు.. ఇప్పుడిప్పుడే బయటకు వస్తున్నారు. ప్రభుత్వం సైతం నిబంధనల్ని కాస్త సడలించింది. హైదరాబాద్ మహానగరంలో కీలకమైన ఐటీ ఉద్యోగులు రానున్న రోజుల్లో ఆఫీసులకు వెళ్లేందుకు వీలుగా అనుమతుల్ని ఇస్తున్నారు. ఈ నేపథ్యంలో ఆఫీసులకు వెళ్లే వారు మరిన్ని జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంటుంది. అంతేకాదు.. కొన్ని నిబంధనల్ని తూచా తప్పకుండా పాటించాల్సిందే.

ఐటీ కంపెనీల్లో 33 శాతం ఉద్యోగుల్ని ప్రభుత్వం అనుమతిస్తున్న నేపథ్యంలో.. ఉద్యోగులు పాటించాల్సిన నిబంధనల్ని సైబరాబాద్ సీపీ సజ్జన్నార్ వెల్లడించారు. ఐటీ కంపెనీ యాజమాన్యాలతో కలిసి సమావేశమైన ఆయన.. ఐటీ ఉద్యోగులు ఉదయం ఏడు గంటల నుంచి 10 గంటల మధ్య లాగిన కావాలన్నారు.

అదే సమయంలో సాయంత్రం మూడు గంటల నుంచి ఆరు గంటల మధ్యలో లాగ్ అవుట్ కావాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ఆ తర్వాత రోడ్ల మీద తిరిగేందుకు అనుమతులు ఉండవు. ప్రతి ఉద్యోగి తన కంపెనీ ఇచ్చిన లెటర్ ను తమ వెంట పెట్టుకోవాల్సి ఉంటుంది. ప్రభుత్వ ఆదేశాల్లో భాగంగా కంపెనీకి హాజరయ్యే 33 శాతం ఉద్యోగుల్లో సదరు ఉద్యోగి ఒకరన్న విషయాన్ని స్పష్టంగా పేర్కొనాలి.

ఉద్యోగుల్ని ఆఫీసులకు తరలించే బస్సుల్లోనూ భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంటుందని స్పష్టం చేశారు. ప్రతి కంపెనీలో శానిటైజేషన్.. ఉద్యోగులకు మాస్కులు తప్పనిసరి అని.. ఉద్యోగులు గుంపులు.. గుంపులుగా ఉండకూడదు. కంపెనీ క్యాంటీన్లకు అనుమతిని ఇవ్వరు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరించే వారి మీద చర్యలు తీసుకుంటారు. సో.. ఆఫీసులకు వెళ్లే వారు అన్ని జాగ్రత్తల్ని పాటించాలన్న విషయాన్ని ఏ మాత్రం మరిచినా ముప్పేనని చెప్పక తప్పదు.